Maneka Gandhi: ‘‘వరుణ్ గాంధీకి అందుకే బీజేపీ టికెట్ ఇవ్వలేదేమో.. వేరే కారణం కనిపించడం లేదు’’- మేనకా గాంధీ
2024 లోక్ సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన తల్లి, బీజేపీ నేత మేనకా గాంధీ తొలిసారి స్పందించారు. వరుణ్ కు బీజేపీ టికెట్ నిరాకరించడం వెనుక కారణాన్ని ఆమె వెల్లడించారు. లోక్ సభ టికెట్ లేకపోయినా, ఎంపీగా ఉండకపోయినా, వరుణ్ ప్రజాసేవ కొనసాగిస్తాడని మేనకా గాంధీ అన్నారు.
దివంగత రాజీవ్ గాంధీ సోదరుడు దివంగత సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక్కడ మే 25వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే, ఆమె కుమారుడు, బీజేపీ టికెట్ పై 2014, 2019 ఎన్నికల్లో యూపీలోని ఫిలిబిత్ స్థానం నుంచి గెలిచిన వరుణ్ గాంధీకి బీజేపీ ఈ సారి టికెట్ నిరాకరించింది. దీనిపై మేనకా గాంధీ తొలి సారి స్పందించారు.
అందుకేనేమో..
వరుణ్ గాంధీ గతంలో కొన్ని సందర్భాల్లో సొంత పార్టీని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విటర్ లో పోస్ట్ లు పెట్టారు. పార్టీపై తనకు వ్యతిరేకత లేదని, అవి నిర్మాణాత్మక విమర్శలని ఆయన తరువాత వివరణ కూడా ఇచ్చారు. అయితే, ఆ ట్విటర్ పోస్ట్ ల కారణంగానే ఈ 2024 లోక్ సభ ఎన్నికల్లో ఫిలిభిత్ స్థానం నుంచి వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ ఇవ్వక పోయి ఉండవచ్చని మేనకా గాంధీ అభిప్రాయపడ్డారు. ‘‘అంతకన్నా వేరే కారణం కనిపించడం లేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఫిలిభిత్ నియోజకవర్గంలో వరుణ్ స్థానంలో మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాదను తీసుకోవడం తల్లిగా తనకు బాధ కలిగించిందని, అయితే అది పార్టీ నిర్ణయమని ఆమె అన్నారు. టికెట్ లేకపోయినా వరుణ్ బాగా రాణిస్తాడని తాను నమ్ముతున్నానని మేనకా గాంధీ అన్నారు.
ప్రచారానికి దూరం..
ఫిలిభిత్ లో బీజేపీ టికెట్ రాకపోవడంతో వరుణ్ గాంధీ ప్రస్తుతం క్రియాశీలకంగా లేరు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీల ర్యాలీలకు ఆయన హాజరు కాలేదు. టికెట్ రాకపోవడంతో ఫిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఊహాగానాలు వచ్చాయి, కానీ వరుణ్ గాంధీ 2024 లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. స్వతంత్రంగా లేదా మరే ఇతర పార్టీ నుండి పోటీ చేయలేదు. ఫిలిభిత్ స్థానానికి ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ పూర్తయింది.
తల్లి తరఫున ప్రచారం
మేనకా నియోజకవర్గం సుల్తాన్ పూర్ లో ఈ నెల 25న ఆరో రౌండ్ లో పోలింగ్ జరుగనుండగా, ఆమె తరఫున వరుణ్ గాంధీ ప్రచారం చేసే అవకాశం ఉంది. వరుణ్ ప్రచారానికి రావాలనుకుంటున్నారని, అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మేనకా తెలిపారు.
పిలిభిత్ ప్రజలకు వరుణ్ గాంధీ లేఖ
టికెట్ నిరాకరించిన తరువాత, వరుణ్ గాంధీ పిలిభిత్ నియోజకవర్గం ప్రజలకు ఒక భావోద్వేగ లేఖ రాశాడు. అందులో అతను మూడు సంవత్సరాల వయస్సులో 1983 లో మొదటిసారి పిలిభిత్ కు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 'ఈ రోజు నేను ఈ లేఖ రాస్తున్నప్పుడు లెక్కలేనన్ని జ్ఞాపకాలు నన్ను భావోద్వేగానికి గురిచేశాయి. 1983లో తొలిసారిగా పిలిభిత్ కు వచ్చిన ఆ మూడేళ్ల చిన్నారి తన తల్లి వేళ్లను పట్టుకోవడం నాకు గుర్తుంది. ఏదో ఒక రోజు ఇక్కడి ప్రజలు తన కుటుంబం అవుతారని అతనికి తెలియదు" అని ఆయన లేఖలో పేర్కొన్నారు. పిలిభిత్ ఇచ్చిన ఆదర్శాలు ఎంపీగానే కాకుండా వ్యక్తిగా నా ఎదుగుదలకు, అభివృద్ధికి దోహదపడ్డాయి. మీ ప్రతినిధిగా ఉండటం నా జీవితంలో గొప్ప గౌరవం, మీ ప్రయోజనాల కోసం నా శక్తి మేరకు నేను ఎల్లప్పుడూ గళం విప్పాను" అని ఆయన అన్నారు. ఎంపీగా కాకపోయినా కనీసం కుమారుడిగా అయినా జీవితాంతం మీకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నానని, మునుపటిలా మీ కోసం నా తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. సామాన్యుడి గొంతుకను వినిపించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ పని ఎప్పటికీ కొనసాగాలని మీ ఆశీస్సులు కోరుతున్నానని తెలిపారు. దీని కోసం ఎంత ఖర్చయినా సరే' అని వరుణ్ తెలిపాడు.
ఫిలిభిత్ కంచుకోట
ఫిలిభిత్ నియోజకవర్గం మేనకాగాంధీ, వరుణ్ గాంధీలకు కంచుకోట వంటిది. వారిద్దరూ ఇక్కడి నుంచి పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి. మేనకాగాంధీ 1989లో జనతాదళ్ టికెట్ పై పిలిభిత్ లో గెలిచారు. 1991లో ఓడిపోయారు. 1996లో మళ్లీ గెలిచారు. మళ్లీ 1998, 1999లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2004, 2014లో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2009, 2019 ఎన్నికల్లో వరుణ్ గాంధీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.