Mla Anna Rambabu : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదు, మాగుంట ఓటమే లక్ష్యం- ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన వ్యాఖ్యలు
Mla Anna Rambabu : రాజకీయాల్నుంచి తప్పుకుంటున్నట్లు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని తెలిపారు.
Mla Anna Rambabu : ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకే తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యం కూడా సహకరించడంలేదన్నారు. ప్రకాశం జిల్లాకు మాగుంట చేసిందేంలేదన్నారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అన్నా రాంబాబు తెలిపారు. ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. వైసీపీలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మార్పు పెను దుమారమే రేపుతోంది. కొందరు నేతలు పార్టీ మారేందుకు చూస్తుంటే, మరికొంత మంది రాజకీయాల్నుంచి తప్పుకుంటున్నారు.
మాగుంట కుటుంబం ప్రకాశం ప్రజలకు ఏం చేసింది?
ఎమ్మెల్యే అన్నా రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియా, పలు వెబ్ సైట్లలో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దన్నారు. తన ప్రయాణం జగనన్న తోనే అన్నారు. ఆరోగ్య కారణాల వల్ల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానన్నారు. వైసీపీలోనే కొనసాగుతున్నానని అన్నా రాంబాబు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటి సారి తాను ఎమ్మెల్యే అయ్యానన్నారు. డబ్బు తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్ వద్ద చెప్పా కానీ ఆయన ఒప్పుకోలేదన్నారు. ప్రకాశం జిల్లాకు ఎంపీ మాగుంట కుటుంబం 34 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. మాగుంట కుటుంబాన్ని రాజకీయాల్లో ఆదరించకూడదని కోరారు. మాగుంట ఓటమి కోసం జిల్లా మొత్తం పర్యటిస్తానన్నారు.
ఇన్ ఛార్జ్ ల మార్పుతో నేతల్లో టెన్షన్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండడంతో వైసీపీ అధిష్టానం ఇన్ ఛార్జ్ లను మారుస్తోంది. గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించే ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల 11 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మార్చింది. వైసీపీలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లకు సీట్లు కేటాయిస్తారన్న ప్రచారం ఉంది. దీంతో ఎవరికి ఎక్కడ సీటు దక్కుతుందోనని వైసీపీ నేతలు టెన్షన్ లో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి ఆ ఫలితాల ఆధారంగా ఇన్ ఛార్జ్ లను మారుస్తుంది వైసీపీ అధిష్టానం. ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో ఇన్ ఛార్జ్ లను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నేతలు తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసుకు క్యూకడుతున్నారు. టికెట్ హామీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ దక్కదని భావించిన నేతలు ఇతర పార్టీల్లో ఛాన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.