AP Political factors: ఏపీ ఎన్నికల్లో వీటి ప్రభావాన్ని కూడా విస్మరించకూడదు, జగన్ ప్రభుత్వంలో ప్రతికూల అంశాలు ఇవే…
AP Political factors: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరింది. గెలుపు తమదంటే తమదేనని అటు ఎన్డీఏ కూటమి, ఇటు వైసీపీ వేటికవే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఐదేళ్ల సంక్షేమ పాలనే కాపాడుతుందని అధికార పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఈ క్రమంలో ఎన్నికల్ని ప్రభావితం చేసే కీలక అంశాలు ఇవే…
AP Political factors: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల ప్రభావతం తిరుగులేని పాత్ర పోషిస్తుంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగిన అధికారం మాత్రం రెండు ప్రధాన కులాల మధ్య మార్పిడి వ్యవహారంగానే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, పదేళ్ల ప్రత్యేక రాష్ట్రంలోను ఇదే ధోరణి కొనసాగుతోంది.
ఎన్నికలు, పార్టీలు, ఓట్లు , పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని ఎన్ని మాట్లాడుకున్నా రెండు కులాల మధ్య అధికారం కోసం జరిగే యుద్ధంగానే ఇది సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ గెలుపొటముల్ని ప్రభావితం చేసే కీలక అంశాలు ఇవి.
కులం-వర్గం….
కులం చూడం, మతం చూడం, ప్రాంతం, పార్టీ చూడం, సంక్షేమాన్ని అందించడంలో ఎలాంటి వివక్ష పాటించం అనేది తరచూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చే మాట. కానీ ఐదేళ్లలో కులాభిమానం విషయంలో చంద్రబాబును మించిపోయారనే అపవాదును జగన్మోహన్ రెడ్డి మూటగట్టుకున్నారు.
ఏ కులాభిమానికి, ప్రాధాన్యతకు వ్యతిరేకంగా ఏపీ ఓటర్లు కనీవిని ఎరుగని విధంగా 2019లో ప్రజలు తీర్పు చెప్పారో ఐదేళ్లలో అదంతా తారుమారైంది. కులానికి ప్రాధాన్యత విషయంలో ప్రత్యర్థులకు తానేమి భిన్నం కాదని జగన్ నిరూపించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటర్లలో ఈ అంశం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి వివక్ష ఉండదని ఆయన వర్గం వాదించినా గత ఐదేళ్లుగా అధికార వ్యవస్థను కమ్మేసిన కోటరీ దానిని రుజువు చేస్తుంది.
2.ఇసుక కొరత...
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ప్రధానంగా ఉపాధినిచ్చేది నిర్మాణ రంగమే. బెల్దారి (భవన నిర్మాణ పనులు) పనుల కోసం అటు శ్రీకాకుళం, విజయనగరం మొదలు, ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల వరకు ప్రజలు పట్టణాలకు పెద్ద ఎత్తున వలస పోతుంటారు.
నిర్మాణ రంగంలో పనులు ఉంటనేనే చాలామందికి నిత్యం ఉపాధి దొరుకుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో 9నెలల పాటు ఇసుక క్వారీలను మూసేయడంతో లక్షలాది మంది రోడ్డున పడ్డారు. దాదాపు ఏడాది పాటు పనుల్లేక విలవిలలాడిపోయారు. ఆ వెంటనే కోవిడ్ ముంచుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు, నగదు బదిలీ పథకాల కంటే నిర్మాణ రంగంతో ఉపాధి కోల్పోయిన బాధితుల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటికీ ఏపీలో నిర్మాణ రంగం కోలుకోలేదు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా స్తబ్దుగా ఉంది. నిర్మాణ రంగంలో మాత్రమే పెద్ద ఎత్తున డబ్బు లావాదేవీలు జరుగుతాయి. మనీ సర్క్యులేషన్ ఉంటేనే ఆ ప్రాంతాల్లో ఇతర ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పట్టణాలు, నగరాలు విస్తరిస్తే క్రమంగా ఆ ప్రాంతంలో ఇతర ఉపాధి మార్గాలు పెరుగుతాయి. నగదు ప్రవాహానికి ఒక చైన్ వ్యవస్థ ఏర్పడేది.
ఐదేళ్లలో ఈ తరహా చైన్‌కు బ్రేక్ పడటంతో నివాస ప్రాంతాల విస్తరణ ఆగిపోయింది. ఫలితంగా టైలర్లు, బార్బర్లు,ఇళ్లలో పనిచేసుకునే వారు, ఎలక్ట్రిషియన్లు, బార్బర్లు, పెయింటర్లు, రాడ్ బెండింగ్ పనివాళ్లు, ప్లంబర్లు, సెంట్రింగ్ పనివాళ్లు, నిర్మాణ కూలీలు, మోటర్ మెకానిక్‌లు వంటి వారికి ఉపాధి తగ్గింది. నిర్మాణ కార్మికులు ఇప్పటికీ ఉపాధి వెదుక్కుంటూ హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాల్లో ఇది ప్రధానపాత్ర పోషించనుంది.
మద్యం ధరలు...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలపై దృష్టి పెట్టింది. అప్పటి వరకు ఉన్న రిటైల్ అమ్మకాలకు బ్రేకులు వేసి ప్రభుత్వమే మద్యం విక్రయించే కొత్త పాలసీని తెచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెల్లలోపు మద్యం ధరల్ని దాదాపు రెండు రెట్లు పెంచేశారు. ఆ తర్వాత దశలవారీగా మూడో విడతల 200శాతానికి పెంచిన ధరల్ని 100శాతం పెంపు వద్ద స్థిరీకరించారు. ఫలితంగా ఖజనాకు 2019లో రూ.17వేల కోట్ల రుపాయల ఆదాయం ఉంటే ప్రస్తుతం అది రూ.30వేల కోట్లను దాటేసింది.
అయితే పొరుగు రాష్ట్రాల నుంచి చొరబాట్లను, అక్రమ రవాణా కట్టడి చేయలేక విధిలేని పరిస్థితుల్లో ధరల్ని తగ్గించాల్సి వచ్చింది. మద్యం నియంత్రణ, కట్టడి కోసం ప్రత్యేకంగా ఎస్‌ఈబి అనే వ్యవస్థను ఏర్పాటు చేసి హడావుడి చేసినా అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది.
మద్య నిషేధం సాధ్యం కాదని, ఐదారు రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న ఏపీలో అసలే సాధ్యం కాదనే అవగాహన ఏమాత్రం లేకుండా సంపూర్ణ మద్య నిషేధం అంటూ హడావుడి చేశారు. అయితే ఏటా దాదాపు 30వేల కోట్ల రుపాయల ఆదాయాన్ని ఇచ్చే ఆర్దిక వనరు ఏది ఏపీలో లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న అమ్మఒడి వంటి పథకాలకు మద్యమే ఊపిరి పోస్తోంది.
మద్యం ధరల పెరుగుదల మరో రకంగా ప్రజలపై భారం మోపింది. 2019 ధరలతో పోలిస్తే ప్రస్తుతం మద్యం ధరలు చీప్ లిక్కర్ మొదలు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వరకు రెట్టింపు అయ్యాయి. వినియోగంలో ఉన్న మద్యం బ్రాండ్ల స్థానంలో ప్రభుత్వ దుకాణాల్లో అమ్మే వాటిని మాత్రమే కొనాల్సిన పరిస్థితి కల్పించారు. మద్యం బ్రాండ్ల ఆధారంగా కాకుండా కేవలం వాటి ధరల ఆధారంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నాలుగున్నరేళ్లుగా ఏపీలో ఉంది.
ఇంత చేసినా కర్ణాటక, గోవా మద్యాన్ని నియంత్రించడంలో చేతులు ఎత్తేశారు. ఏపీలో మద్యం ధరలతో వస్తున్న ఆదాయంతో తెలంగాణలో కూడా భారీగా ధరలు పెరిగాయి. అయితే తెలంగాణ మద్యం నాణ్యతతో పోలిస్తే ఏపీ మద్యం నాణ్యతపై వినియోగదారుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక మద్యం కొనుగోళ్ల భారం పడుతున్న వారిలో ప్రధానంగా దినసరి కూలీలు, శ్రమజీవులే ఉన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందుకునే సంక్షేమం కంటే తమ నుంచి ప్రభుత్వం తీసుకునేది ఎక్కువనే భావన ప్రజల్లో ఉంది.
