Graduate Mlc Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్‌లో తర్జనభర్జన.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు-controversy in brs over the election of mlc of graduates exercise on the selection of candidates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Graduate Mlc Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్‌లో తర్జనభర్జన.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

Graduate Mlc Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్‌లో తర్జనభర్జన.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

HT Telugu Desk HT Telugu
May 01, 2024 09:04 AM IST

Graduate Mlc Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తర్జన భర్జన పడుతోంది. మరోవైపు అభ్యర్థి ఎంపికపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్‌ఎస్‌ తర్జనభర్జన
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్‌ఎస్‌ తర్జనభర్జన

Graduate Mlc Election: నల్గొండ - ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ప్రధాన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తర్జన భర్జనలు పడుతోంది. ఈ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలుగా ఆ పార్టీ ఈ స్థానాన్ని గెలుస్తూ వస్తోంది.

ఆ పార్టీ నుంచి ఈ నియోజకవర్గంలో కపిలవాయి దిలీప్ కుమార్ Dilip Kumar రెండు పర్యాయాలు, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి Palla Rajeswar Reddy రెండు పర్యాయాలు విజయాలు సాధించారు. 2021 లో ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డికి 2027 మార్చి 29వ తేదీ వరకు పదవీకాలం ఉన్నా.. 2023 శాసన సభ ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

దీంతో అనివార్యమైన ఈ ఎన్నికల్లో తమ సిట్టింగ్ సీటును కాపాడుకోవడానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించింది. మల్లన్న 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

అభ్యర్థి కోసం కసరత్తు

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ హై కమాండ్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న ఆశావహులు నాయకత్వాన్ని కలవడం మొదలు పెట్టారు. టికెట్ రేసులో ప్రధాన పోటీ దారుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఉన్నత విద్యామండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

పీడీయస్‌యూ విద్యార్ధి విభాగంలో పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యమ ఆరంభం నుంచి పార్టీలో ఉన్నారని, పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఆయనకు టికెట్ దక్కడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి కి కూడా తనకు అవకాశం ఇవ్వాలని టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదే వరంగల్ జిల్లాకు చెందిన మరో నాయకుడు రాకేష్ రెడ్డి సైతం నాయకుల చుట్టూ టికెట్ కోసం రాయబారాలు నడుపుతున్నారు.

రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలో అధికార ప్రతినిధి హోదాలో పనిచేసి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఈ లెక్కన అధిష్టానం దగ్గర పరిశీలనలో మూడు పేర్లు ఉంటాయని, వారిలో గట్టి అభ్యర్థిని ఎంపిక చేయడానికి నాయకత్వం కసరత్తు చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గ్రాడ్యుయేట్స్ లో ఆసక్తి రేపుతున్న ఎన్నిక

పట్టభద్రులు మాత్రమే ఓటర్లుగా పాల్గొననున్న ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గం 2021 ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోటీ పడ్డాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, సీపీఐ లతో పాటు పలువురు స్వతంత్రులు కూడా బరిలోకి దిగారు.

అంతకు ముందు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉండిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో సారి కూడా పోటీ చేసి విజయం సాధించి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టారు. కానీ, ఆ ఎన్నికల్లో రాజేశ్వర్ రెడ్డికి 1.11 లక్షల ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు 83వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి.

తెలంగాణ జేఏసీ చైర్మన్ తెలంగాణ ఉద్యమాన్ని భుజనా వేసుకున్న ప్రొఫెసర్ కోదండరాం, తన సొంత పార్టీ తెలంగాన జన సమితి (టీజేఎస్) నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలవడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ ఎన్నిక విషయానికి వస్తే.. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది.

గత ఎన్నికల్లో అత్యధిక ఓట్లు తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న ఇపుడు కాంగ్రెస్ అభ్యర్థి, అదే మాదిరిగా మూడో స్థానంలో నిలిచిన ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ కు మద్దతు దారుగా ఉన్నారు. గత ఎన్నికల్లో బరిలో నిలిచిన సీపీఐ కూడా ఇపుడు కాంగ్రెస్ మిత్రపక్షం.. ఇన్ని సానుకూల అంశాలు కాంగ్రెస్ కు ఉండడం కలిసి వస్తుందన్న అభిప్రాయంలో ఉన్నారు.

కేవలం అయిదు నెలల సమయంలోనే కాంగ్రెస్ మీద రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని, అలవికాని హామీలతో తమను మోసం చేసిందన్న అభిప్రాయంలో ప్రజలు ఉన్నారని, పట్టభద్రులు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తారన్న విశ్వాసంలో పార్టీ ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అవుతారో కొద్ది రోజుల్లేనే తేలిపోనుంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )

IPL_Entry_Point

సంబంధిత కథనం