Mangalagiri SI: పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు తీసుకున్న మంగళగిరి ఎస్సై సస్పెన్షన్, రాజకీయ కుట్రగా ఆరోపిస్తోన్న ఎస్సై
Mangalagiri SI: పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు రాజకీయ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది.
Mangalagiri SI: పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేయించుకున్న మంగళగిరి ఎస్సైపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకుని, రాజకీయ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నట్టు మంగళగిరి టౌన్ పిఎస్‌లో ఎస్సైపై ఆరోపణలు వచ్చాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పిఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబు.. స్వస్థలం ప్రకాశం జిల్లా కురిచేడు.. గత మార్చిలో నెలలో జరిగిన ఎన్నికల బదిలీల్లో భాగంగా మంగళగిరి స్టేషన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. సొంతూరు అయిన కురిచేడులో ఖాజాబాబుకు ఓటు ఉంది.
ఖాజాబాబుతో ఎన్నికల్లో ఓటు వేయిస్తానని ఆయన సమీప బంధువులు ఓ రాజకీయ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు తీసుకుని ఆ డబ్బును ఎస్సైకి ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. ఎన్నికల పోలింగ్ సమయంలో సదరు నాయకుడు డబ్బులు పంపిణీ చేస్తూ ప్రకాశం జిల్లా పోలీసులకు దొరికిపోయాడు.
పోలీసులు అతడిని విచారించిన పోలీసులతో ఎవరెవరికి డబ్బులు ఇచ్చాడో వివరాలు తెలిపాడు. ఖాజాబాబు డబ్బులను వారి బంధువులకు ఇచ్చినట్లు చెప్పడంతో ప్రకాశం పోలీసులు వారిని విచారించారు. ఖాజాబాబుపై ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీకి నివేదిక పంపారు. దీంతో ఖాజాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీచేశారు.
మంగళగిరి పట్టణ SI ఖాజా బాబు వివరణ
స్వగ్రామంలో వివాదాల నేపథ్యంలోనే రాజకీయ కుట్ర జరిగిందని ఖాజాబాబు ఆరోపించారు. విధుల నుంచి సస్పెండ్ చేయడంపై ఎస్సై ఖాజా బాబు స్పందించారు. తనకు గ్రామం నుంచి ఫోన్ పేలో డబ్బులు వచ్చిన మాట నిజమేనని, ఆ నగదును తన మిత్రుడు గత వారం తన దగ్గర తీసుకున్న వాటిని తిరిగి చెల్లించినట్టు తెలిపారు.
ఫోన్‌పే వచ్చిన నగదు పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధం లేదని, రూ. 10,000 నగదు విషయం స్థానిక పోలీసులకు, ఉన్నతాధికారులకు కూడా తెలియ జేశానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగిన డబ్బు పంపకాలుగా ప్రచారం చేస్తున్నారని విషయం తెలిసిన కావాలని ఇలా చేయటంపై ఆవేదన వ్యక్తం చేశారు