Warangal Mlc Ticket: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పోటాపోటీ… తెరపైకి పలువురి పేర్లు..-competition for graduate mlc ticket many names on the race ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Mlc Ticket: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పోటాపోటీ… తెరపైకి పలువురి పేర్లు..

Warangal Mlc Ticket: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పోటాపోటీ… తెరపైకి పలువురి పేర్లు..

HT Telugu Desk HT Telugu
May 01, 2024 09:59 AM IST

Warangal Mlc Ticket: ఓ వైపు పార్లమెంట్ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ కావడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ టిక్కెట్ రాకేష్ రెడ్డికి టిక్కెట్ దక్కుతుందా?
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ టిక్కెట్ రాకేష్ రెడ్డికి టిక్కెట్ దక్కుతుందా?

Warangal Mlc Ticket: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న Teenmar Mallanna పేరును ఖరారు చేయగా.. సిట్టింగ్ స్థానం కోసం BRS బీఆర్ఎస్ లో టికెట్‌కు పోటీ నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగుల రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చి ఆయనను BJP బీజేపీ నుంచి గులాబీ పార్టీలో చేర్చుకోగా.. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తరువాత పలువురు ఉద్యమ కారుల పేర్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపు తుందోననే చర్చ జరుగుతోంది.

టికెట్ హామీతో బీఆర్ఎస్‌లోకి రాకేశ్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీ రాష్ట్ర అధికారిగా పని చేసిన ఏనుగుల రాకేశ్ రెడ్డి.. తనకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

విద్యావంతుడు, వాక్చాతుర్యం కలిగిన నాయకుడు కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేశ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు బీఆర్ఎస్ కీలక నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి చొరవతో రాకేశ్ రెడ్డి గులాబీ పార్టీ వైపు అడుగులు వేశారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చి.. రాకేశ్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు.

ఇదిలాఉంటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఎన్నికల కమిషన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేయగా గతంలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాకేశ్ రెడ్డి తనకే టికెట్ దక్కుతుందనే ఆశలో ఉన్నారు.

తెరపైకి ఉద్యమకారులు

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానంపై రాకేశ్ రెడ్డి ఆశలు పెట్టుకోగా.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్‌ నాయకులు క్యూ కడుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ సర్కారులో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన కె.వాసుదేవారెడ్డి ఎమ్మెల్సీ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటి నుంచే గ్రాడ్యుయేట్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సపోర్టుతో ఆయన గులాబీ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. మరోవైపు మాస్టర్ జీ విద్యాసంస్థల అధినేత, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ పేరు కూడా తెరమీదకు వచ్చింది.

మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అనుచరుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న సుందర్ రాజ్ యాదవ్ ఈసారి గ్రాడ్యుయేట్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన విద్యాసంస్థలకు చెందిన గ్రాడ్యుయేట్లు, అధ్యాపకుల యూనియన్లు ఆయనకు మద్దతు ఇస్తారనే ఉద్దేశంతో ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఉద్యమకారుడిగా సుందర్‌రాజు మూడు ఉమ్మడి జిల్లాల్లోని వివిధ కాలేజీలు, విద్యాసంస్థల యజమాన్యాలతో సత్సంబధాలు కూడా కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఉద్యమకారుడిగా, సీనియర్ జర్నలిస్టుగా వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల్లో మంచి పట్టుండటంతో ఆయన బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు పల్లె రవికుమార్కు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఆశావహుల్లో టెన్షన్

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న.. ఈసారి అధికార కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండటంతో సత్తా ఉన్న నాయకుడినే బరిలో దింపాలని గులాబీ పార్టీ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు జిల్లాల్లో మల్లన్నను ఢీకొట్టే నాయకుడెవరనే చర్చ జరుగుతుండగా.. ఇప్పటికే గులాబీ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది.

పార్టీ ముఖ్యనేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వినయ్ భాస్కర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ప్రకటించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎంపీ ఎన్నికల కోసం ఎదురీదుతున్న బీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపైనా గట్టిగానే గురి పెట్టింది. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని, పార్టీ నేతలు చెబుతుండగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఎవరివైపు మొగ్గుచూపుతారోనని ఆ పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది.

(హిందుస్తాన్ టైమ్స్‌ వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం