Prashant Kishor: ఎగ్జిట్ పోల్స్ కు కొన్ని గంటల ముందు.. మరోసారి తన అంచనా చెప్పిన ప్రశాంత్ కిశోర్
2024 లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి విజయం సాధించబోతోందని గతంలో చెప్పిన ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్.. శనివారం ఎగ్జిట్ పోల్స్ వెలువడడానికి కొన్ని గంటల ముందు మరోసారి తన అంచనాలను వెల్లడించారు.
Prashant Kishor predictions: ఎగ్జిట్ పోల్ 2024 ఫలితాలు విడుదల కావడానికి కొన్ని గంటల ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే సాధించబోయే సీట్ల సంఖ్యపై తన అంచనాను పునరుద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శనివారం ఏడో దశ పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6.30 గంటలకు పలు జాతీయ, ప్రాంతీయ వార్తా చానళ్లు, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ (exit poll 2024) ఫలితాలను విడుదల చేయనున్నాయి.
2019 ఫలితాల పునరావృతం
2024 లోక్ సభ ఎన్నికల్లో, 2019 లో సాధించిన విధంగానే, బీజేపీకి 303 సీట్లు, లేదా అంతకంటే కొంచెం ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిశోర్ మరోసారి జోస్యం చెప్పారు. ‘‘పశ్చిమ, ఉత్తర భారతంలో సీట్ల సంఖ్యలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించడం లేదు. కానీ, తూర్పు, దక్షిణ భారతంలోని ప్రాంతాల నుంచి బీజేపీకి గణనీయంగా మద్దతు లభించింది’’ అని ప్రశాంత్ కిశోర్ 'ది ప్రింట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
తూర్పు, దక్షిణాది రాష్ట్రాలు సానుకూలం
తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సీట్ల సంఖ్య, ఓట్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ బాగా పుంజుకుందని తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై పెద్దగా అసంతృప్తి లేదు. అలాగే, 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యామ్నాయం కోసం బలమైన డిమాండ్ కూడా లేదు.ః’’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ బిజెపిని మరో విజయం వైపు నడిపించే అవకాశం ఉందని, కాషాయ పార్టీ సీట్ల సంఖ్య 2019 లో అది సాధించిన 303 సీట్ల కన్నా కొంత పెరిగే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ‘‘మోదీ నేతృత్వంలోని బీజేపీ తిరిగి వస్తోందని నేను అనుకుంటున్నాను. వారికి గత ఎన్నికల మాదిరిగానే సంఖ్యాబలం రావచ్చు లేదా కాస్త మెరుగైన సీట్లు రావచ్చు’’ అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు
మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ‘‘ఫండమెంటల్స్ ను పరిశీలించాలి. ప్రస్తుత ప్రభుత్వంపైనా, ఆ పార్టీ నాయకుడిపైనా ఆగ్రహం ఉంటే ప్రత్యామ్నాయ పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉంది. మోదీజీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నట్లు ఇంతవరకు మనం వినలేదు. నిరాశ, నెరవేరని ఆకాంక్షలు ఉండవచ్చు, కానీ విస్తృతమైన కోపం అయితే లేదు’’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
ఏప్రిల్ 19 నుంచి 7 విడతల్లో పోలింగ్..
2024 లోక్ సభ ఎన్నికల మారథాన్ పోలింగ్ ప్రక్రియ ఏప్రిల్ 19న ప్రారంభమై, జూన్ 1న ముగియనుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న జరగనుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం టెలివిజన్ ఛానళ్లు, వార్తా సంస్థలు జూన్ 1 సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ డేటాను, దాని ఫలితాలను ప్రసారం చేయవచ్చు.
తొలి ఆరు దశల్లో పోలింగ్ శాతం
తొలి ఆరు దశల్లో వరుసగా 66.14 శాతం, 66.71 శాతం, 65.68 శాతం, 69.16 శాతం, 62.2 శాతం, 63.36 శాతం పోలింగ్ శాతం నమోదైంది.