Elections Counting: జూన్‌4న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం-ec orders implementation of section 144 at counting centers across the state on june 4 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Elections Counting: జూన్‌4న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం

Elections Counting: జూన్‌4న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం

Sarath chandra.B HT Telugu
May 28, 2024 09:18 AM IST

Elections Counting: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేయనున్నారు.

కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్ మీనా
కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్ మీనా

Elections Counting: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

కౌంటింగ్‌ ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షించారు. ఎన్నికల సంఘం మార్గ దర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను వేగంగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు.

జూన్‌ 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయొద్దని సూచించారు.

జూన్ 4న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో కొన్ని చోట్ల ఎన్నికలకు సంబంధించిన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు కేటాయించామని, పికెట్లు ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.

సున్నితమైన కేంద్రాలను గుర్తించడంతో పాటు, సమస్యలు సృష్టిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎన్నికల ఫలితాల రోజు 'డ్రై డే'గా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అందుబాటులో ఉండదని సీఈఓ మీనా స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరినీ అనుమతించవద్దని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్ బ్యాక్అప్, ఫైర్ సేప్టీ పరికరాలను సిద్దంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్సులను కూడా సిద్దంగా ఉంచుకోవాలన్నారు.

ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపుకు సంబందించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ముందస్తుగానే శిక్షణ నివ్వాలని, సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐ.టి. పరికాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల సిద్దంగా ఉంచుకోవాలన్నారు.

కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమ పద్దతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తదుపరి “లెక్కింపు పూర్తి అయినట్లుగా” ఆయా ఈవీఎం లపై మార్కుచేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమపద్దతిలో సురక్షితంగా భద్రపర్చాలని సూచించారు. అనవసరంగా ఈవీఎం లను అటూ ఇటూ తరలించొద్దని, ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ETPBMS) ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబందించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రము ఆలశ్యం చేయవద్దని, డిస్‌ప్లే బోర్డుల ద్వారా ఎప్పటి కప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని సూచించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం…

స్ట్రాంగ్ రూంల భద్రతకు 3 టైర్ భద్రతను ఏర్పాటు చేసినట్టు సీఈఓ తెలిపారు. ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూం వద్ద సీసీ కెమరాలను అమర్చామని, అభ్యర్థులు వారి తరుపున ప్రతినిధులు కానీ ఎప్పటికప్పుడు పరిశీలించుకునేందుకు డెక్ మెన్ హాలులో కంట్రోల్ రూంను కూడ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అభ్యర్ధులు లేదా వారి తరుపున ప్రతినిధులు కానీ రోజుకు రెండు సార్లు స్ట్రాంగ్ రూంలను ఫిజికల్ గా పరిశీలించుకునేందుకు అవకాశం కల్పించినట్టు చెప్పారు.

పోలింగ్ తరువాత అక్కడక్కడ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలు కేటాయించటం జరిగిందని, రాష్ట్రంలో పికెట్లు ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, ఘర్షణలకు పాల్పడే అనుమానితులను గుర్తించి వారిపై అవసరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.పల్నాడు జిల్లాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పారు.

WhatsApp channel