AP Exit Polls 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో? అంచనాల కోసం ఇవాళ సాయంత్రం 6:30 గంటల తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది. 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఒపీనియన్ పోల్స్. తుది ఫలితాలు వెలువడటానికి ముందు ఎవరు గెలుస్తారో అంచనా వేసేందుకు పలు పోల్స్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఇది ప్రజల అభిప్రాయాల అంచనా వేస్తుంది. వారి రాజకీయ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని నిలుపుకోవడం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రస్తుతం కష్టసాధ్యమని ప్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు ప్రధాన ప్రత్యర్థి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ, జనసేన కూటమి. అలాగే కాంగ్రెస్ కు సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల నేతృత్వం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ తమ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడుతుండగా... టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల ఏకీకరణపై దృష్టి సారించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియా టుడే నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ 25 లోక్ సభ స్థానాలకు గాను 17 స్థానాలను గెలుచుకుంటుందని, సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ 8 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. డిసెంబర్ 15, 2023 నుంచి జనవరి 28, 2024 మధ్య ఈ సర్వే నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూడడం ఖాయమని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మొత్తం 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 23 సీట్లు గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. 2019లో జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మక విజయం సాధించారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. గత కొన్ని నెలలుగా జగన్ ఘోర పరాజయం దిశగా పయనిస్తున్నారని, ఆయన కేవలం 51 సీట్లకే పరిమితమవుతారని చెప్పారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారితీసే కారణాలను కూడా ప్రశాంత్ కిశోర్ చెప్పారు. జగన్ వరుస తప్పిదాలు ఆయనను ఓటమికి చేరువ చేశాయన్నారు. జగన్ తనను తాను ఆంధ్ర ప్రజలకు భావించడం ప్రారంభించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నాయకులను ఎన్నుకుంటారు. వారు తమ రాజులను లేదా ప్రదాతలను ఎన్నుకోరు... ప్రజలకు నగదు బదిలీ తప్ప మరేమీ అవసరం లేదని జగన్ నమ్ముతున్నారని అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంచనాలు వెలువడనుండగా, ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల అధికారిక ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనాలు మాత్రమేనని, అధికారిక ఎన్నికల ఫలితాలుగా భావించలేమని విశ్లేషకులు అంటున్నారు.
సంబంధిత కథనం