CM Revanth Reddy : ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు- బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
CM Revanth Reddy : బీజేపీకి అధికారం ఇస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్(karimnagar) లో అరగుండు, నిజమాబాద్(Nizamabad) లో గుండు రాష్ట్రానికి తెచ్చిందేం లేదని, రాష్ట్రానికి పదేళ్లు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డని ఎద్దేవా చేశారు.
CM Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ (SC ST BC Reservations)ల రద్దవుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించాలన్నదే బీజేపీ కుట్ర అన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచన లేకుంటే కులగణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు వస్తున్న మోదీ రిజర్వేషన్లపైన సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. బీజేపీని ఓడిస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దళితులు, బడుగు బలహీనవర్గాలపైన మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తారని తెలిపారు. నేను రిజర్వేషన్లపైన మాట్లాడితే దిల్లీ నుంచి వెంటనే పోలీసులు వచ్చారని తెలిపారు. తెలంగాణ పౌరుషం గుజరాత్ ప్రజలకు తెలిసేలా మోదీని ఓడించాలని కోరారు.
గుండు.. అరగుండు..గాడిదగుడ్డు
కరీంనగర్(karimnagar) లో అరగుండు, నిజమాబాద్(Nizamabad) లో గుండు రాష్ట్రానికి తెచ్చిందేం లేదని, రాష్ట్రానికి పదేళ్లు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డని.. గుడ్డు బొమ్మను సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శించారు. కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది బీజేపీ(BJP) ప్రభుత్వమని విమర్శించారు. చింతమడక నుంచి వచ్చిన కేసీఆర్ కు కరీంనగర్(Karimnagar) ప్రజలు అండగా నిలబడ్డారని సీఎం రేవంత్ అన్నారు. కరీంనగర్ ను వదిలి పాలమూరుకు వస్తే మేం ఆలోచించకుండా గెలిపించామన్నారు. సెమీఫైనల్ లో కేసీఆర్ ను చిత్తు చిత్తుగా ఓడించిన ప్రజలు, ఫైనల్ లో తెలంగాణ పౌరుషం తెలిసే విధంగా మోదీ(Modi)ని ఓడించాలని కోరారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు చేసింది ఏం లేదన్నారు. పునర్విభజన చట్టంలోని ఏ అంశాలను అమలు చేయలేదని తెలిపారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ పార్లమెంటులో తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలను అవమానించేలా మోదీ మాట్లాడారని ఆరోపించారు. తెలంగాణను అవమానించిన బీజేపీకి, బండి సంజయ్ (Bandi Sanjay)కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.
కారు షెడ్డుకు...బస్సులో కేసీఆర్ తిరునాళ్ల యాత్ర
పదేళ్లు కేసీఆర్(KCR) నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపారు..చివరకు ఏమైంది నడుం ఇరిగి మూలకు పడ్డారని ఎద్దేవా చేశారు. కారు కరాబు అయి కార్ఖానాకు పోయింది.. మూలకుపడింది..కారు మూలకు పడింది కాబట్టే కేసీఆర్ బస్సు ఎక్కారని ఎద్దేవా చేశారు. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సు యాత్ర ఉందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్(BJP BRS) మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు. మహబూబ్ నగర్, చేవేళ్ల, భువనగిరి, కరీంనగర్,మల్కాజ్ గిరి లాంటి సీట్లలో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. నల్గొండ, మెదక్ లాంటి సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నది బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. కేసీఆర్ ను ఇండియా కూటమి(INDIA Alliance)లోకి రానివ్వమని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలినా కాల్చి అవతలపారేస్తామన్నారు. 12 సీట్లతో బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చూసే కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కు మద్దతునిచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే ఈ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ నిరుద్యోగులకు మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు (Jobs)ఇచ్చామని, రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా మాట ఇస్తున్న ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. వెలిచాల రాజేందర్ రావును కరీంనగర్ ఎంపీగా లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రాముడి పేరుతో రాజకీయమా?
అయోధ్యలో రాముడి (Ayodhya)కళ్యాణానికి 15 రోజుల ముందే అక్షింతలు పంచారు. ఇది శ్రీరాముడిని అవమానించడమేనని విమర్శించారు రేవంత్ రెడ్డి. హిందువులందరూ ఆలోచించాలి. రాజకీయాల కోసం రాముడిని వాడుకుంటున్నారు. నేను హిందువును..కాని ఓట్ల కోసం హిందుత్వాన్ని వాడుకోం..దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలన్నారు. రాముడి(Lord Sriram)పేరు చెప్పుకొని ఓట్లు అడిగే దిక్కుమాలిన పరిస్థితి కరీంనగర్, నిజామాబాద్ లో ఉందన్నారు.
కాంగ్రెస్ సభలో అపశృతి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ (Karimnagar)జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర(Jana Jatara meeting) సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అపశృతి దొర్లింది. వేసవి ఎండలు మండిపోతున్న తరుణంలో జమ్మికుంట సభకు హాజరైన వృద్ధురాలు ఐలమ్మ ఎండవేడి(Sun Stroke) తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త. సీఎం మీటింగ్ కు వచ్చి ఐలమ్మ ప్రాణాలు కోల్పోవడంతో కాంగ్రెస్(congress) నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
HT Telugu Correspondent K.V.REDDY, karimnagar
సంబంధిత కథనం