PM Modi retirement: ప్రధాని మోదీ రిటైర్మెంట్ పై కేజ్రీవాల్, అమిత్ షా ల మధ్య మాటల యుద్ధం.. తదుపరి ప్రధాని అమిత్ షా నా?
Amit Shah vs Arvind Kejriwal: లోక్ సభ ఎన్నికల వేడిని మరింత పెంచేలా పార్టీ ల నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. తాజాగా, ప్రధాని మోదీ రిటైర్మెంట్ పై కొత్తగా మరో యుద్ధాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఆయనకు బీజేపీ అగ్ర నేత అమిత్ షా దీటైన సమాధానమిచ్చారు.
Amit Shah vs Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన, ఒక రోజు ముందే జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మాటల దాడిని ప్రారంభించారు. 75 సంవత్సరాలు నిండిన నేతలకు రిటైర్మెంట్ ప్రకటించి పంపించే సంప్రదాయం బీజేపీలో ఉందని, అదే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ విషయంలో కూడా పాటిస్టారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
తదుపరి ప్రధాని అమిత్ షానా?
వచ్చే సంవత్సరం మోదీకి 75 ఏళ్లు నిండిన తరువాత.. ఆయన రిటైర్ అవుతారని, అమిత్ షా ప్రధాని అవుతారని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ కు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే సమాధానమిచ్చారు. నరేంద్ర మోదీ 75 ఏళ్లు నిండిన తర్వాత రిటైర్ అవుతారని, అమిత్ షా ప్రధాని అవుతారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై అమిత్ షా స్పందిస్తూ, ప్రధాని మోదీ 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల కేజ్రీవాల్ సంతోషించడానికి ఏమీ లేదని అన్నారు. ‘‘మోదీజీ 75వ ఏట అడుగుపెట్టినందుకు మీరు సంతోషించాల్సిన అవసరం లేదని అరవింద్ కేజ్రీవాల్ అండ్ కంపెనీకి చెప్పాలనుకుంటున్నాను. 75 ఏళ్లు నిండిన తరవాత నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగకూడదని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు’’ అన్నారు. తదుపరి ప్రధాని కూడా నరేంద్ర మోదీనే ఉంటారని, ఆయన తన పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీలోలో ఎలాంటి గందరగోళం లేదన్నారు.
మోదీకి ఓటేస్తే.. అమిత్ షాకు వెేసినట్లే..
50 రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన మరుసటి రోజు శనివారం కేజ్రీవాల్ తన మొదటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఓటు వేయడం అంటే తదుపరి ప్రధానిగా అమిత్ షాకు ఓటు వేయడమేనని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరం నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండిన తరువాత ఆయన రిటైర్ అవుతారని, ఆ తరువాత అమిత్ షా ప్రధాని అవుతారని, అందువల్ల ఇప్పుడు మోదీకి ఓటు వేస్తే, వచ్చే సంవత్సరం ప్రధాని కావడానికి అమిత్ షాకు ఓటు వేయడమేనని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
అద్వానీని, జోషిని రిటైర్ చేయించినట్లే..
ఎన్నికల ప్రచారంలో బీజేపీపై దాడిని కేజ్రీవాల్ మరింత తీవ్రం చేశారు. ‘‘విపక్ష ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరని వీళ్లు (బీజేపీ) అడుగుతున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17న మోదీకి 75 ఏళ్లు నిండుతున్నాయి. 75 ఏళ్లు పైబడిన వారు రిటైర్ అవుతారని బీజేపీలో ఆయన ఒక నిబంధన పెట్టారు. ఆ ప్రకారం వారు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ తదితరులను బలవంతంగా రిటైర్ చేయించారు. ఇప్పుడు ఆయనే స్వయంగా రిటైర్ అవుతున్నారు. అంతే, అమిత్ షాను ప్రధానిని చేయడానికి మోదీ ఓట్లు అడుగుతున్నారు. మోదీజీ హామీని అమిత్ షా నెరవేరుస్తారా?’’ అని కేజ్రీవాల్ అన్నారు.