Kohli Gambhir Hug: ఫొటో ఆఫ్ ద డే.. కోహ్లి, గంభీర్ ఫ్రెండ్స్ అయిపోయారు.. విభేదాలు పక్కన పెట్టిన స్టార్స్
Kohli Gambhir Hug: విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా స్ట్రేటజిక్ టైమౌట్ సమయంలో ఈ ఇద్దరూ హగ్ చేసుకున్న ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.
Kohli Gambhir Hug: ఐపీఎల్ 2024లో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ అనగానే విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య మళ్లీ ఏం యుద్ధం జరుగుతుందో అని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ఈ ఇద్దరూ ఫ్రెండ్సయిపోయారు. విరాట్, గౌతీ హగ్ చేసుకొని నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విరాట్, గంభీర్ ఫ్రెండ్స్
ఆర్సీబీ, కేకేఆర్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఈ అరుదైన సీన్ కనిపించింది. గతేడాది ఐపీఎల్లో భాగంగా లక్నోలో గొడవ తర్వాత తొలిసారి విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ ఫీల్డ్ లో కలుసుకున్నారు. అయితే ఈసారి గొడవ పడకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ సీన్ కనిపించింది.
స్ట్రేటజిక్ టైమ్ లో కోహ్లి బ్రేక్ తీసుకోగా.. కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఫీల్డ్ లోకి వచ్చాడు. నేరుగా కోహ్లి దగ్గరికి వెళ్లాడు. అతన్ని చూడగానే విరాట్ కోహ్లి రెండడుగులు అతని వైపు వేసి నవ్వుతూ పలకరించాడు. ఇద్దరూ హ్యాండ్ షేక్ తర్వాత హగ్ చేసుకున్నారు. కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఈ సీన్ చూసిన తర్వాత కామెంటరీ బాక్స్ లో ఉన్న గవాస్కర్ నవ్వుతూ స్పందిస్తూ.. బాగా ఆడటమే కాదు.. ఆస్కార్ కూడా ఇవ్వాలని అనడం విశేషం.
గతేడాది ఏం జరిగింది?
గతేడాది ఐపీఎల్లో గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గా ఉన్న విషయం తెలిసిందే. ఆర్సీబీ ఆ జట్టుతో ఆడటానికి లక్నో వెళ్లింది. అయితే మ్యాచ్ సందర్బంగా లక్నో ప్లేయర్ నవీనుల్ హక్ తో కోహ్లి గొడవపడ్డాడు. మ్యాచ్ తర్వాత కూడా వీళ్ల గొడవ కొనసాగగా.. ఫీల్డ్ లోకి వచ్చిన గంభీర్ జోక్యం చేసుకొని కోహ్లితో గొడవపడ్డాడు. అది కాస్తా పెద్దదైంది.
అంతకుముందు ఓసారి ఐపీఎల్లోనే కేకేఆర్ కెప్టెన్ గా గంభీర్ ఉన్న సమయంలోనూ ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో వీళ్లు ఎప్పుడూ కలిసినా ఇలా గొడవలు తప్పదని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ అంటే ఈసారీ అలాంటిది తప్పదేమో అనుకున్నారు. కానీ సీన్ రివర్సయింది. గంభీర్ తో విభేదాలు పక్కన పెట్టి కోహ్లి అతన్ని ఆప్యాయంగా పలకరించాడు.
నిజానికి ఈ గొడవకు కారణమైన నవీనుల్ హక్ తోనూ ఈ ఏడాది మొదట్లో కోహ్లి విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ సందర్భంగా కోహ్లియే చొరవ తీసుకొని నవీనుల్ హక్ తోనూ ఇప్పుడు గంభీర్ తో మాట్లాడినట్లే నవ్వుతూ మాట్లాడుతూ కనిపించాడు. ఆ సీన్ చూసి స్టేడియంలో ప్రేక్షకుల పెద్దగా అరిచారు.
ఇప్పుడు గంభీర్ తోనూ విరాట్ అలాగే చేయడంతో చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఫీల్డ్ లో ఎంతో ఆవేశంగా కనిపించే కోహ్లి.. కొంత కాలంగా కాస్త కూల్ గా ఉంటున్నాడు. అందులో భాగంగానే ఇలా తనకు విభేదాలు ఉన్న ప్లేయర్స్ తోనూ కలిసిపోతున్నాడు.