Lok Sabha elections 2024 : లోక్​సభ ఎన్నికల 7వ దశ పోలింగ్​ షురూ- నేడే ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు..-lok sabha elections 7th phase begins all eyes on andhra pradesh assembly elections exit polls 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections 2024 : లోక్​సభ ఎన్నికల 7వ దశ పోలింగ్​ షురూ- నేడే ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు..

Lok Sabha elections 2024 : లోక్​సభ ఎన్నికల 7వ దశ పోలింగ్​ షురూ- నేడే ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు..

Sharath Chitturi HT Telugu
Published Jun 01, 2024 07:00 AM IST

Lok Sabha elections phase 7 : లోక్​సభ ఎన్నికల 7వ దశ పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్​ ముగిసిన అనంతరం.. నేటి సాయంత్రం ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​తో పాటు లోక్​సభ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు వెలువడనున్నాయి.

లోక్​సభ ఎన్నికల 7వ దశ పోలింగ్​ షురూ
లోక్​సభ ఎన్నికల 7వ దశ పోలింగ్​ షురూ (AFP)

Lok Sabha elections phase 7 live updates : 44 రోజుల నుంచి జరుగుతున్న 2024 లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియకు నేటితో తెరపడనుంది. లోక్​సభ ఎన్నికల 7వ దశ పోలింగ్​ ప్రక్రియ శనివారం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి సహా 57 నియోజకవర్గాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంతేకాదు.. పోలింగ్​ ప్రక్రియ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

2024 లోక్​సభ ఎన్నికలు..

543 సీట్లకుగాను.. 2024 ఏప్రిల్​ 19న లోక్​సభ ఎన్నికలు మొదలయ్యాయి. జూన్​ 1తో ముగియనున్నాయి. జూన్​ 4న ఫలితాలు వెలువడతాయి.

కాగా.. 7వ దశ పోలింగ్​లో భాగంగా.. 7 రాష్ట్రాల్లోని 57 సీట్లకు నేడు పోలింగ్​ జరగనుంది. అవి.. పంజాబ్​ 13, ఉత్తర్​ ప్రదేశ్​ 13, బెంగాల్​ 9, బిహార్​ 8, ఒడిశా 6, హిమాచల్​ ప్రదేశ్​ 4, ఝార్ఖండ్​ 3, ఛండీగఢ్​ 3.

2024 Lok Sabha elections : అంతేకాదు.. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిపోయిన 42 అసెంబ్లీ సీట్లకు కూడా నేడు పోలింగ్​ జరగనుంది. నిన్న, మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న బీజేడీ- బీజేపీలు ఇప్పుడు ఎన్నికల రాజకీయాలతో తీవ్రంగా పోటీపడుతున్నాయి.

ఇక హిమాచల్​ ప్రదేశ్​లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది కాంగ్రెస్​కు కీలకంగా మారింది! కాంగ్రెస్​లో ఓటు రెబల్స్​గా మారి, రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్​ ఓటింగ్​కి పాల్పడిన వారు.. చివరికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

57 సీట్లల్లో వారణాసిపై అధిక ఫోకస్​ ఉండనుంది! 2014 నుంచి ప్రధాని మోదీ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయనపై ఈసారి అజయ్​ రాయ్​ని బరిలో దింపింది కాంగ్రెస్​ పార్టీ. వారణాసిలో మోదీ గెలుపు ఖాయమే! కానీ ఎంత మెజారిటీతో గెలుస్తారు? అనేదే ఇప్పుడు హాట్​ టాపిక్​!

Lok Sabha elections in India 2024 : లోక్​సభ ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా హీట్​వేవ్​ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. మరి దీని ప్రభావం పోలింగ్​ శాతంపై ఏ మేరకు ఉంటుందో చూడాలి.

కాగా.. లోక్​సభ ఎన్నికల 7వ దశ పోలింగ్​ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారులు సైతం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.

నేడే ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు..

Andhra Pradesh exit polls 2024 : ఇక మచ్​ అవైటెడ్​ టాపిక్​గా మారిన ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు.. నేడు వెలువడనున్నాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్​ ప్రక్రియ ముగిసిన అరగంటకు.. లోక్​సభ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు వెలువడతాయి. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు సైతం నేటి సాయంత్రం బయటకు వస్తాయి. ఒడిశా, సిక్కిం, అరుణాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​ కూడా నేడు వెలువడతాయి.

అసలు ఎగ్జిట్​ పోల్స్​ అంటే ఏంటి? ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు.. వివిధ ఏజెన్సీలు సర్వేలు చేస్తాయి. ప్రజల అంచనాలు, అభిప్రాయాలను సేకరించి.. ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుంది? అన్న విషయాలను అంచనా వేస్తుంది. ఇది.. పబ్లిక్​ సెంటిమెంట్​కి నిదర్శనంగా ఉంటుంది. అయితే.. గత కొన్నేళ్లుగా.. ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎగ్జిట్​ పోల్స్​ విఫలమవుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రజలకు ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు, లోక్​సభ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​ 2024పై ఆసక్తి ఎక్కువగానే ఉంది. అందుకే నేటి ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Whats_app_banner

సంబంధిత కథనం