Karimnagar Lok Sabha : కరీంనగర్ లో పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్...! ఈసారి ఏ జెండా ఎగరబోతుంది..?
Karimnagar Congress : కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ జోష్ పెంచింది. ఆ పార్టీ అభ్యర్థి రాజేందర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓ రకంగా క్షేత్రస్థాయిలో హస్తం పార్టీ గ్రాఫ్ పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Karimnagar Lok Sabha constituency : కరీంనగర్ లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా..." అభ్యర్థి ఎంపిక ఆలస్యమైనా క్షేత్రస్థాయిలో బలం పెంచుకున్నారా...? రాహుల్ గాంధీ రాకపోయినా ప్రచారం జోరుగా సాగించారా... అంటే ఔననే సమాధానం వస్తుంది. మార్పు కోసం ఓటర్ల ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట కరీంనగర్ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో నిమగ్నమయ్యింది.
త్రిముఖ పోటీ…!
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ పెద్దపల్లి ,కరీంనగర్ ఉండగా కరీంనగర్ లో ఈసారి విలక్షణమైన తీర్పు రాబోతుందా అనే చర్చసాగుతుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు పోటీ చేస్తుండగా బిజేపి నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బిఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు.
ప్రదాన పార్టీల అభ్యర్థులతోపాటు 28 మంది బరిలో నిలిచారు. మూడు ప్రదాన పార్టీల అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం సాగించారు. ప్రచారం ముగిసే సమయం వరకు రాజకీయంగా పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఐదు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు,బిఆర్ఎస్ మూడు స్థానాలు గెలుచుకోగా బిజేపికి ఒక్క సీటు రాలేదు.
కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పటికి ఓట్ల పరంగా చూస్తే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కంటే బిఆర్ఎస్ కు 5249 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఐదు మాసాల్లో పరిస్థితులు తారుమారు అయ్యాయి. అభ్యర్థుల ఎంపిక నాటికి బిజేపి బిఆర్ఎస్ పోటీ నెలకొనగా తాజా పరిణామాల నేపద్యంలో కాంగ్రెస్ గ్రాప్ ఘననీయంగా పెరిగింది. కాంగ్రెస్ బిజేపి మద్య నువ్వా నేనా..? అన్నట్లు పోటీ సాగుతుంది. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.
ముందుకొచ్చిన కాంగ్రెస్…
కరీంనగర్ జిల్లా కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ,బిజేపి మద్య గట్టి పోటీ నెలకొని ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ కు చెందిన గంగుల కమలాకర్ బిజేపి అభ్యర్థి బండి సంజయ్ పై మూడు వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కానీ ఐదు మాసాల్లోనే పరిస్థితి తారుమారు అయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ నామినేషన్ ల చివరిరోజున అభ్యర్థిని వెలిచాల రాజేందర్ రావును కాంగ్రెస్ ప్రకటించగా 17 రోజుల్లోనే అనూహ్యంగా కాంగ్రెస్ గ్రాప్ పెరిగింది.
నగరంలో ముస్లీం మైనార్టీలతోపాటు క్రిస్టియన్ మైనార్టీలు కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అదే విదంగా కులసంఘాల వారిగా కాంగ్రెస్ కు సపోర్ట్ గా నిలువడంతోపాటు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వెలిచాల జగపతిరావు కుమారుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడంతో పాతతరం నాయకులు ఓటర్ల వెలిచాలకు బాసటగా నిలుస్తున్నారు.
నగరంలో శక్తి యాత్రలు..
కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు సైతం ప్రచారం సాగించి ప్రజలతో మమేకం అయ్యారు. చివరి రోజున కరీంనగర్ లో నాలుగు ప్రాంతాల నుంచి శక్తి యాత్రలు నిర్వహించారు. యాత్రలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, డిసిసి అధ్యక్షులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
చివరి రోజున ప్రచారాన్ని పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా హొరెత్తించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని రేపు ఏ పథకం అమలు కావాలన్నా ప్రజలకు మేలు జరగాలన్నా కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలుపు కరీంనగర్ లో మార్పునకు నాందికావాలని కోరారు.
కోడ్ ముగియగానే...రేషన్ కార్డులు, పెన్షన్ లు
పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కొత్త పెన్షన్ లతోపాటు పాత పెన్షన్ అమౌంట్ ను పెంచుతామని, మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు 2500 రూపాయలు త్వరలోనే అందజేస్తామని తెలిపారు.
రైతుల పంట రుణాలు ఆగస్టు 15లోగా మాఫీ చేస్తామని చెప్పారు. ఆరునెలలు కూడా కాక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం పై కక్షగట్టి బిఆర్ఎస్ బిజేపి నేతలు విషం కక్కుతున్నారని విమర్శించారు. బిజేపి పైకి జై శ్రీరాం అంటూనే రిజర్వేషన్ కు రాంరాం చెప్పేందుకు సిద్ధమయ్యిందని ఆరోపించారు. మతాన్ని ప్రేరేపించి గెలువాలని బిజేపి అభ్యర్థి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ఖరారైన బిజేపి బిఆర్ఎస్ కంటే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రజలకు దగ్గరయిందని
ఓట్ల కోసం ఎదైనా చేయడానికి బిజేపి వెనుకాడడంలేదని విమర్శించారు. గోడ మీద పిల్లిలా కేసిఆర్ వ్యవహరిస్తున్నారని, రిజర్వేషన్ల పై కేసిఆర్ వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఆలస్యమైనా ప్రజల నుంచి మాకు మంచి స్పందన ఉందని లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు.