CM Jagan : రాబోయే 45 రోజులు చాలా కీలకం, మీరే అభ్యర్థులు- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
CM Jagan : చిన్న చిన్న మార్పులు తప్ప ఇన్ ఛార్జులే అభ్యర్థులుగా ఉంటారని సీఎం జగన్ అన్నారు. రాబోయే 45 రోజులు చాలా కీలకమని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
CM Jagan : రాబోయే 45 రోజులు చాలా కీలకమని సీఎం జగన్(CM Jagan)... పార్టీ నేతలతో అన్నారు. మంగళవారం మంగళగిరిలో... సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వైసీపీ(Ysrcp) కీలక నేతలు, ఇన్ ఛార్జ్ లతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. చిన్న చిన్న మార్పులతో మీరే అభ్యర్థులుగా ఉంటారని ఇన్ ఛార్జులతో సీఎం జగన్ అన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ... రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యమని, చంద్రబాబుకు విశ్వసనీయత లేదని విమర్శించారు. తాను సీఎంగా ఉంటేనే పేదవాడు బాగుపడతాడని అన్నారు. తాను సీఎంగా ఉంటే లంచాలు లేకుండా బటన్ లు నొక్కడం ఉంటుందన్నారు. వైసీపీ అధికారంలో ఉంటే స్కూళ్ల రూపురేఖలు మారతాయని, మహిళలకు రక్షణ, విలేజ్ క్లిన్ లు పనిచేస్తాయన్నారు. సంక్షేమ పాలన కొనసాగాలేంటే తానే సీఎంగా ఉండాలన్నారు.
చంద్రబాబు దొంగ హామీలు
2014లో చంద్రబాబు(Chandrababu) దొంగ హామీలిచ్చి, అన్ని వర్గాలను మోసం చేశారని సీఎం జగన్ ఆరోపించారు. సాధ్యపడని హామీలను మేనిఫెస్టోలో(Manifesto) పెట్టి వాటిని విస్మరించారన్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని, బంగారం లోన్లు తీరుస్తానని నమ్మించి మోసం చేశారన్నారు. ఒక నాయకుడు హామీ ఇచ్చాడంటే దానికి విశ్వసనీయత ఉండాలన్నారు. వైసీపీ ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను నెరవేర్చామని జగన్ పార్టీ నేతలతో అన్నారు. దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అన్నారు.
ప్రతీ ఇంటికి సంక్షేమం
బటన్ నొక్కి పేదల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఏకంగా రూ.2 లక్షల 55 వేల కోట్లు మహిళల ఖాతాలో జమ చేశామన్నారు. వైసీపీ చేసిన మంచి చూసి ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. 57 నెలలు సంక్షేమ పాలన అందించామన్నారు. గతంలో వెయ్యి రూపాయలు ఉన్న ఫించన్ నేడు రూ.3 వేలకు పెంచామన్నారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చామన్నారు. లంచాలు లేకుండా ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు(Welfare schemes) అందించామన్నారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పాలన అందించామన్నారు. జగన్ ఎప్పుడూ పేదల వైపే ఉంటాడన్నారు.
సంబంధిత కథనం