IPL 2024 LSG vs CSK: రాహుల్, డికాక్ హాఫ్ సెంచరీలు.. చెన్నై సూపర్ కింగ్స్‌కు షాకిచ్చిన లక్నో సూపర్ జెయింట్స్
IPL 2024 LSG vs CSK: డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కు గట్టి షాకిచ్చింది లక్నో సూపర్ జెయింట్స్. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో కెప్టెన్ రాహుల్, క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీలతో 8 వికెట్లతో గెలిచింది.
IPL 2024 LSG vs CSK: లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతమే చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కు చిత్తుగా ఓడించింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ మరో ఓవర్ మిగిలి ఉండగానే చేజ్ చేసింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీలు చేశారు. ఈ ఇద్దరూ సీఎస్కే బౌలర్లు చాలా సులువుగా ఎదుర్కొన్నారు. సీఎస్కే బ్యాటర్లు ఇబ్బంది పడిన అదే పిచ్ పై వీళ్లు లక్నోను సులువుగా గెలిపించారు.
రాహుల్, డికాక్ హాఫ్ సెంచరీలు
చెన్నై సూపర్ కింగ్స్ సెట్ చేసిన 177 రన్స్ టార్గెట్ చేయడం లక్నోకు అంత సులువు కాదని అందరూ భావించారు. ముఖ్యంగా పతిరన, ముస్తఫిజుర్ రెహమాన్ లాంటి బౌలర్లను ఎదుర్కొని లక్నో ఈ టార్గెట్ చేజ్ చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ రాహుల్, డికాక్ ఆ అనుమానాలను పటాపంచలు చేసేశారు. తొలి ఓవర్ నుంచే ఈ ఇద్దరూ చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతూ వెళ్లారు.
ముఖ్యంగా రాహుల్ అయితే ప్రతి ఓవర్లోనూ బౌండరీ బాదుతూ చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అతడు కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు మొదట్లోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డికాక్ కూడా కాస్త నెమ్మదిగా అయినా.. 41 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 134 పరుగులు జోడించారు. ఈ సీజన్లో తొలి వికెట్ కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
ఆ తర్వాత ఈ ఇద్దరూ వెంటవెంటనే ఔటైనా.. పూరన్, స్టాయినిస్ మరో వికెట్ పడకుండానే లక్నోను గెలిపించారు. రాహుల్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్ లతో 77 రన్స్ చేయగా.. డికాక్ 43 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ తో 54 రన్స్ చేశాడు. పూరన్ 12 బంతుల్లో 23 పరుగులతో అజేయంగా నిలిచాడు.
జడేజా ఫిఫ్టీ.. ధోనీ మెరుపు ఇన్నింగ్స్
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. జడేజా హాఫ్ సెంచరీకి తోడు చివర్లో మరోసారి ధోనీ మెరుపులు సీఎస్కేకు మంచి స్కోరు అందించింది. ఈ మ్యాచ్ లో మొదటి నుంచి సీఎస్కే బ్యాటర్లు తడబడుతూ బ్యాటింగ్ చేయడంతో 150 స్కోరైనా సాధ్యమా అనిపించింది. కానీ మరోసారి ధోనీ మరోసారి కేవలం 9 బంతుల్లో 28 రన్స్ చేసి తన జట్టుకు మంచి స్కోరు అందించాడు.
ఈ సీజన్ ఐపీఎల్లో చివర్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్న ఎమ్మెస్ ధోనీ.. లక్నోలోనూ అదే రిపీట్ చేశాడు. ఐదు లేదా ఆరు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వస్తున్న ధోనీ.. చివర్లో రెండు, మూడు ఓవర్లలోనే చెలరేగుతున్నాడు. ఈ మ్యాచ్ లోనూ ధోనీ కేవలం 9 బంతుల్లో 28 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. ఈ సీజన్లో ఒక్కసారి కూడా ఔట్ కాని రికార్డును అతడు కొనసాగించాడు.
మరోవైపు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మొదటి నుంచీ బాధ్యతాయుతంగా ఆడుతూ 40 బంతుల్లో 57 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చివర్లో జడేజాతో కలిసి ఏడో వికెట్ కు అజేయంగా 16 బంతుల్లోనే 35 పరుగులు జోడించాడు ధోనీ. దీంతో సీఎస్కే ఫైటింగ్ స్కోరు చేయగలిగింది.
అంతకుముందు మొయిన్ అలీ, అజింక్య రహానే కూడా రాణించారు. మొయిన్ అలీ 20 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. బిష్ణోయ్ ఓవర్లో వరుసగా మూడు సిక్స్ లు బాది సీఎస్కే స్కోరును పరుగులు పెట్టించాడు. ఇక ఓపెనర్ గా వచ్చిన రహానే 24 బంతుల్లో 36 రన్స్ చేశాడు. మొయిన్ అలీ, ధోనీ మెరుపులతో సీఎస్కే చివరి 4 ఓవర్లలోనే 62 రన్స్ చేయడం విశేషం.