TS Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ కసరత్తు పూర్తి... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి
Telangana Graduate MLC Election 2024 : వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రల ఎమ్మెల్సీ స్థానానికి రాకేశ్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో ఉండగా… మే 27వ తేదీన పోలింగ్ జరగనుంది.
Telangana Graduate MLC Elections 2024: వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి(Anugula Rakesh Reddy) పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీలో చేర్చుకునే సమయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇవ్వగా.. పార్టీ అధినేత కేసీఆర్ రాకేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగిన రాకేశ్ రెడ్డి(Anugula Rakesh Reddy) వివిధ సమస్యలపై తనదైన శైలిలో గళం వినిపించి, చురుకైన వ్యక్తిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత బీఆర్ఎస్(BRS Party) లో చేరి కేటీఆర్ కు విధేయుడిగా కొనసాగుతున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న బరిలో నిలవగా.. బీజేపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఉన్నత విద్య.. పెద్ద పెద్ద కంపెనీల్లో కొలువులు
ఏనుగుల రాకేశ్ రెడ్డి(Anugula Rakesh Reddy) సొంతూరు ప్రస్తుత హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్. వారిది సాధారణ రైతు కుటుంబం కాగా.. ప్రసిద్ధిగాంచిన బిట్స్ పిలానీ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ మేనేజ్ మెంట్ స్టడీస్, మాస్టర్స్ ఫైనాన్స్ డిగ్రీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ కూడా సాధించారు.
తన ప్రతిభతో చిన్న వయసులోనే బెంగళూర్ సిటీ బ్యాంక్ మేనేజర్ గా, జేపీ మెర్గాన్ లాంటి బడా కంపెనీలో బెంగళూరు, అమెరికాలో దాదాపు ఏడేళ్ల పాటు పని చేశారు. ఆ తరువాత ఫేస్ బుక్ కంపెనీలో కొద్దిరోజులు పని చేశారు. చిన్నతనం నుంచి మాటలు, చదువు, ఉద్యోగాలు ఇలా వివిధ అంశాల్లో చురుకైన వ్యక్తిగా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత ఉద్యోగ ప్రస్థానానికి స్వస్తి పలికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
2013లో బీజేపీ గ్రామస్థాయి కార్యకర్తగా చేరి ఆ తరువాత బీజేవైఎం సోషల్ మీడియా ఇన్ఛార్జ్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగారు.
ఎమ్మెల్యే టికెట్ దక్కపోవడంతో బీఆర్ఎస్ లోకి..
ఉన్నత విద్యతో పాటు మంచి వాగ్ధాటి, క్లీన్ ఇమేజ్ తో పాటు కష్టపడి పని చేసే టీమ్ తో ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన రాకేశ్ రెడ్డి… బీజేపీ నుంచి వరంగల్ పశ్చిమ టికెట్ ను ఆశించారు. నియోజకవర్గంలో చురుకుగా కార్యక్రమాలు నిర్వహించారు.
కరోనా కష్టకాలంలో, వరంగల్ వరదల సమయంలో ఎంతోమందికి ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ‘రాకేశ్ రెడ్డి ఈ క్లాసెస్’ యాప్ ను తీసుకొచ్చి ఆన్ లైన్ తరగతులు నిర్వహించారు. జాబ్ మేళాలు నిర్వహించి 500 మందికిపైగా యువతకు ఉపాధి చూపారు. ఈ మేరకు అన్ని వర్గాల ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ సాధించిన ఆయన వరంగల్ వెస్ట్ బీజేపీ టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ పార్టీ అధిష్ఠానం వరంగల్ వెస్ట్ టికెట్ ను పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు కేటాయించింది. రాకేశ్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు.
కేటీఆర్ హామీతోనే బీఆర్ఎస్ లోకి..
బీజేపీకి రాకేశ్ రెడ్డి రాజీనామా చేసిన తరువాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం గులాబీ పార్టీ నాయకుడిగా రాకేశ్ రెడ్డి సేవలందించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి సఫలమయ్యారు. కాగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవ్వగా.. టికెట్ కోసం పల్లె రవి కుమార్, వాసుదేవారెడ్డి, సుందర్ రాజ్ యాదవ్, ఇంకొందరు ప్రయత్నం చేశారు.
ఓ వైపు కేటీఆర్ హామీ, మరో వైపు యువత, విద్యావంతుల్లో మంచి పట్టున్న నేత కావడంతో గులాబీ అధినేత కేసీఆర్ రాకేశ్ రెడ్డి పేరును గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించిన నేపథ్యంలో బలమైన అభ్యర్థికోసం తీవ్ర కసరత్తు చేసిన బీఆర్ఎస్... రాకేశ్ రెడ్డి పేరును ఫైనల్ చేయడంతో పార్టీ శ్రేణుల్లోనే ఉత్సాహం కనిపిస్తోంది.
(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి).
సంబంధిత కథనం