Kuppam Krishna Water : మాట నిలబెట్టుకున్న సీఎం జగన్, కుప్పం ప్రజలకు కృష్ణా జలాలు
Kuppam Krishna Water : కుప్పం ప్రజలకు కృష్ణా జలాలు అందాయి. సీఎం జగన్ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను జాతికి అంకితం చేశారు.
Kuppam Krishna Water : కుప్పం ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. కుప్పం(Kuppam) నియోజకవర్గానికి కృష్ణా జలాలను (Krishna Waters)అందించారు. సోమవారం కుప్పంలో పర్యటించిన సీఎం జగన్(CM Jagan) ముందుగా పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి, కుప్పం బ్రాంచ్ కెనాల్(Kuppam Branch Canal))ను జాతికి అంకితం చేశారు. కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. కుప్పం, పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు అందనున్నట్లు తెలిపారు.
కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు
కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు తాగు నీరు అందిస్తూ అందించేందుకు కృష్ణా జలాలను సీఎం జగన్ విడుదల చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ ను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేశారు.
కుప్పం బ్రాంచి కెనాల్ ప్రత్యేకతలు
- పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 207.80 కి.మీ వద్ద (చిత్తూరు జిల్లా పెద్ద పంజాణీ మండలం అప్పినపల్లె చెరువు వద్ద) కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రారంభం కానుంది.
- నీటి సామర్థ్యం : 6.130 క్యూమెక్స్ (216 క్యూసెక్కులు)
- కాలువ పొడవు : 123.641 కి.మీ
- వ్యయం : రూ. 560.29 కోట్లు
- కట్టడాలు : 330
- లిఫ్ట్ లు : 3
- ఆయకట్టు : 110 చెరువుల క్రింద 6,300 ఎకరాలు
- తాగునీరు : పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన 4.02 లక్షల మంది ప్రజలకు
కుప్పం అభివృద్ధి కార్యక్రమాలు
కుప్పంకు మునిసిపాలిటీ హోదా, రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేసినట్లు వైసీపీ నేతలు తెలిపారు. రూ.66 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల అభివృద్ధికి మరో రూ. 100 కోట్లు మంజూరు చేయగా, కుప్పం జలప్రదాయిని పాలారు ప్రాజెక్టులో భాగంగా 0.6 టీఎంసీ సామర్ధ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.215 కోట్ల అనుమతులు మంజూరయ్యాయన్నారు. 15,721 మందికి ఇప్పటికే ఉచిత ఇళ్ల పట్టాలు అందించి మరో 15,000 మందికి ఈ నెలలోనే అందించనున్నట్లు తెలిపారు. మొత్తంగా 30,000 పైచిలుకు అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు మంజూరు.. 7,898 జగనన్న కాలనీ ఇళ్ల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
కుప్పం ప్రజలకు సంక్షేమ ఫలాలు
కుప్పం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, కుప్పం నియోజకవర్గంలో మరో 2 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష ద్వారా ఇప్పటివరకు 104 గ్రామాల్లోని 53,718 ఎకరాల్లో రీసర్వే చేపట్టి 16,676 మంది లబ్ధిదారులకు భూహక్కు పత్రాలు జారీ చేశామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజ్, స్త్రీ నిధి ద్వారా రూ.991.88 కోట్ల రుణాలు అందించామన్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత క్రింద 6,332 మంది అక్కచెల్లెమ్మలకు కిరాణ దుకాణాలు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా ఉపాధి.. నెలకు రూ.7,000 నుంచి రూ.10,000 వరకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. వైసీపీ పాలనలో కుప్పం నియోజకవర్గంలోని దాదాపు 5.39 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందాయని, డీబీటీ ద్వారా రూ. 1,400 కోట్లు.. నాస్ డిబీటీ ద్వారా రూ. 1,889 కోట్ల లబ్ధి అందించామని వైసీపీ నేతలు అంటున్నారు.