విద్యుత్ ఛార్జీల భారం..
విద్యుత్ ఛార్జీలను పెంచలేదని పదేపదే చెబుతున్న ప్రభుత్వం ఫిక్సిడ్ ఛార్జీల పేరుతో ఐదేళ్లలో భారీగా ప్రజలపై భారం మోపింది. మూడు రకాల స్థిర ఛార్జీలను వసూలు చేస్తున్నారు. విద్యుత్ బిల్లుకు సమానంగా అదనపు ఛార్జీల భారం పడుతోంది. అన్ని వర్గాల ప్రజలపై ఈ భారం ఉంది. ప్రధానంగా పట్టణ ప్రాంత ఓటర్లపై విద్యుత్ బిల్లుల భారం పడుతోంది. విద్యుత్ వినియోగ ఛార్జీలకంటే అదనపు ఛార్జీల భారం ఎక్కువగా వినియోగదారులపై పడుతోంది.
చెత్తపన్ను...
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి చెత్తను సేకరించడం చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. ప్రధానంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చెత్త సేకరణ ప్రక్రియ పదేళ్లకు పైబడి అమల్లో ఉంది. ఇంటి పన్ను వసూళ్లలో భాగంగా అందించే పౌర సేవల్లో చెత్త సేకరణ, రోడ్లను శుభ్రం చేయిస్తారు.ఏపీలో వైసీపీ కొన్నేళ్లుగా చెత్త పన్ను పేరుతో ప్రజలపై భారం మోపడం, అందుకు తగ్గట్టుగా పనితీరు లేకపోవడంపై మునిసిపాలిటీలు, కార్పొరేషన్లపై వ్యతిరేకత పెరగడానికి కారణమైంది.
ప్రభుత్వ సేవల్లో అవినీతి...
అవినీతిని రూపుమాపడానికి ఏసీబీని బలోపేతం చేస్తామన్న మాటలు నీటి మూటలయ్యాయి. పట్టణాల్లో ఎలాంటి సేవలు కావాలన్నా చేతులు తడపనిదే పని కాని పరిస్థితి కల్పించారు. కొత్తగా వచ్చిన సచివాలయ వ్యవస్థతో ప్రతి వీధికి నిఘా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఎలాంటి నిర్మాణం జరిగినా వెంటనే వాలిపోయే టౌన్ ప్లానింగ్ సిబ్బంది, కార్పొరేషన్ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఐదేళ్లుగా జనాన్ని పీల్చుకుతిన్నారు. ఈ ప్రభావం కూడా జగన్‌పై పడుతుంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న ఇళ్లు, పొరంబోకు స్థలాల్లో ఇళ్ల పట్టాల కేటాయింపు వంటి వాటికి ఎక్కడికక్కడ స్థానిక నేతలు జనం నుంచి వసూల్లు చేశారు. ఇంటి పట్టాలు అప్పగించినందుకు కూడా కొన్ని చోట్ల చేతులు తడపాల్సి వచ్చింది.
ఇంటి పన్నుల భారం కూాడా గణనీయంగా పెరిగింది. పట్టణాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు మూడు సార్లు సవరించారు. రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకోడానికి పన్నుల భారం మోపారు. ఆస్తి పన్ను వసూళ్ల కోసం మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పన్ను రేట్లను ఎడాపెడా పెంచేశారు.
వ్యవసాయం, సాగునీరు...
వ్యవసాయంపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు అంశంపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ప్రభుత్వమే కారణమనే భావన ఉభయగోదావరి, కృష్ణా డెల్టా రైతాంగంలో ఉంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోవడంతో పాటు పట్టిసీమ నీటిని కూడా సమర్ధవంతంగా వినియోగించు లేకపోవడంపై డెల్టా రైతాంగంలో అసంతృప్తి ఉంది.
పులిచింతలలో డెడ్ స్టోరేజీ నీటిని కూడా వాడేయడంతో ఈ ఏడాది ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాభావ పరిస్థితులతో ఎగువ ప్రాజెక్టుల్లో నీళ్లన్ని అడుగంటాయి. గత రెండు సీజన్లలో క్రాప్ హాలీడే ప్రకటించాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది.
(ఐదేళ్లలో ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రిని ఎలా మభ్యపెట్టారో మరో కథనంలో)