TDP Janasena Second list: చంద్రబాబుతో పవన్ భేటీ… రెండో జాబితాకు రంగం సిద్ధం.. 25-30 పేర్లు రెడీ….
TDP Janasena Second list: టీడీపీ జనసేన కూటమి రెండో జాబితా విడుదలకు రంగం సిద్ధం అయ్యింది. సీట్ల కూర్పుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు.

TDP Janasena Second list: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో (Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది.
చంద్రబాబు నివాసానికి చేరుకున్న Pawan Kalyan పవన్ కల్యాణ్ అభ్యర్థుల జాబితాపై చర్చించారు. అభ్యర్థుల జాబితాను ఉమ్మడిగా ప్రకటించాలా?.. వేరు వేరుగా ప్రకటించాలా అనే విషయంలో కూడా చర్చించినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.
మంగళవారం రాత్రి ఒంటిగంట వరకు లోకేష్, అచ్చెన్నాయుడితో కలిసి అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కసరత్తు చేశారు. ఇప్పటికే టీడీపీ 94 నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జనసేన తరపున మరో 5గురు అభ్యర్థుల పేర్లతో తొలిజాబితాను ప్రకటించారు.
రెండో జాబితాలో టీడీపీ తరపున 25 నుంచి 30 మంది అభ్యర్థుల పేర్లు, జనసేన తరపున 10 సీట్లలో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ-జనసేన మథ్య ఇప్పటికే పొత్తు ఖరారు కావడంతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. సీట్లు ఇవ్వలేకపోయిన సీనియర్లకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సర్దిచెప్పారు.
బుధవారం ఉదయం జరిగిన భేటీలో మలివిడత అభ్యర్థుల ఎంపికపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు. మరోవైపు టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. రెండు వారాల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో భేటీ అయినా ఈ అంశంపై స్పష్టత రాలేదు.
పొత్తు కుదిరినట్టేనని పవన్ కళ్యాణ‌్ పదేపదే చెబుతున్నా దానిపై బీజేపీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. బీజేపీలో రాష్ట్ర స్థాయిలో కూడా రెండు రోజుల క్రితం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. 175 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపింది. పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెబుతున్నారు.
టీడీపీ-జనసేనల తరపున పోటీ చేసే స్థానాల విషయం కొలిక్కి రానుండటంతో త్వరలోనే చంద్రబాబు, పవన్ దిల్లీ వెళ్లే అవకాశముంది. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
బుధవారం చర్చల తర్వాత టీడీపీ నుంచి 20-25 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన తరపున మరో 10-12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. బీజేపీ వైఖరిని బట్టి రెండు మూడు రోజుల్లో పొత్తులపై క్లారిటీ రానుందని చెబుతున్నారు.