CBN and Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం-2019 chandrababu 2024 sajjala same comments on police and ec ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cbn And Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం

CBN and Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం

Sarath chandra.B HT Telugu
May 17, 2024 02:12 PM IST

CBN and Sajjala: ఐదేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఏమి చేసిందో సరిగ్గా ఇప్పడు వైసీపీ అదే చేస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ నడిచిన బాటలోనే ఇప్పుడు వైసీపీ నడుస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం
కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం (HT_PRINT)

CBN and Sajjala: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ పూర్తైంది. ఈవిఎంలలో నేతల భవిష్యత్తు నిక్షిప్తమైంది. పోలింగ్‌ రోజు నుంచి మూడ్రోజుల పాటు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న వాదనల నేపథ్యంలో పాత సంగతులు గుర్తు చేసుకోవాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల తీరుపై అధికార పార్టీ తీవ్ర స్థాయిలోవిమర్శలు చేస్తోంది. ఎన్నికలకు ముందే అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. పోలింగ్‌ తదనంతర పరిణామాలతో వైసీపీ ముఖ్య నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారు.

వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, అనిల్ కుమార్‌ యాదవ్, సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు జరిగిన బదిలీలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

వైసీపీ నేతలు గత రెండు మూడు రోజులుగా ఈసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.2019లో సైతం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలింగ్ జరిగిన కేంద్రాల్లో 10శాతం కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దాదాపు 4-5వేల పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ చేయాలని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య 2019 పోలింగ్ రోజు ఈసీకి ఫిర్యాదు చేశారు. మర్నాడు దాదాపు 650కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని పోలింగ్ చేయాలని డిమాండ్ చేశారు.

అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఆరోపణలకు ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. తమ విధుల్ని నిర్వర్తించామని, రాజకీయ పార్టీల విమర్శలు ఆరోపణలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. 2019లో ప్రధాన ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తించిన గోపాలకృష్ణ ద్వివేది ఓడిపోయే రాజకీయ పార్టీలు ఏదొక సాకులు వెదుక్కుని ఈసీని నిందిస్తున్నాయని కామెంట్‌ చేసి సంచలనం సృష్టించారు.

2019 ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు సచివాలయంలో సమీక్ష నిర్వహించే విషయంలో కూడా ఈసీ ఆగ్రహాన్ని చంద్రబాబు చవిచూడాల్సి వచ్చింది.

చరిత్ర పునరావృతం…

సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఏపీలో రాజకీయచరిత్ర పునరావృతం అయ్యింది. అప్పట్లో చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలాంటి ఆరోపణలు చేశారో ప్రస్తుతం వైసీపీ కూడా సరిగ్గా అదే తరహా ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల సంఘం ఏక పక్షంగా వ్యవహరించిందని, ఒత్తిళ్లకు తలొగ్గిందని, పోలీసులు టీడీపీకి అనుకూలంగా పని చేశారంటూ వైసీపీ నేతలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్నారు.

2019 ఎన్నికలల సమయంలో వైసీపీ అనుసరించిన వ్యూహాన్ని 2024లో టీడీపీ ఫాలో అయ్యింది. అప్పట్లో ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే కీలకమైన అధికారుల్ని బదిలీ చేయించడంలో వైసీపీ సఫలం అయ్యింది. ఐదుగురు ఐపీఎస్‌లతో పాటు చీఫ్‌ సెక్రటరీని కూడా అప్పట్లో ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

2024 ఎన్నికల్లో సిఎస్‌, డీజీపీలను మార్చాలని టీడీపీ ఎన్నికలకు ముందు నుంచి పోరాడినా ఏ కారణాలతోనో అది సాధ్యం కాలేదు. తీవ్ర ప్రయత్నాల తర్వాత కేవలం డీజీపీని మాత్రం మార్చగలిగారు. కొన్ని జిల్లాల్లో ఎస్పీలతో పాటు ప్రధాని పర్యటనలో లోపాల కారణంగా ఐజిపై బదిలీ చేశారు.

సిఎం జగన్‌పై దాడి ఘటనలో విజయవాడ సీపీని మార్చారు. దాదాపు 26మంది ఐపీఎస్‌ అధికారులపై బీజేపీ, టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారిలో చాలామందిపై ఈసీ వేటు వేసింది. అయితే సిఎస్‌ విషయంలో మాత్రం టీడీపీ నేతలు ఏమి చేయలేకపోయారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సిఎస్‌దే బాధ్యత అని టీడీపీ ఆరోపిస్తోంది. ఈసీని తప్పుదోవ పట్టించారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. తమకు అనుకూలంగా ఉండే అధికారుల్ని కావాల్సిన చోట నియమించేలా ప్యానల్ జాబితాలను ఖరారు చేసి బదిలీ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది.

మరోవైపు ఎన్నికల కమిషన్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని, రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేసినా ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు.

పోలింగ్‌ సమయంలో టీడీపీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. పోలింగ్‌ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసిందని, టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని, రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారని, ఈసీ నియమించిన పోలీస్‌ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదన్నారు.

మరోవైపు రాజకీయ పార్టీల ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఏపీలో ఎన్నికల నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత మరో రెండు వారాల పాటు కేంద్ర బలగాలు రాష్ట్రంలో కొనసాగనున్నాయి.

WhatsApp channel