Rohit Sharma: ‘అలా అనిపించిన రోజున..’: రిటైర్మెంట్‍ ప్లాన్‍పై మాట్లాడిన రోహిత్ శర్మ-ind vs eng team india captain rohit sharma comments on his retirement ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: ‘అలా అనిపించిన రోజున..’: రిటైర్మెంట్‍ ప్లాన్‍పై మాట్లాడిన రోహిత్ శర్మ

Rohit Sharma: ‘అలా అనిపించిన రోజున..’: రిటైర్మెంట్‍ ప్లాన్‍పై మాట్లాడిన రోహిత్ శర్మ

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 09, 2024 08:31 PM IST

Rohit Sharma - IND vs ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి కామెంట్ చేశాడు. ఐదో టెస్టులో భారత్ గెలిచిన తర్వాత ఈ విషయంపై అతడు మాట్లాడాడు.

Rohit Sharma: రిటైర్మెంట్‍పై కామెంట్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
Rohit Sharma: రిటైర్మెంట్‍పై కామెంట్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (AFP)

Rohit Sharma on Retire: కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దుమ్మురేపుతోంది. స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‍ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. బెన్ స్టోక్స్ కెప్టెన్సీలోని ఇంగ్లిష్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది భారత్. ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో నేడు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. మూడో రోజుల్లోనే విజయం సాధించింది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ దూకుడుగా ఆడుతోంది.

గతేడాది వన్డే ప్రపంచకప్‍లోనూ సత్తాచాటి ఫైనల్ చేరింది భారత్. అజేయంగా తుదిపోరుకు చేరింది. అయితే, ఫైనల్‍లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‍తో ఐదు టెస్టుల సిరీస్‍లో తొలి మ్యాచ్ ఓడాక.. భారత్ అద్భుతంగా పుంజుకుంది. 4-1 తేడాతో సిరీస్ గెలిచి సత్తాచాటింది. బ్యాటింగ్‍లోనూ దుమ్మురేపాడు హిట్‍మ్యాన్. ఈ ఏడాది జూన్‍లో జరగనున్న టీ20 ప్రపంచకప్‍లోనూ భారత్‍కు కెప్టెన్సీ చేయనున్నాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం రోహిత్ వయసు 36 ఏళ్లు కావడంతో అతడి రిటైర్మెంట్‍పై కూడా చర్చ జరుగుతోంది.

అలా అనిపించినప్పుడు..

ఇంగ్లండ్‍తో నేడు ఐదో టెస్టు తర్వాత టీమిండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్‍తో రోహిత్ శర్మ ముచ్చటించాడు. తన రిటైర్మెంట్ అంశంపై స్పందించాడు. ఒకవేళ ఏ రోజైన ఆటకు తానింక సరిపోనని అనిపించినప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తానని రోహిత్ శర్మ చెప్పాడు. మూడేళ్లుగా తాను అత్యుత్తమంగా ఆడుతున్నానని అన్నాడు.

“ఒకవేళ ఒక రోజు నిద్ర లేవగానే నేను సరిపోనని ఫీలైతే.. ఆట ఆడేందుకు ఇక సరిపోనని భావిస్తే.. దాని (రిటైర్మెంట్) గురించి నేను మాట్లాడతా. దాని గురించి తెలియజేస్తా. కానీ వాస్తవంగా చెప్పాలంటే.. గత రెండు, మూడేళ్ల నుంచి నా ఆట చాలా మెరుగైంది. నేను నా బెస్ట్ ఆట ఆడుతున్నా” అని రోహిత్ శర్మ చెప్పాడు.

భయం లేకుండా ఆడితే వ్యక్తిగత స్కోర్లు కూడా అవే వస్తాయని రోహిత్ శర్మ చెప్పాడు. ఆటపై ఫోకస్ చేస్తే హాఫ్ సెంచరీలు, శతకాలు వస్తాయని, వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాడు. “జనాలు కేవలం వ్యక్తిగత స్కోర్లను మాత్రమే చూస్తున్నారు. బాగా ఆడుతుంటే నంబర్లు అవే వస్తాయి. ఒకవేళ మీరు భయం లేకుండా ఉండి.. మీ మైండ్ క్లీన్‍గా ఉంటే.. ఇతర విషయాలు అవే జరుగుతాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. హాఫ్ సెంచరీ చేస్తానా? సెంచరీ చేస్తానా? అవన్నీ మంచి నంబర్లే. అయితే, అవన్నీ మైండ్‍లో నుంచి తీసేసి.. కేవలం ఆటపైనే దృష్టి సారించాలి” అని రోహిత్ శర్మ చెప్పాడు.

ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో అతడి బ్యాటింగ్‍పై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రాజ్‍కోట్‍లో జరిగిన మూడో టెస్టులో శతకంతో హిట్‍మ్యాన్ విజృంభించాడు. ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో సెంచరీతో సత్తాచాటాడు హిట్‍మ్యాన్. ఈ సిరీస్‍లో 400 పరుగులు చేశాడు. తాను ఇంకా ఫామ్‍లోనే ఉన్నానని నిరూపించుకున్నాడు. మొత్తంగా ఈ సిరీస్‍లో భారత్‍ను అద్భుతంగా ముందుకు నడిపాడు కెప్టెన్ రోహిత్. భారీ విజయాలను భారత్ నమోదు చేసుకుంది.

Whats_app_banner