Delhi Capitals: రికీ పాంటింగ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ వేటు.. బీరు తాగుదామంటూ పోస్ట్.. మరి డీసీ కొత్త కోచ్ ఎవరంటే?
Delhi Capitals Removed Ricky Ponting As Head Coach: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ వేటు వేసింది. అతన్ని ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. సుమారు ఏడేళ్ల తర్వాత రికీ పాంటింగ్‌ను తీసివేస్తున్నట్లు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది.
Ricky Ponting Delhi Capitals: దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుని వేటు వేసింది. రికీ పాంటింగ్‌ను ఫ్రాంచైజీ నుంచి వైదొలగించినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం (జూలై 13) అధికారికంగా ధృవీకరించింది. పాంటింగ్ నిష్క్రమణపై క్యాపిటల్స్ ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. అలాగే ఫ్రాంచైజీకి పాంటింగ్ చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపింది.
రికీ పాంటింగ్ 2018లో డీసీలో చేరాడు. 2020లో మొదటిసారి ఐపీఎల్ ఫైనల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ చేరుకోవడంలో సహాయపడ్డాడు రికీ పాంటింగ్. తన ఏడు సీజన్ల పదవీకాలంలో పాంటింగ్ నాయకత్వంలో హెచ్చుతగ్గులు కనిపించాయి. రికీ పాంటింగ్ ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే డీసీ లీగ్ పాయింట్లలో అట్టడుగు స్థానంలో నిలివడం ఆయనకు మొదట్లోనే పెద్ద ఎదురుదెబ్బ తగినట్లు అయింది.
అయితే రికీ పాంటింగ్ మార్గదర్శకత్వంలో 2019, 2020, 2021లో డీసీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పాంటింగ్ పదవీకాలంలో 2020లో డీసీ మొదటిసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ, చివరికి ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించకపోవడంతో రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది.
అయితే, గత మూడు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆట తీరు సరిగ్గా లేదు. చివరి మూడు సీజన్లలో డీసీని కనీసం ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు పాంటింగ్. 2024 ఐపీఎల్ సీజన్‌లో డీసీ ఏడు విజయాలు, ఏడు ఓటములతో ఆరో స్థానంలో నిలిచింది. ఇలాంటి కారణాలతో రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి డీసీ ఫ్రాంచైజీ తప్పించినట్లు, జట్టును భవిష్యత్ విజయాల దిశగా నడిపించేందుకు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తెలిపింది.
ఏడేళ్లుగా రికీ పాంటింగ్ డీసీకి టైటిల్ అందించకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, రికీ పాంటింగ్‌కు గుడ్ బై చెబుతూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది ఫ్రాంఛైజీ. "మీరు మాకు ఎదురైన ప్రతి సమస్యలో నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పారు. కేర్, కమిట్‌మెంట్, యాటిట్యూడ్, ఎఫర్ట్. ఈ ఏడేళ్లుగా మీరు మాకోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే అథ్లెట్స్‌గా, దానికంటే ముఖ్యంగా మనుషులుగా మేము చాలా మెరుగయ్యాం" అని తెలిపారు.
"మీరు ప్రతి ట్రైనింగ్ సెషన్‌కు ముందుగానే చేరుకుంటారు. అలాగే చివరిగా బయలుదేరుతారు. మీరు కీలక సమయాల్లో వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో నేర్పారు. డ్రెస్సింగ్ రూమ్‌లో మీరు ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన స్పీచ్‌లను మర్చిపోలేం. మీరు మాకోసం చేసిన ప్రతిదానికి కృతజ్ఞతలు కోచ్. ఇప్పుడు దీన్ని ఇక్కడే వదిలేద్దాం, బీరు తాగుదాం, మళ్లీ తర్వాత ఎధావిధిగా పనికి వెళ్దాం" అని డీసీ ఎమోషనల్‌గా గుడ్ బై చెప్పింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీసీకి కొత్త కోచ్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత కోచింగ్ స్టాఫ్‌లో క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే, బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్, ఫీల్డింగ్ కోచ్ బిజూ జార్జ్ ఉన్నారు.