Pawan Kalyan Campaign : ఈసారి నేను గెలుస్తున్నాను.. అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాను - పవన్ కల్యాణ్
AP Elections 2024 Updates : ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలవబోతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గిద్దలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Janasena Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవాళ గిద్దలూరులో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన… పిఠాపురం నుంచి ఈసారి గెలవబోతున్నానని చెప్పారు. ఒక్క పిఠాపురం(pithapuram) కోసమే కాదు… 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలు, 5 కోట్ల ప్రజల కోసం పని చేసేందుకు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నానని చెప్పుకొచ్చారు.
అందరూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడుతారని పవన్ కల్యాణ్(Pawan Kalyan) గుర్తు చేశారు. కానీ మన ప్రకాశం జిల్లా వెనుకబాటు తనం గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనిగిరి ప్రాంతంలో ఉద్దానం తరహా కిడ్నీ వ్యాధులు, ఫ్లోరోసిస్ కేసులు ఉన్నాయన్నారు. దీని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు,
వైసీపీ గెలిస్తే రక్షణ ఉండదు - పవన్ కల్యాణ్
వెలిగొండ ప్రాజెక్టు నీరు వస్తే మార్కాపురం, గిద్దలూరు(giddalur assembly constituency) ప్రాంత నీటి కష్టాలు తీరుతాయన్నారు పవన్ కల్యాణ్. వైఎస్ జగన్(YS Jagan) మాత్రం ఖాళీ సొరంగాలు ఓపెన్ చేస్తూ ఉంటాడని దుయ్యబట్టారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు కావాల్సింది విద్యా, వైద్యం, తాగునీరు, ఉపాధి, లా అండ్ అర్డర్ అని చెప్పారు. గిద్దలూరు లో రోడ్లు బాగాలేవు అని ప్రశ్నించినందుకు జన సైనికుడు వెంగయ్య నాయుడు అనే వ్యక్తిని దారుణంగా చంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“వైసీపీ MLA అన్నా రాంబాబు. గిద్దలూరు లోనే కాదు, ఎక్కడైనా వైసిపి(YSRCP) అభ్యర్థిని గెలిపించారా ఇక మీ జీవితాలకు రక్షణ ఉండదు జాగ్రత్త. మన సభలకు ధైర్యంగా ప్రజలు రావడం చూస్తుంటే వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది, వైసీపీ గూండాల నుంచి ఈరోజు రాష్ట్రం ధైర్యంగా ఉంది అంటే అది జనసేన, జనసైనికుల ధైర్యమే కారణం” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వం(YS Jagan Govt) ఆరోగ్య శ్రీ నిధులు 1,200 కోట్లు చెల్లించకుండా హాస్పిటల్స్ కు ఎగ్గొట్టిందని పవన్ ఆరోపించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ ఒక్క కుటుంబానికి 25లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్ అందిస్తామన్నారు. ఇది దేశంలోనే మొదటి సారి మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
“జగన్ ది కడుపు కాదు, కంభం చెరువు, ఎంత అవినీతి సొమ్ము తిన్నా సరిపోదు. వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ స్థాయిలో దోచుకుంటున్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు గారు 6 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన కంభం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయొచ్చు, కానీ చెయ్యలేదు” అని పవన్ విమర్శించారు.
తాను రైతు, యువత పక్షపాతి అని చెప్పుకొచ్చారు జనసేన అధినేత పవన్. మహిళా సంక్షేమం కోరుకునే వ్యక్తినని… ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలబడతానని చెప్పారు. ఈసారి పిఠాపురం (pithapuram)నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ధీమాను వ్యక్తం చేశారు.
నెల్లూరులో సభ - హాజరైన చంద్రబాబు, పవన్
గిద్దలూరులో ప్రచారం తర్వాత నెల్లూరులో తలపెట్టిన సభకు చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్…. తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఇచ్చింది నెల్లూరు అని చెప్పారు. నెల్లూరులోనే చదువుకుని సమాజాన్ని అర్దం చేసుకున్నానని గుర్తు చేశారు.
వచ్చేది కూటమి ప్రభుత్వమే అని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ప్రజా ప్రభుత్వం రాబోతుందని.. ఖచ్చితంగా వైసిపి ఓడిపోతుందన్నారు. నిలబడదాం, బలంగా పోరాడుదాం, అవినీతి కోటలు బద్దలు కోడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.