CM Jagan On Chandrababu : చంద్రబాబును ఇన్నాళ్లు భరించిన కుప్పం ప్రజలకు జోహార్లు- సీఎం జగన్-kuppam news in telugu cm jagan criticizes chandrababu not even one good thing did to own constituency ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan On Chandrababu : చంద్రబాబును ఇన్నాళ్లు భరించిన కుప్పం ప్రజలకు జోహార్లు- సీఎం జగన్

CM Jagan On Chandrababu : చంద్రబాబును ఇన్నాళ్లు భరించిన కుప్పం ప్రజలకు జోహార్లు- సీఎం జగన్

Bandaru Satyaprasad HT Telugu
Feb 26, 2024 02:31 PM IST

CM Jagan On Chandrababu : 35 ఏళ్లుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా భరిస్తున్న కుప్పం ప్రజలకు జోహార్లు అన్నారు సీఎం జగన్. 14 ఏళ్లుగా సీఎంగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.

సీఎం జగన్
సీఎం జగన్

CM Jagan On Chandrababu : 35 ఏళ్లుగా కుప్పం(Kuppam) నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు(Chandrababu)...ఏం మంచి చేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. సోమవారం కుప్పం బ్రాండ్ కేనాల్(Kuppam Branch Canal) ను ప్రారంభించిన ఆయన...కృష్ణా జలాలను కుప్పం ప్రజలకు అందించామన్నారు. శాంతిపురం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ... 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు సొంత నియోజకవర్గానికి ఏం చేయలేకపోయారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో కుప్పం అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. రెండు లక్షల మందికి తాగునీరు, సాగునీరు అందించామన్నారు. వైసీపీ పాలనలో కుప్పం ప్రజల కలసాకారం అయ్యిందన్నారు. 2022లో కుప్పం ప్రజలకు కృష్ణా జలాలు(Krishna Waters) అందిస్తామని హామీ ఇచ్చానన్న జగన్...రెండేళ్లలోనే కృష్ణా జలాలను సగర్వంగా కుప్పంకు తీసుకువచ్చామన్నారు. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పంకు తీసుకొచ్చామన్నారు.

కుప్పం ప్రజలకు జోహార్లు

చంద్రబాబును ఇన్నేళ్లు భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు. చంద్రబాబు వల్ల కుప్పానికి ఒక్క మంచి పని జరిగిందా? మీ బిడ్డ సీఎం అయ్యాక మంచి జరిగిందా? కుప్పానికి కృష్ణా జలాలు తీసుకొచ్చింది జగన్‌. కుప్పాన్ని మున్సిపాలిటీగా చేసింది మీ జగన్‌. రెవెన్యూ డివిజన్‌ గా మార్చింది జగన్‌. కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకున్నాం. ప్రజలకు మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? కాపులకు(Kapu) చంద్రబాబు ఏం మంచి చేశారో చెప్పాలి. భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపిస్తే... మంత్రిని చేస్తాను. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసి చంద్రబాబు గెలిపించడం ఎందుకో ఆలోచించండి. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు"- సీఎం జగన్

చంద్రబాబు ఎమ్మెల్యేగా అనర్హుడు

చంద్రబాబు ఎమ్మెల్యేగా అనర్హుడని సీఎం జగన్(CM Jagan) విమర్శించారు. మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారని గుర్తుచేశారు. 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇక్కడ ఇల్లు కట్టుకోలేదని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తురాదన్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు.

672 కి.మీ దాటి కుప్పంకు కృష్ణమ్మ

కొండలు, గుట్టలు దాటి 672 కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కుప్పం ప్రజలకు కృష్ణమ్మ నీళ్లు అందించామని సీఎం జగన్ అన్నారు. 672 కి.మీ దాటి, 1600 అడుగులు పైకెక్కి కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ ప్రవేశించడం ఓ చారిత్రక ఘట్టం అన్నారు. చంద్రబాబు పాలనలో దోచేసుకుని, దాచేసుకుని ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సగర్వంగా పూర్తి చేసిందన్నారు. కృష్ణా జలాలను తీసుకురావడంతో పాటు స్టోరేజ్‌ కోసం మరో రెండు రిజర్వాయర్లకు శ్రీకారం చుట్టామన్నారు.

సంబంధిత కథనం