EC On Postal Ballot Votes : పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు-ఆర్వో సీల్ తప్పనిసరి కాదు సంతకం ఉన్నా ఓకే!
EC On Postal Ballot Votes : కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ పై ఆర్వీ సీల్ లేకపోతే ఓటును తిరస్కరించొద్దని సూచించింది. ఆర్వో సంతకం ఉంటే ఓట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
EC On Postal Ballot Votes : పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ ఆదేశాలు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ పై ఆర్వో సీల్ లేకపోతే ఓటును తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆర్వో సంతకం ఉన్నా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఫామ్ 13-ఏపై ఆర్ఓ సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని, ఆర్వో సంతకం, బ్యాలెట్ ను ధ్రువీకరించే రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలని సూచించింది. ఫామ్ 13-ఏలో ఓటరు సంతకం, ఆర్వో సంతకం, సీరియల్ నంబర్ లేని పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవచ్చని ఈసీ పేర్కొంది.
అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కల ప్రకారం 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 25,283 ఓట్లతో నంద్యాల జిల్లా ఆ తరువాత స్థానంలో నిలిచింది. 24,918 ఓట్లతో కడప జిల్లా మూడో స్థానంలో ఉంది. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మరోవైపు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అనుగుణంగా.. జిల్లాల్లో కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటుపై ప్రస్తుతం ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ రోజు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించకుండా, ఆర్వో సీల్ లేకపోయినా సంతకం ఉంటే చెల్లుతాయని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 2,38,468 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఈసారి పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య 5 లక్షలు దాటిపోయింది. ఎన్నికల విధుల్లో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఎన్నికల సంఘం మే 4 నుంచి 9 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు పోటెత్తారు. గంటల సమయం క్యూలైన్లలో వేచి ఉండి ఓట్లు వేశారు. ఈ ఓట్లను నియోజకవర్గాల వారీగా కేటాయించి కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. కౌంటింగ్ ప్రారంభం అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లను ముందుగా కౌంట్ చేస్తారు.
కౌంటింగ్ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. జూన్ 4 ఏపీ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తుంది. పోలింగ్ సమయంలో, ఆ తర్వాత ఏపీలోని పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనులు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు, కౌంటింగ్ కు ఆటాంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమించిన డీజీపీ సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం