BRS Gangula Kamalakar : 'కారు' దిగే ప్రసక్తే లేదు - పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన 'గంగుల'
BRS MLA Gangula Kamalakar : పార్టీ మార్పు వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) స్పందించారు. కారు దిగే ప్రసక్తే లేదన్నారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్, బీజేపీలో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
BRS MLA Gangula Kamalakar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారంపై మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) స్పందించారు. తాను కారు దిగే ప్రసక్తేలేదని, కాంగ్రెస్ లో చేరబోనని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. గంగులపై దుష్ర్పచారం చేస్తు బద్నాం చేసేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. తానంటే గిట్టనివారు, తన ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. సోషల్ మీడియాలో సైతం కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. పార్టీ మారే ప్రసక్తేలేదని, కాంగ్రెస్ లేదా బిజేపి లో చేరే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
మైండ్ గేమ్ ఆడుతున్న కాంగ్రెస్…
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ(karimnagar lok sabha constituency) అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్ జాప్యం చేయడంతో గంగుల కమలాకర్ రాక కోసమే అభ్యర్థిని ఎంపిక చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. మైండ్ గేమ్ లో భాగంగా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని గంగుల ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ళ కేసీఆర్ పాలన చూసిన తర్వాత తనతోపాటు రైతులు, ప్రజలు గులాబీ నేత పక్షానే ఉంటామని అంటున్నారని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపి మధ్యనే పోటీ ఉంటుందనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రజల తీర్పు బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందని కరీంనగర్ లో గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు.
ఎండిన పంటలను కేసిఆర్ పరిశీలన…
భూగర్భజలాలు అడుగంటి, కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో సాగునీరు అందించకపోవడంతో ఎండిపోయిన పంటపొలాలను మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిశీలిస్తారని గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఎండిన పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే రైతుల పంటలు ఎండాయని ఆరోపించారు.
కేసీఆర్ రాజకీయాల కోసమే ఎండిన పంటలను పరిశీలిస్తున్నారనే ఆరోపణలపై గంగుల స్పందిస్తూ ప్రతిపక్షాలు ఏడాది వరకు ప్రభుత్వ పనితీరును చూడాల్సి ఉండగా మూడు నెలలకే కాంగ్రెస్ పాలనతో రైతుల ఆగమయ్యే పరిస్థితులు ఉత్పన్నం కావడంతో కేసీఆర్ (KCR)రంగంలోకి దిగారని తెలిపారు. కేసిఆర్ పర్యటన ఖరారు కావడంతో ఆగమేఘాలపై రెండు లిఫ్ట్ ల ద్వారా కాలువలకు నీరందిస్తున్నారని తెలిపారు. ఎండిన పంటలకు ఎకరాన 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసిఆర్ పొలంబాట లో బాగంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మొగ్దుంపూర్ లో ఎండిన పంటలను పరిశీలిస్తారని రైతులు తమ సమస్యలను కేసిఆర్ దృష్టికి తీసుకురావాలని కోరారు.
రిపోర్టింగ్ - K.V.REDDY, Karimnagar, HT Correspondent