PM Modi Vemulavada: ఎంఐఎంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్న మోదీ, వేములవాడలో ఎన్నికల ప్రచారం
PM Modi Vemulavada: తెలంగాణలో మూడు నెలల్లో డబుల్ ఆర్ టాక్స్ వసూళ్లు, ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల కంటే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు హైదరాబాద్‌లో ఎంఐఎంతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మోదీ ఆరోపించారు.
PM Modi Vemulavada: దక్షిణకాశీగా భావించే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో మూడో దశ ఎన్నికలు ముగిశాయని, కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి ఫ్యూజులు పోయాయని మోదీ అన్నారు. వేములవాడలో బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల సభలో మోదీ పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించే దిశగా ముందుకు పోతున్నామని ప్రధాని చెప్పారు. కరీంనగర్‌లో కూడా బీజేపీ విజయం ఖాయమైందన్నారు. కాంగ్రెస్ అతి కష్టంమీద పోటీలో నిలిచిందని, ఓటమి తప్పదని, బీఆర్‌ఎస్ పార్టీ కనుమరుగై పోయిందని ప్రధాని మోదీ అన్నారు.
పదేళ్ల పాలన ప్రజల ఓటు ద్వారా భారత్ డిఫెన్స్ సామాగ్రిని ఇంపోర్ట్స్ చేసుకునే స్థాయి నుంచి ఎక్స్‌పోర్ట్ చేసే స్థాయికి వచ్చిందన్నారు. ప్రజల ఓటు ద్వారా ఇది సాధ్యపడిందన్నారు. పదేళ్ల బీజేపీ పనితీరును చూశారని, ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశామన్నారు. ప్రజల ఓటుతోనే ఇదంతా సాధ్యపడిందని చెప్పారు. ప్రజలంతా ఓటు వేసి గెలిపించడంతోనే ఇది సాధ్యమైందన్నారు.
ప్రజల రాకపై సంతోషం…
తాను చాలా కాలం గుజరాత్‌లో పనిచేశానని, గుజరాత్‌లో కూడా ఉదయం పదిగంటలకు తన సభ నిర్వహించడానికి ఇంతమంది ఎప్పుడూ రాలేదని, తెలంగాణలో మాత్రం ఉదయాన్నే తాను సభకు వస్తుంటే ఇంకా జనం తరలి వస్తూనే ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఉదయాన్నే తన కోసం ఇంతమంది తరలి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ,ఆర్ధిక రంగాలలో అభివృద్ధి కొరవడిందని, దేశం తిరోగమనంలో ఉండేదన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు అండగా ఉందని, రైతు బంధు పథకం, ఫసల్ భీమా యోజన, నానో ఎరువులు, టెక్స్‌టైల్ పార్కులు, కౌసల్ వికాస్ కోసం బీజేపీ అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించినట్టు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు దోచుకోవడానికి ఉన్నాయని ఆరోపించారు.
కుటుంబ పాలన మాత్రమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల లక్ష్యమని ప్రధాని మోదీ ఆరోపించారు. అవినీతి మాత్రమే వాటి అసలు లక్ష్యమన్నారు. ప్రజల సంక్షేమం గురించి వారికి ఏమాత్రం పట్టదన్నారు. అవినీతి చేత, అవినీతి వల్ల, అవినీతి కోసం అవి పని చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ జీరో గవర్నెన్స్‌గా మార్చేశాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రెండు పార్టీల నుంచి కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
పీవీని గౌరవించని కాంగ్రెస్…
తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ పార్టీల నుంచి కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రధానిగా పనిచేసిన పివి నరసింహరావు వంటి వారికి కూడా తగిన గౌరవం దక్కలేదని, ఆయనకు భారతరత్నతో గౌరవించామని చెప్పారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు, అవినీతి విషయంలో ఇద్దరు తోడు దొంగలేనని ప్రధాని మోదీ ఆరోపించారు.
అవినీతి డబుల్…
ట్రిపుల్ ఆర్ సినిమా కలెక్షన్‌ను డబుల్ ఆర్ కలెక్షన్ మూడు నెలల్లోనే అధిగమించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. డబుల్ ఆర్ ఫ్యాక్టర్ ప్రభావం ఏమిటో ప్రజలకు మూడు నెలల్లోనే తెలిసి వచ్చిందన్నారు.డబుల్ ఆర్ ఢిల్లీకి కప్పం కడుతున్నారని,తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ఆర్ నుంచి విముక్తి రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నగరాన్నిఎంఐఎం పార్టీకి లీజుకు ఇచ్చారని మోదీ ఆరోపించారు.
హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీని బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. దశాబ్దాలుగా హైదరాబాద్‌ను అప్పగించాయని, మొదటి సారి హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ ధీటైన పోటీ ఇస్తుంటే, ఎంఐఎంను గెలిపించడానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎంఐఎం ఓడిపోతుందనే ఆందోళన ఆ పార్టీల్లో ఉందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండికొట్టి ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల పట్ల కాంగ్రెస్‌కు ఎంత వ్యతిరేకత ఉందో చూడాలన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని బీజేపీ భావిస్తుంటే కాంగ్రెస్ పార్టీ దానిని వ్యతిరేకిస్తోందని మోదీ ఆరోపించారు.
బీజేపీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసిందని, రామమందిర నిర్మాణానికి తెలంగాణ నుంచి తలుపులు వచ్చాయని, తెలంగాణ కలపతో రామ మందిర నిర్మాణం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈర్ష్య, ద్వేషంతో రగిలిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాలని, రామ మందిర నిర్మాణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన సంగతి ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
కరీంనగర్‌లో బండి సంజయ్‌ను, పెద్దపల్లి, ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. మోదీ కరీంనగర్ వచ్చాడని ఇంటింటికి వెళ్లి, వారందరికి తాను నమస్కారాలు చెప్పినట్టు చెప్పాలని సభకు హాజరైన వారికి మోదీ విజ్ఞప్తి చేశారు.