Karimnagar : కారు దిగిన 10 మంది BRS కార్పొరేటర్లు - కరీంనగర్ సిటీలో మారుతున్న లెక్కలు..!
Karimnagar BRS Corporators : కరీంనగర్ నగరంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన పది మంది కార్పొరేటర్లు… కాంగ్రెస్ లో చేరారు. కీలకమైన పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ చేరికలు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చాయి.
Karimnagar Municipal Corporation News: పార్లమెంట్ ఎన్నికల వేళ కరీంనగర్ లో బిఆర్ఎస్(BRS) కు బిగ్ షాక్ తగిలింది. పోలింగ్ కు గడువు దగ్గర పడుతుండటంతో కారులో కల్లోలం చెలరేగుతుంది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన ముఖ్య నేతలు వరుసగా కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు నేతలు.. ఎన్నికల తర్వాత పార్టీ అధికారం కోల్పోగానే మరికొందరు వరుసబెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం గులాబీ నేతలకు మింగుడుపడడం లేదు. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడంతో కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా చెలామణి అవుతూ వచ్చినా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోకపోవడంతో పరిస్థితి తలకిందులైంది.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన కరీంనగర్(Karimnagar) జిల్లాలో బిఆర్ఎస్ ఘోరంగా చతికిలపడింది. 13 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం ఐదు చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. అయినా కూడా మేకపోతు గాంభీర్యంతో తమదే పైచేయిగా నిలుస్తుందన్న రీతిలో గులాబీ నేతలు ప్రకటనలు చేస్తున్నా కింది స్థాయి క్యాడర్ లో ఉత్సాహం కనిపించడం లేదు. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి నేతలు వరుస బెట్టి పార్టీని వీడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అక్కడ నుంచి ఆహ్వానాలు లేకపోయినా కూడా వెంటబడి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటుండటం బీఆర్ఎస్ కు ఇక రాజకీయ భవిష్యత్ లేదన్న ఆలోచనతోనేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
పది మంది కార్పొరేటర్లు జంప్
కరీంనగర్(Karimnagar) నగరంలో బలంగా ఉన్నామని ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చిన బీఆర్ఎస్ కు మున్సిపల్ కార్పొరేషన్ లో గండి పడింది. సిరిసిల్లకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో పది మంది కార్పొరేట్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక్కసారిగా కాంగ్రెస్ బలం 10కి చేరింది. మరో పది మంది కార్పొరేటర్లు కూడా మూడు, నాలుగు రోజుల్లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
పార్టీ మారిన కార్పొరేటర్లు వీరే…
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లలో ఆకుల నర్మద నర్సయ్య, మెండి శ్రీలత చంద్రశేఖర్, చాడగొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్ ఉన్నారు. సరిళ్ళ ప్రసాద్, పిట్టల వినోద శ్రీనివాస్, గంట కళ్యాణి శ్రీనివాస్, భూమాగౌడ్, కాశెట్టి శ్రీనివాస్ , ఆకుల ప్రకాష్ హస్తం గూటికి చేరారు. వీరితోపాటు కరీంనగర్ అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ డైరెక్టర్లు అనరాసు కుమార్, వీరారెడ్డి, బొమ్మరాతి సాయికృష్ణ, ఎంఏ మతిన్, మాజీ కార్పొరేటర్ పత్తెం మోహన్ తదితరులు ఉన్నారు.
ఫలించని మేయర్ మంతనాలు..
కార్పొరేటర్లు పార్టీని వీడటం ఖాయమని సమాచారం అందుకున్న మేయర్ సునీల్ రావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ రెండు రోజులుగా కార్పొరేటర్లతో ఎడతెగని మంతనాలు జరిపారు. బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. పార్టీకి భవిష్యత్ ఉంటుందని.. గంగుల కమలాకర్, వినోద్ కుమార్ నాయకత్వంలో కలిసి వెల్దామని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అన్నింటికీ సరేనంటూనే కార్పొరేటర్ల కుటుంబాలు గుట్టుచప్పుడు కాకుండా సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
పది మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం గులాబీ నేతలకు మింగుడుపడటం లేదు. ఇప్పటికే కరీంనగర్, కొత్తపల్లి జడ్పిటీసీలు పురుమల్ల లలిత, పిట్టల కరుణ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కార్పొరేటర్లు, ముఖ్య నేతలు కూడా పార్టీలో చేరడంతో ఇక ఇటు నగరంలోనూ.. అటు గ్రామాల్లోనూ వలసలు ముమ్మరమయ్యే అవకాశాలు ఉన్నా యని ఆందోళన చెందుతున్నారు.
రాజకీయ భవిష్యత్ కోరుకునే ద్వితీయ శ్రేణి నేతలు, సర్పంచు, ఎంపీటీసీ స్థాయి నేతలందరూ కూడా తాజాగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుండటంతో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే నాటికి వలసలు జోరుగా సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించినా… తాజా పరిణామాలతో వలసలకు బ్రేక్ వేయడం అసాధ్యమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోడ్ కుమార్ ఏ విధంగా ముందుకు వెళ్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
45 మ్యాజిక్ ఫిగర్ పైనే నజర్…!
నగరపాలక సంస్థలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మరో ఆరు నెలలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 45 పైనే ప్రస్తుతం అందరి దృష్టిపడింది. నగరంలో 60 డివిజన్లు ఉండగా, మూడొంతుల మెజార్టీకి 45 సీట్లు అవసరం. నగరపాలకసంస్థకు 2020లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధికారం చేపట్టింది. 33 స్థానాల్లో టీఆర్ఎస్, 13 స్థానాల్లో బీజేపీ, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు ఐదుగురు, టీఆర్ఎస్ రెబెల్స్ ముగ్గురు గెలుపొందారు.
అనంతరం మారిన పరిణామాలతో బీజేపీ నుంచి ఐదుగురు, స్వతంత్రులు నలుగురు, రెబెల్స్ ముగ్గురు బీఆర్ఎస్ లో చేరారు. ఒక స్వతంత్రుడు ఎంఐఎం లో, బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకరు బీజేపీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ కు 44, బీజేపీకి 9, ఎంఐఎంకు 7గురు కార్పొరేటర్లయ్యారు. మారిన తాజా పరిస్థితుల్లో 11మంది పార్టీ మారడంతో… బీఆర్ఎస్ కు 33, కాంగ్రెస్ కు 11, బీజేపీకి 9, ఎంఐఎంకు 7 స్థానాలున్నాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రెండో విడత చేరికలు కూడా ఉంటాయని ప్రచారం ఉంది. దీంతో పార్టీ బలాబలాలు ఇంకా మారే అవకాశం కనిపిస్తోంది.