Karimnagar Polling Arrangements : కరీంనగర్ జిల్లాలో ఓట్ల పండుగకు సర్వం సిద్ధం, 5852 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
Karimnagar Polling Arrangements : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్ కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 29 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునేలా 5852 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.
Karimnagar Polling Arrangements : ఓట్ల పండుగకు సర్వం సిద్ధమయ్యింది. 13వ తేదీ సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 29 లక్షల 79 వేల మంది ఓటర్లు ఉండగా వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా 5852 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 1466 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి వెబ్ క్యాస్టింగ్ తోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 23 వేల మంది ఉద్యోగులు నిమగ్నమయ్యారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఓటర్లను మచ్చిక చేసుకుని నాలుగు ఓట్లు పొందేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు అఖరి ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంథని, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదు కంపెనీల సెంట్రల్ ఫోర్స్ తోపాటు 3220 మంది పోలీసులతో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు కంపెనీలో సెంట్రల్ ఫోర్స్ తోపాటు 2500 మంది పోలీసులు ఫ్రీ అండ్ ఫేర్ గా పోలింగ్ నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు.
కరీంనగర్ లో 28 మంది అభ్యర్థులు పోటీ
ఎప్పుడెప్పుడా అని గత రెండు మాసాలుగా ఎదురు చూస్తున్న పోలింగ్ డే రానే వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బిఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు పాతిక మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భవితవ్యం తేల్చేపనిలో ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 17లక్షల 97 వేల 150 మంది ఓటర్లు ఉండగా పురుషుల కంటే మహిళ ఓటర్లు 42 వేల మంది ఎక్కువగా ఉన్నారు. వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా 2194 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 288 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పోలింగ్ నిర్వహణ కోసం 10200 మంది సిబ్బందిని, 215 రూట్లలో 216 మంది సెక్టార్ ఆఫీసర్లలను నియమించారు. పోలింగ్ సిబ్బంది ఉదయం పదిగంటల వరకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుని పోలింగ్ సరంజామాతో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఈవీఎంలను తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ తో అనుసంధానం చేశారు. 5500 బ్యాలెట్ యూనిట్స్, 2743 కంట్రోల్ యూనిట్స్, 3077 వీవీ ప్యాట్స్ ఏర్పాటు చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కోరారు.
పెద్దపల్లి లో 33 మంది అభ్యర్థులు పోటీ
ఎస్సీ రిజర్వుడు స్థానమైన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పెద్దపల్లిలో 33 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 15 లక్షల 96 వేల 430 మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఓటుహక్కు వినియోగించుకునేలా 1850 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 221 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 497 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 131 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. తీవ్రవాద నక్సల్స్ ప్రాభల్యం గల మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. మిగతా చోట్ల పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ విధుల కోసం 10216 మంది సిబ్బంది నియమించారు. పోలింగ్ సిబ్బంది అంతా ఈవీఎంలు, పోలింగ్ సరంజామాతో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
భారీగా నగదు, మద్యం పట్టివేత
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తనిఖీల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 9 కోట్ల వరకు నగదు పట్టుకున్నారు. అందులో రెండు కోట్ల 16 లక్షల రూపాయల విలువ చేసే మద్యం సీజ్, నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి సీజ్ చేశారు. కోడ్ ఉల్లంఘన కింద 16 కేసులు నమోదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిదిలో 2500 మంది పోలీసులతోపాటు 4 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ తో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతి హెచ్చరించారు. ఇటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తనిఖీల్లో ఇప్పటి వరకు 2 కోట్ల 12 లక్షల 23 వేల 742 రూపాయలను సీజ్ చేశారు. నక్సర్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఐదు కంపెనీలో సెంట్రల్ ఫోర్స్ తోపాటు 3220 మంది పోలీసులతో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించే చర్యలు చేపట్టినట్లు రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు.
HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR
సంబంధిత కథనం