AP Polling : ఏపీలో పోలింగ్ కు సర్వం సిద్ధం-64 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్ట్
AP Polling : ఏపీలో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది సామాగ్రి అందించినట్లు తెలిపారు. ఆర్టీసీ సైతం పోలింగ్ సిబ్బంది, సామాగ్రి తరలింపునకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందన్నారు.
AP Polling : ఏపీలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. జీరో రీపోలింగ్ లక్ష్యంతో ఎన్నికల నిర్వహణ చేపడతున్నామన్నారు. రాష్ట్రంలో 64 శాతం మేర పోలింగ్ స్టేషన్లల్లో వెబ్ కాస్ట్ పెట్టామన్నారు. పోలింగ్ స్టేషన్ల లోపల, వెలుపలా వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. పోలింగ్ బూత్ లోపలికి సెల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నగదు, మద్యం పంపిణీపై ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. వీటిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పోల్ డేటా మానిటరింగ్ సిస్టం పీడీఎంఎస్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఈవీఎంలలో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించేందుకు మెకానిజం ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని సీఈవో ఎంకే మీనా తెలిపారు.
సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూటన్ సెంటర్లలో అందిస్తు్న్నారు. పోలింగ్ సమయాల్లో చేపట్టాల్సిన విధివిధానాలపై అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. సెక్టార్‌ల వారీగా ఎన్నికల సిబ్బందికి పోలింగ్ విధులు అప్పగించారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు, ఇతర సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరుతున్నారు.
ఎన్నికల సిబ్బంది, సామాగ్రి రవాణా కోసం 5458 బస్సులు
మే 13న సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది, సామాగ్రి రవాణా కోసం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు 5458 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇవి ఆర్టీసీ షెడ్యూల్ బస్సులలో సుమారు 55 శాతం బస్సులు అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఓటు వేసేందుకు వచ్చే ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా సర్వీసులు నడుపుతున్నామన్నారు. మే 8 నుంచి 12 తేదీ వరకు హైదరాబాద్ నుంచి 1066, బెంగుళూరు నుంచి 284 ప్రత్యేక బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందన్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.
మీ గమ్యస్థానానికి బస్సు కోసం ఈ నెంబర్ ను సంప్రదించండి
అంతేకాకుండా హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే ప్రయాణికులు అత్యధికంగా ఉండడం వలన రద్దీని బట్టి మరికొన్ని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లాల అధికారులు బస్ స్టేషన్లలో పర్యవేక్షిస్తున్నారన్నారు. ఎక్కడైనా సుమారు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఒకే గమ్యస్థానానికి బస్సు కోసం ఎదురు చూస్తుంటే ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ నెంబర్ 9959111281 సంప్రదించాలన్నారు. ఆ సమాచారాన్ని ఆయా జిల్లాల అధికారులకు తెలియజేసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్టన్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
సంబంధిత కథనం