Asaduddin on BJP : బీజేపీని ప్రజలు తిరస్కరించాలి... ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ-aimim chief asaduddin owaisi says bjp trying to spread hatred in telangana ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Aimim Chief Asaduddin Owaisi Says Bjp Trying To Spread Hatred In Telangana

Asaduddin on BJP : బీజేపీని ప్రజలు తిరస్కరించాలి... ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (twitter)

Asaduddin on BJP : తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో శాంతి, అభివృద్ధి రెండూ ఉన్నాయని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏఐఎంఐఎం పార్టీ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన... రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు.

Asaduddin on BJP : ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ... బీజేపీపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రజల మధ్య విద్వేషాల వ్యాప్తికి బీజేపీ ప్రయత్నిస్తోందని... సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య మత విభేదాలు సృష్టిచేందుకు చూస్తోందని విమర్శించారు. శాంతి భద్రతల వెల్లివిరయాలంటే బీజేపీ నేతలను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమలం పార్టీ మత రాజకీయాలతో తెలంగాణలో అధికారంలోకి రావాలని యత్నిస్తోందని ఆరోపించిన ఆయన... ప్రజలకు కావాల్సింది శాంతి, అభివృద్ధి మాత్రమేనన్నారు. గురువారం హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో జరిగిన ఏఐఎంఐఎం పార్టీ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో... పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి అసదుద్దీన్ ప్రసంగించారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర విభజన జరిగి.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే తెలంగాణ జీడీపీనే ఎక్కువ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతకల్లోలు లేవని.. శాంతి, అభివృద్ధి రెండూ ఉన్నాయని స్పష్టం చేశారు. యూపీ తరహాలో నేరాల నియంత్రణకు తెలంగాణలోనూ బుల్డోజర్లు వస్తాయన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన అసదుద్దీన్.. రాష్ట్రంలో శాంతి, రాజ్యాంగం కావాలో లేక బుల్డోజర్లు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాలను ఆగం చేసే బుల్డోజర్లను ఎవరూ కోరుకోరని.... ప్రజలు శాంతి భద్రతలు, ఉపాధి, అభివృద్ధి ఆకాంక్షిస్తారని పేర్కొన్నారు.

తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న అసదుద్దీన్.. పార్టీ బాధ్యులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై మండిపడ్డ ఆయన.... రానున్న ఎన్నికల్లో ఓటు వేసే ముందు మహిళలు తమ ఇళ్లల్లోని గ్యాస్ సిలిండర్లకు నమస్కారం చేసి పోలింగ్ కి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

కాగా... త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఈ సారి ఎక్కువగా ఫోకస్ చేస్తోంది... ఏఐఎంఐఎం పార్టీ. అసెంబ్లీలో ప్రస్తుతం ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా హైదరాబాద్ పరిధిలోని వారే కావడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను పెంచుకోవాలని మజ్లిస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ... ఈ సారి ఎన్నికల్లో తమ పార్టీ 50 సీట్లలో పోటీ చేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

WhatsApp channel