Sourav Ganguly: సౌరవ్ గంగూలీ ఇంట్లో దొంగతనం.. లక్షన్నర ఫోన్ చోరీ.. ఆ డేటా బయటకు రావొద్దంటూ!
Sourav Ganguly Mobile Stolen: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో దొంగతనం జరిగింది. సుమారు రూ.1. 6 లక్షల విలువైన సౌరవ్ గంగూలీ స్మార్ట్ ఫోన్ చోరీకి గురైందని కోల్ కతాలోని ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో మాజీ కెప్టెన్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
Sourav Ganguly Police Complaint: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్మార్ట్ ఫోన్‌ను చోరీకి గురైంది. కోల్‌కతాలోని బెహలాలో తన నివాసంలో సౌరవ్ గంగూలీ స్మార్ట్ ఫోన్ చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం (ఫిబ్రవరి 11) నాడు ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని సమాచారం.
అయితే, గంగూలీ స్మార్ట్ ఫోన్ ఆచూకీ ఇంకా తెలిసిందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. గంగూలీ స్మార్ట్ ఫోన్ విలువ రూ. 1.6 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఆ ఫోన్ 2 5జీ సిమ్ కార్డుల సపోర్ట్‌తో ఉంటుందని తెలుస్తోంది. "ఇంట్లో నా ఫోన్ దొంగలించారని నేను అనుకుంటున్నాను. నేను చివరిసారిగా జనవరి 19 ఉదయం 11:30 గంటలకు నా ఫోన్ చూశాను. ఫోన్ కోసం ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు" అని సౌరవ్ గంగూలీ తెలిపారు.
"నా ఫోన్ పోయినందుకు నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే ఫోన్‌లో చాలా ఇంపార్టెంట్ కాంటాక్ట్ నంబర్లు, వ్యక్తిగత సమాచారం, పలు ఖాతాలకు యాక్సెస్ ఉంది. నా ఫోన్ త్వరగా ట్రేస్ చేసి కనిపెట్టాలి. అలాగే నా ఫోన్‌లోని సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నాను. ఫోన్‌ను వెంటనే గుర్తించి దానిలోని సమాచారం బయటకు రాకుండా పోలీసులు చూసుకోవాలి" అని సౌరవ్ గంగూలు అభ్యర్థించారు.
ఫోన్ దొంగలించబడిన సమయంలో ఇంట్లో పెయింటింగ్ పనులు జరుగుతున్నట్లు సౌరవ్ గంగూలీ తెలిపారు. దీంతో పెయింటింగ్ వర్కర్లను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ నష్టాల్లో ఉందని రేవ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ కామెంట్స్ చేశాడు. "అండర్ 19 వరల్డ్ కప్ నష్టాల్లో ఉన్న టోర్నమెంట్ అని చెప్పొచ్చు" అని గంగూలీ అన్నారు.
"సీనియర్ పురుషుల జట్లు పాల్గొనని చాలా ప్రపంచ కప్ టోర్నమెంట్స్ పెద్దగా లాభాలు చూడలేదు. కానీ, అండర్-19 ప్రపంచకప్ భారత్‌లో జరగకపోవడానికి కారణం అది కాదు. అయితే, అండర్ 19 వరల్డ్ కప్ ఇండియాలోనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను" అని సౌరవ్ గంగూలి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్‌కు అంతా సిద్ధమైంది. టైటిల్ కోసం ఫైనల్ వార్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత యువ జట్టు ఆరో టైటిల్‌పై కన్నేసింది. దక్షిణాఫ్రికాలోని బెనోనీ వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 11) అంటే నేడు ఆస్ట్రేలియా అండర్ 19 జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. అండర్ 19 ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం ఒంటి గంట 30 నిమిషాలకు (1:30 PM) ప్రారంభం అవుతుంది. ఈ అంతిమ పోరుకు టీమిండియా వరుసగా ఐదోసారి చేరింది.