TG Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్.. లబ్ధిదారుల ఎంపికపై క్లారిటీ! 8 ముఖ్యమైన అంశాలు
TG Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో చాలామంది ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం అతి త్వరలోనే శుభవార్త చెప్పబోతోంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చింది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిబంధనలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. మరోవైపు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోంది. ఈ రెండు కారణాల వల్ల లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం అవుతోంది. అయితే.. సమగ్ర కుటుంబ సర్వే గ్రామాల్లో దాదాపు పూర్తి కావొచ్చింది. అటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన నిబంధనలపై క్లారిటీ వచ్చినట్టు ఈ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈనెల చివరి వారంలో ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీలు కాకపోతే.. డిసెంబరు మొదటి వారంలోనైనా ప్రక్రియ ప్రారంభం కానుంది.
2.ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామసభలు ఏర్పాటు చేసి.. ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితా ఖరారు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది.
3.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా అందాలంటే నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వారంలో నిబంధనలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
4.ప్రస్తుతం తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. సర్వే ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీని తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
5.ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. అయితే.. వీటిల్లో ఇప్పటికే ఇళ్ల లబ్ధి పొందిన కుటుంబాలు 12,72,019 ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో లబ్ధిదారుల ఎంపికకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోబోమని.. గ్రామసభల ద్వారానే ఎంపిక ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
6.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి.. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలను కూడా నమోదు చేశారు. వీరి ద్వారానే లబ్ధిదారుల వివరాలను కేంద్ర వైబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు.
7.తొలిదశలో ఇంటి స్థలం ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. నాలుగు దశల్లో రూ.5 లక్షలు చెల్లించనుంది.
8.ఈ ఐదేళ్లలో 20 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. వచ్చే ఏడాది ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి.. ఇల్లు నిర్మించి ఇస్తుందని తెలుస్తోంది.