YSRCP Siddham Sabha In Raptadu : వచ్చే ఎన్నికలకు సిద్ధం అంటోంది వైసీపీ. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం పేరుతో సభలు తలపెట్టగా… ఇవాళ రాయలసీమలోని రాప్తాడు నియోజకవర్గంలో భారీ సభను తలపెట్టింది. ఈ సిద్ధం సభకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ హాజరయ్యారు. మొత్తం 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్…. ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అని మండిపడ్డారు.
రాప్తాడులో జనసముద్రం కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పేదలకు, పెత్తందారులకు యుద్ధం జరుగుతోందన్న ఆయన… విశ్వసనీయతకు, వంచనకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? అని కార్యకర్తలను ఉద్దేశించి అడిగారు. పక్కరాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? అని దుయ్యబట్టారు. మళ్లీ అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారని… అలాంటి వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు కుర్చీని మడతబెట్టి 175 స్థానాలకుగానూ 23 మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి జగన్. రాబోయే ఎన్నికల్లో ఉన్న సీట్ల కుర్చీలను కూడా మడతబెట్టేందుకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని… సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలన్నారు. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడూ సింక్ లోనే ఉండాలంటూ ప్రతిపక్షాలపై సెటైర్లు విసిరారు. వైఎస్సార్‌సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తుకువస్తాయని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలని పిలుపునిచ్చారు.
మళ్లీ అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారని అన్నారు జగన్. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అని దుయ్యబట్టారు. 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? అని నిలదీశారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే వైసీపీ సర్కార్ ఎంతో చేసిందని… మళ్లీ అవకాశమిస్తే ఇంకెత మంచి జరుగుతుందో ఆలోచించాలని ప్రజల్లోకి వెళ్లాలన్నారు. 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చామని… కేవలం 57 నెలలు కాలంలోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని.. ప్రజలతోనే మన పొత్తు అని స్పష్టం చేశారు.
“త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. 55 రోజులు మాత్రమే ఉంది. ఈ కురుక్షేత్రంలో పెత్తందారులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. ఇంటింటి అభివృద్ధిని కాపాడేందుకు సిద్ధం కావాలి. వారి మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. చీకటి రాతలను బట్టబయలు చేయాలి. ప్రతి కార్యకర్త బాధ్యతతో పని చేయాలి. సమరభేరి మోగించాలి. మరోసారి గొప్ప విజయాన్ని అందుకోవాలి. ఇందుకోసం ప్రతిఒక్కరం సిద్ధం కావాలి. వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలకమైనవి. ఈ వయసు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80 ఏళ్లకు వస్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఉండవు. ఈ పరిస్థితిని గమనించే పెత్తందారులందరూ ఒకటవుతున్నారు. అందుకే మనమంతా గట్టిగా అడుగులు ముందుకు వేయాలి. దత్తపుత్రుడే కాకుండా ప్రత్యక్షంగా ఓ జాతీయ పార్టీస పరోక్షంగా మరో జాతీయ పార్టీని కలుపుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నేను మాత్రమే ఒక్కడినే. నాకు మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటున్నాను” అని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.