Madhavi Latha : ముస్లిం మహిళా ఓటర్ల బురఖా తొలగింపు వివాదం, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై క్రిమినల్ కేసు నమోదు-hyderabad police filed criminal case on bjp mp candidate madhavi latha on remove burqa issue ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Madhavi Latha : ముస్లిం మహిళా ఓటర్ల బురఖా తొలగింపు వివాదం, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై క్రిమినల్ కేసు నమోదు

Madhavi Latha : ముస్లిం మహిళా ఓటర్ల బురఖా తొలగింపు వివాదం, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై క్రిమినల్ కేసు నమోదు

Bandaru Satyaprasad HT Telugu
May 13, 2024 03:30 PM IST

Case On Madhavi Latha : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలింగ్ స్టేషన్‌లో కొంతమంది ముస్లిం మహిళా ఓటర్లను బురఖా తొలగించి వారి గుర్తింపును వెల్లడించాలని కోరినందుకు కేసు నమోదు చేశారు.

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై క్రిమినల్ కేసు నమోదు
బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై క్రిమినల్ కేసు నమోదు

Case On Madhavi Latha : హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవి లతపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలింగ్ స్టేషన్‌లోకి చొరబడి కొంతమంది ముస్లిం మహిళా ఓటర్లను బురఖా తొలగించి వారి గుర్తింపును వెల్లడించమని కోరడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్‌పేట పోలీసులు మాధవి లతపై సెక్షన్ 171 సి, 186 కింద కేసు నమోదు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132తో పాటు, ఐపీసీ 505 (1)(సి) విధులను నిర్వర్తించకుండా ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం సెక్షన్ కింద ఆమెపై కేసు నమోదైంది.

మహిళా ఓటర్ల ముఖాలు సరిపోల్చేందుకే

అంతకుముందు రోజు బీజేపీ అభ్యర్థి మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లోని అజంపురాలోని పోలింగ్ స్టేషన్ ని సందర్శించి ముస్లిం మహిళా ఓటర్లను గురించి ఆరా తీయడం ప్రారంభించారని తెలుస్తోంది. మహిళా ఓటర్లు తమ గుర్తింపును వెల్లడించేందుకు బురఖాను తొలగించాలని మాధవి లత కోరిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. మహిళా ఓటర్ల ముఖాలు వారి ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ (EPIC)లోని చిత్రాలను సరిపోల్చాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు ఉన్నాయని, అందుకే వాటిని సరిచూసేందుకు అక్కడికి వచ్చానని మాధవి లత ఆరోపించారు. పోలీసు సిబ్బంది చాలా నిస్తేజంగా కనిపిస్తున్నారు, వారు యాక్టివ్‌గా లేరని, వారు దేనినీ తనిఖీ చేయడం లేదని ఆమె తన ఎక్స్ లో ట్వీట్ చేశారు.

బురఖా తొలగించమనడం తప్పుకాదు

సీనియర్ సిటిజన్ ఓటర్లు ఇక్కడకు వస్తున్నారని, అయితే వారి పేర్లను జాబితా నుంచి తొలగించారని ఆమె అన్నారు. వారిలో కొందరు గోషామహల్‌లో నివాసం ఉంటున్నారని, అయితే వారి పేర్లు రంగారెడ్డి జాబితాలో ఉన్నాయన్నారు. కొంతమంది మహిళా ఓటర్లను తమ గుర్తింపును ధృవీకరించమని కోరిన తన నిర్ణయాన్ని మాధవి లత సమర్థించుకున్నారు. తన చర్యలో తప్పేం లేదని అన్నారు. తాను అభ్యర్థినని, ముఖానికి మాస్క్‌లు లేదా బురఖా ధరించిన ఓటర్ల ధృవీకరణ పత్రాలను తనిఖీ చేసే హక్కు ప్రతి అభ్యర్థికి ఉందన్నారు. మహిళ అయినందున మహిళల పట్ల తనకు గౌరవం ఉందని మాధవి లత అన్నారు.

బోగస్ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు

“నేను వారి గుర్తింపును వెల్లడించమని మాత్రమే వారిని అభ్యర్థించాను. ఎవరైనా దానిని పెద్ద సమస్యగా చేస్తే, వారు తమ అక్రమాలను బహిర్గతం చేస్తారనే భయంతో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. పలు పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున బోగస్ పోలింగ్ జరిగింది. మరణించిన వ్యక్తుల ఓట్లు కూడా పోల్ అవుతున్నాయి. అజంపురా, గోషామహల్‌లో పోలింగ్ అక్రమాలపై భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాను" అని బీజేపీ అభ్యర్థి మాధవి లత అన్నారు.

ఈ పరిణామంపై ఎంఐఎం స్పందించలేదు. అయితే ముస్లిం మహిళా ఓటర్లు తమ గుర్తింపును వెల్లడించడానికి వారి బురఖాలను తొలగించమని కోరినందుకు మాధవి లతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ కలెక్టర్ ట్వీట్‌ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం