ICC Test Rankings: బుమ్రాను వెనక్కి నెట్టి నంబర్ వన్ బౌలర్‌గా అశ్విన్.. మళ్లీ టాప్ 10లోకి రోహిత్ శర్మ
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా పేస్ బౌలర్ బుమ్రాను వెనక్కి నెట్టి స్పిన్నర్ అశ్విన్ టాప్ లోకి దూసుకెళ్లాడు. మరోవైపు బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ మరోసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు.
ICC Test Rankings: తాజాగా ఇంగ్లండ్ పై ఐదు టెస్టుల సిరీస్ ను 4-1తో గెలిచిన టీమిండియా ప్లేయర్స్ ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో సత్తా చాటారు. బుధవారం (మార్చి 13) రిలీజ్ చేసిన ఈ ర్యాంకుల్లో బౌలర్ల లిస్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ లోకి దూసుకెళ్లడం విశేషం. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న బుమ్రా దిగజారగా.. బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ 10లోకి వచ్చాడు.
అశ్విన్ నంబర్ వన్ బౌలర్
ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో రాణించిన టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. ఇన్నాళ్లూ టాప్ లో ఉన్న పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తో కలిసి బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మధ్యే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ లో హేజిల్ వుడ్ 6 వికెట్లు తీశాడు.
ఇక అశ్విన్ కు ఇంగ్లండ్ సిరీస్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ సిరీస్ లో టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయితోపాటు 100వ టెస్ట్ ఆడిన ఘనతను కూడా అందుకున్నాడు. ఇక సిరీస్ మొత్తంలో 26 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు. ఇక తన 100వ టెస్టులో 9 వికెట్లతో రాణించాడు. మరోవైపు బుమ్రా ఈ సిరీస్ లో 19 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
సిరీస్ లో మైలురాళ్లతోపాటు అశ్విన్ ఓ చేదు అనుభవాన్ని కూడా పొందాడు. రాజ్‌కోట్ టెస్ట్ సందర్భంగా తన తల్లి అనారోగ్యానికి గురవడంతో మ్యాచ్ మధ్యలోనే అతడు చెన్నై వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడంతా సెట్ అయిన తర్వాత మళ్లీ వచ్చిన అశ్విన్.. నాలుగు, ఐదో టెస్టులో రాణించాడు.
టాప్ 10లోకి రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ 10లోకి వచ్చాడు. ధర్మశాల టెస్టులో సెంచరీ చేసిన రోహిత్.. తాజా ర్యాంకుల్లో ఐదు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. తొలి స్థానంలో ఉన్న కేన్ విలియమ్సన్ కంటే 108 రేటింగ్ పాయింట్స్ తక్కువగా ఉన్నాయి. ఇక సిరీస్ టాప్ స్కోరర్ యశస్వి జైస్వాల్.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు.
తాజా ర్యాంకుల్లో యశస్వి రెండు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకు సాధించాడు. ఇక శుభ్‌మన్ గిల్ కూడా కెరీర్ బెస్ట్ 20వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా టాప్ లో కొనసాగుతుండగా.. అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో జడేజా కూడా బ్యాట్ తో ఓ సెంచరీ చేయడంతోపాటు బంతితోనూ రాణించాడు.
ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను 4-1తో గెలిచిన వెంటనే టీమిండియా టెస్టులలోనూ నంబర్ వన్ ర్యాంక్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం టీమిండియానే నంబర్ వన్ గా ఉంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లోనూ ఇండియా టాప్ లో కొనసాగుతోంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా.. మూడో స్థానంలో న్యూజిలాండ్ ఉంది.