Gambhir on Dhoni: ధోనీని మించిన కెప్టెన్ ఎప్పటికీ టీమిండియాకు రాడు: గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Gambhir on Dhoni: ధోనీ పేరు చెబితేనే మండిపడే గౌతమ్ గంభీర్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతన్ని మించిన విజయవంతమైన కెప్టెన్ ఇండియాకు ఎప్పటికీ రాడని స్పష్టం చేశాడు.
Gambhir on Dhoni: ముక్కుసూటిగా మాట్లాడే అలవాటున్న ప్లేయర్ గౌతమ్ గంభీర్. క్రికెట్ ఆడే సమయంలో అయినా, రిటైరైన తర్వాత అయినా తన మనసులోని అభిప్రాయాలను ఉన్నదున్నట్లుగా చెప్పేస్తాడు. 2011 వరల్డ్ కప్ కేవలం ధోనీ వల్లే గెలవలేదని, టీమ్ అంతా కలిసి ఆడితేనే వచ్చిందని గతంలో చాలాసార్లు చెప్పిన గౌతీ.. ఇప్పుడు అదే ధోనీని పొగడటం విశేషం.
ధోనీ బెస్ట్ కెప్టెన్
ఐపీఎల్ 2024లో గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం (ఏప్రిల్ 8) చెన్నై సూపర్ కింగ్స్ తో నైట్ రైడర్స్ మ్యాచ్ నేపథ్యంలో అతడు స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడాడు. ఐపీఎల్ చరిత్రలో ధోనీ, రోహిత్ తోపాటు రెండు టైటిల్స్ తో గంభీర్ కూడా సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్నాడు. గతంలో ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా చాలా ఉత్కంఠగా సాగేది.
ఇక ఇప్పుడు మరో మ్యాచ్ నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. "నేనెప్పుడూ గెలవాలనే అనుకునేవాడిని. నా మెదడులో అదే స్పష్టంగా ఉండేది. ఫ్రెండ్స్, పరస్పర గౌరవం అవన్నీ అలాగే ఉంటాయి. కానీ ఫీల్డ్ లోకి దిగినప్పుడు నేను కేకేఆర్ కెప్టెన్, అతడు సీఎస్కే కెప్టెన్.
ఒకవేళ అతన్ని అడిగినా కూడా బహుశా ఇదే సమాధానం చెబుతాడు. గెలవడమే ముఖ్యం. ఇండియాకు ధోనీలాంటి అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఇక రాడన్నది నిజం. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన అతని స్థాయిని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు" అని గంభీర్ అన్నాడు.
ఐపీఎల్లో కేకేఆర్ vs సీఎస్కే
ఐపీఎల్లో ధోనీ వేసే ఎత్తుగడలు కేకేఆర్, సీఎస్కే మ్యాచ్ లను చాలా ఆసక్తికరంగా మార్చినట్లు గంభీర్ చెప్పాడు. "ఒకవేళ వాళ్లకు చివరి ఓవర్లో 20 పరుగులు అవసరమై ధోనీ క్రీజులో ఉంటే వాళ్లు గెలుస్తారు. అదే సమయంలో సూపర్ కింగ్స్ లో ఎవరినైనా సవాలు చేసే బౌలింగ్ దాడి నా దగ్గర ఉందని నాకు తెలుసు. వ్యూహాత్మకంగా అతని కంటే అన్ని రంగాల్లోనూ ముందుండాలని నాకు తెలుసు. అతడు ఫీల్డ్ లో అంత దూకుడుగా కనిపించడు. కానీ అతను అంత తేలిగ్గా వదిలేయడు. చివరి బంతి వరకూ ప్రత్యర్థి తన విజయంపై ఆశలు పెట్టుకోలేని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్" అని గంభీర్ ప్రశంసించాడు.
ధోనీ కెప్టెన్సీలో ఇండియా గెలిచిన మూడు ఐసీసీ టైటిల్స్ లో రెండింట్లో గంభీర్ పాత్ర కూడా కీలకమే. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఫైనల్లో గంభీరే టాప్ స్కోరర్. ఇక 2011 వరల్డ్ కప్ ఫైనల్లోనూ శ్రీలంకపై 97 పరుగులతో గౌతీయే విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే అదే ఫైనల్లో ధోనీ 91 రన్స్ చేయడం, చివర్లో సిక్స్ తో ఇండియన్ టీమ్ ను గెలిపించడంతో క్రెడిట్ అంతా అతనికే వెళ్లింది. ఈ విషయంలోనే గంభీర్ చాలాసార్లు ధోనీ పీఆర్ టీమ్ లక్ష్యంగా విమర్శలు గుప్పించాడు.