Rahul And Modi: నేడు కరీంనగర్‌కు రాహుల్ గాంధీ, రేపు ప్రధాని మోదీ రాక, 9,10 తేదీల్లో కేసీఆర్ పర్యటనలు
Rahul And Modi: ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో కరీంనగర్ జిల్లాలో వివిఐపి పర్యటనలు షురూ అయ్యాయి. నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరీంనగర్ రానున్నారు. రేపు ప్రధాని మోదీ పర్యటిస్తారు.
Rahul And Modi: పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అగ్రనేతలు క్యూ కట్టారు. వరుసగా కాంగ్రెస్, బిజేపి, బిఆర్ఎస్ నేతలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలతో ప్రచారం చేస్తున్న అభ్యర్థులతోపాటు నాయకులు, ఆఖరి మోఖ అన్నట్లు అగ్రనేతల పర్యటనలు ఖరారయ్యారు.
మే 7న మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కరీంనగర్ లో జరిగే కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొంటారు. 8వ తేదీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు.
మే 9, 10 తేదీల్లో రెండురోజుల పాటు బస్సుయాత్రతో బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రోడ్ తో కరీంనగర్, సిరిసిల్లలో ప్రచారం నిర్వహించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లలో ఆయా పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి ఐదు జన జాతర సభలు
ఎన్నికల ప్రచారంలో బాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నాలుగు జనజాతర సభలు నిర్వహించారు. మరోసభకు సిద్దమయ్యారు.
ఏప్రిల్ 30న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మికుంటలో జనజాతర నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మే 1న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో జన జాతరతో ప్రచారం నిర్వహించారు.
3న పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో, అదే రోజు రాత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల లో జన జాతర సభతో కేంద్రంలోని బిజేపి ప్రభుత్వతీరు, పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కేసిఆర్ వైఖరి బిఆర్ఎస్ తీరును విమర్శించారు. మళ్ళీ రాహుల్ గాంధీతో కలిసి ఏడున మంగళవారం సాయంత్రం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే జనజాతర సభలో పాల్గొంటున్నారు.
జగిత్యాల నుంచి జైత్రయాత్ర కు మోదీ శ్రీకారం
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రచార శంఖారావం పూరించారు. మార్చి 18న జగిత్యాల లో కరీంనగర్ నిజామాబాద్, పెద్దపల్లి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన భారీ బహిరంగ సభతో సమరశంఖం పూరించారు.
ముగ్గురు అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, గోమాసె శ్రీనివాస్ లను ప్రజలకు పరిచయం చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో కమలనాధులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడంతోపాటు అదనంగా పెద్దపల్లిలో సైతం కాషాయజెండా ఎగుర వేయాలని కసరత్తు చేస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా సోమవారం పెద్దపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. 8న మోదీ మరోసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దక్షిణకాశీగా పేరొందిన వేములవాడకు చేరుకుని శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాలొంటారు.
ఇప్పటికే రెండుచోట్ల...మరో రెండు రోజులు కేసిఆర్…
గులాబీ దళపతి కేసీఆర్ కు అచ్చోచ్చిన కలిసొచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే పార్లమెంట్ ఎన్నికల కదనభేరీ మ్రోగించారు. బస్సు యాత్రతో రోడ్ షోలు చేపట్టిన కేసిఆర్, నామినేషన్ ల ప్రక్రియ ముగియగానే ఇప్పటికే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్రతో ప్రచారం నిర్వహించారు.
మే 2న జమ్మికుంటలో రోడ్ షో ఉండగా ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు నిషేధం విధించడంతో మే 3న రాత్రి 8 గంటల తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలోని గోదావరిఖనిలో రోడ్ షో తో ప్రచారం నిర్వహించారు. మరుసటి రోజు 4న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వీణవంకకు చేరుకుని రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు 5న హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంతో ప్రచారం సాగించారు.
చివరగా బస్సు యాత్రతో ఈనెల9న మళ్ళీ కరీంనగర్ కు చేరుకుని కరీంనగర్ లో రోడ్ షో తో ప్రచారం నిర్వహించి ఆ రోజు ఉత్తర తెలంగాణ భవన్ లో బస చేసి మరుసటి రోజు 10న సిరిసిల్లలో బస్సు యాత్రతో రోడ్ షో ద్వారా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజులు ప్రచారం చేసిన కేసిఆర్ మరో రెండు రోజులు ఆఖరి మోఖ గా ఉమ్మడి జిల్లాలో ప్రచారం సాగిస్తుండడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
పార్టీల అగ్రనేతలు వరుస కట్టి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తు ఎన్నికల ప్రచారం సాగిస్తుండడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కీ రోల్ పోషిస్తుందనే ప్రచారం సాగుతుంది.
(రిపోర్టింగ్ కేవీరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాు)