Exit polls 2024: ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల గడువు ముగిసిన తర్వాత ఈ రోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత 2024 ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడనున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఓటర్లు చెప్పిన అంశాల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ ను అంచనా వేస్తారు. యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఐపీఎస్ఓఎస్, సీఓటర్, సీఎస్డీఎస్ వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ (Exit polls) నిర్వహిస్తాయి.
ఎగ్జిట్ పోల్ అంచనాలు హిట్ అయిన సందర్బాలు, మిస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి విశ్వసనీయతపై కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ లో తప్పులకు అవకాశం ఉంటుంది. అందువల్ల, సాధారణంగా ఎర్రర్ మార్జిన్ తో ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటిస్తారు. ఇటీవలి కాలంలో ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 2019లో సగటున ఎన్డీయేకు 306, యూపీఏకు 120 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే, వారి అంచనాకు మించిన స్థాయిలో ఎన్డీయే అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. 2019 ఎన్నికల్లో ఎన్డీయేకు 353 సీట్లు, బీజేపీకి 303 సీట్లు వచ్చాయి. అలా, 2019 లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో యూపీఏకు 93, కాంగ్రెస్ కు 52 సీట్లు వచ్చాయి.
Exit Poll agency | NDA | UPA |
India Today-Axis | 339-365 | 77-108 |
News 24-Today's Chanakya | 350 | 95 |
News18-IPSOS | 336 | 82 |
Times Now VMR | 306 | 132 |
India TV-CNX | 300 | 120 |
Sudarshan News | 305 | 124 |
Actual Result | 353 | 93 |
2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయం సాధిస్తుందని, ఎన్డీయే అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ, గెలుపు మార్జిన్ ను సరిగ్గా అంచనా వేయలేకపోయాయి. ఎన్డీయే సాధించిన భారీ ఆధిక్యతను వారు గుర్తించలేకపోయారు. 2014లో ఎనిమిది ఎగ్జిట్ పోల్స్ సగటున ఎన్డీయేకు 283 సీట్లు, యూపీఏకు 105 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 336, యూపీఏకు 60 సీట్లు వచ్చాయి. అలాగే, ఆ ఎన్నికల్లో బీజేపీకి 282, కాంగ్రెస్ కు 44 సీట్లు వచ్చాయి.
Exit Poll agency | NDA | UPA |
India Today-Cicero | 272 | 115 |
News 24-Chanakya | 340 | 101 |
CNN IBN-CSDS | 280 | 97 |
Times Now ORG | 249 | 148 |
ABP News-Nielsen | 274 | 97 |
NDTV-Hansa Research | 279 | 103 |
Actual Result | 336 | 60 |
2024 లోక్ సభ ఎన్నికలు ఎన్డీయే, యూపీఏల మధ్య కాకుండా, ఎన్డీయేకు, కొత్తగా ఏర్పడిన విపక్ష కూటమి ‘ఇండియా’ కు మధ్య జరిగాయి. ఈ ఎన్నికలకు (lok sabha elections 2024) ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే గెలిచే స్థానాల సంఖ్య 400 లు దాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అలాగే, బీజేపీ సొంతంగా 370 సీట్లను గెలుచుకుంటుందని ఆశిస్తున్నారు. కాగా, ఈ సారి న్యూస్ చానళ్లలో జరిగే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనబోమని కాంగ్రెస్ ప్రకటించింది.