CM YS Jagan : సరిగ్గా ఇదే రోజు అధికారంలోకి వచ్చాం..! కౌంటింగ్ వేళ సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్
CM Jagan On Elections : ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గరపడిన వేళ వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతుందని చెప్పుకొచ్చారు.
CM Jagan On Election Results : ఏపీలో ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఓవైపు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా…మరోవైపు ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకునే పనిలో పడ్డాయి.
“దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది” అని వైఎస్ జగన్ తన పోస్టులో రాసుకొచ్చారు
జూన్ 4న ఫలితాలు….
AP Election Results: జూన్ 4న ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్టు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. 4వ తేదీ రాత్రి 8–9 గంటల మద్య అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్టు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఢిల్లీలోని నిర్వచన్ సదన్ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కు నియోజక వర్గాల నుంచి వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభా నియోజకవర్గాల్లో 111 నియోజక వర్గాల్లో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు ఫలితాలు వెలువడనున్నాయి.
మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగనుంది. 111 నియోజక వర్గాల్లో మద్యాహ్నం 2.00 గంటల్లోపు, 61 నియోజక వర్గాల్లో సాయంత్రం 4.00 గంటల్లోపు మరియు మిగిలిన 3 నియోజక వర్గాల్లో సాయంత్రం 6.00 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.