IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‍‍ను కూల్చేసిన భారత స్పిన్నర్లు.. టీమిండియా భారీ విక్టరీ.. చరిత్ర సృష్టించిన రోహిత్‍సేన-ind vs eng highlights india won by huge margin against england in 3rd test english batters surrendered for spinners ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 3rd Test: ఇంగ్లండ్‍‍ను కూల్చేసిన భారత స్పిన్నర్లు.. టీమిండియా భారీ విక్టరీ.. చరిత్ర సృష్టించిన రోహిత్‍సేన

IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‍‍ను కూల్చేసిన భారత స్పిన్నర్లు.. టీమిండియా భారీ విక్టరీ.. చరిత్ర సృష్టించిన రోహిత్‍సేన

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 18, 2024 05:31 PM IST

India vs England 3rd Test: ఇంగ్లండ్‍పై మూడో టెస్టులో భారీ విజయం సాధించింది టీమిండియా. భారత స్పిన్నర్ల విజృంభణతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ బ్యాటర్లు కుప్పకూలారు. దీంతో టీమిండియా ఓ రికార్డు సృష్టించింది. అలాగే, ఈ సిరీస్‍లో భారత్ ఆధిక్యంలోకి వచ్చేసింది.

IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‍ కూల్చేసిన భారత స్పిన్నర్లు.. టీమిండియా భారీ విక్టరీ.. చరిత్ర సృష్టించిన రోహిత్‍సేన
IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‍ కూల్చేసిన భారత స్పిన్నర్లు.. టీమిండియా భారీ విక్టరీ.. చరిత్ర సృష్టించిన రోహిత్‍సేన (AFP)

IND vs ENG 3rd Test: స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో టీమిండియా మరోసారి సత్తాచాటింది. ఇంగ్లిష్ జట్టును గడగడలాడించి మూడో టెస్టులో భారీగా గెలిచింది. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ద్విశకతంతో ఇంగ్లండ్ బౌలర్లను గడగడలాడిస్తే.. రవీంద్ర జడేజా స్పిన్ దెబ్బకు ఇంగ్లిష్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. దీంతో రాజ్‍కోట్ వేదికగా మూడో టెస్టులో నాలుగో రోజైన నేడు (ఫిబ్రవరి 18) భారత్ 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‍పై ఏకపక్ష విజయం సాధించింది.

557 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా.. దిక్కుతోచని స్థితిలో పడిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో పట్టుమని 40 ఓవర్లు కూడా నిలువలేకపోయింది. భారత స్పిన్నర్ల విజృంభణతో నాలుగో రోజైన నేడు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకు కుప్పకూలింది. భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 12.4 ఓవర్లలో 41 పరుగులే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లిష్ బ్యాటింగ్ లైనప్‍ను వణికించాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు, రవిచంద్రన్ అశ్విన్, స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఇంగ్లండ్ బ్యాటర్లలో పదో స్థానంలో వచ్చిన మార్క్ వుడ్ (33) మినహా మరెవరూ కూడా కనీసం 20 పరుగుల మార్క్ చేరలేకపోయారు. భారత స్పిన్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలింది స్టోక్స్ సేన. 39.4 ఓవర్లలోనే రెండో ఇన్నింగ్స్ ముగించి.. భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మూడో టెస్టులో గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

చరిత్ర సృష్టించిన భారత్

ఇంగ్లండ్‍తో ఈ మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది టీమిండియా. టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అత్యంత పెద్ద విజయంగా ఉంది. అద్భుతమైన ఆట తీరుతో రోహిత్ శర్మ సేన ఈ గ్రాండ్ విక్టరీని అందుకుంది.

యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ (214 పరుగులు నాటౌట్) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా నేడు 4 వికెట్లకు 430 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుభ్‍మన్ గిల్ (91), సర్ఫరాజ్ ఖాన్ (68 నాటౌట్) కూడా అదరగొట్టారు. జైస్వాల్ ఈ సిరీస్‍లో రెండో ద్విశకతంతో అదరగొట్టాడు. అనంతరం 557 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే చాపచుట్టేసింది. కనీసం ఐదో రోజుకు కూడా మ్యాచ్‍కు తీసుకెళ్లలేక.. నాలుగో రోజే భారత స్పిన్నర్లకు దాసోహం అయింది.

పెవిలియన్‍కు బ్యాటర్ల క్యూ

భారీ లక్ష్యఛేదనకు నేడు రెండో సెషన్‍లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. అయితే, భారత్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ చాకచక్యంతో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (4) ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. జాక్ క్రాలీ (11)ను బుమ్రా ఔట్ చేశాడు. ఓలీ పోప్ (3), జానీ బెయిర్ స్టో (4), జో రూట్ (7)లను వెంటవెంటనే ఔట్ చేసి ఇంగ్లండ్‍ను కష్టాల్లోకి నెట్టాడు భారత స్పిన్నర్ జడేజా. కాసేపు నిలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ (15)ను కుల్దీప్ ఔట్ చేయగా.. ఫోక్స్ (16)ను జడేజా పెవిలియన్‍కు పంపాడు. చివర్లో మార్క్ వుడ్ (33) కాసేపు మెరిపించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైన చేసింది. వ్యక్తిగత కారణాలతో మూడో రోజుకు దూరమై.. జట్టులోకి మళ్లీ తిరిగి వచ్చిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్ టామ్ హార్ట్లీ (16) ఔట్ చేశాడు. మార్క్ వుడ్‍ను చివరి వికెట్‍గా పంపాడు జడేజా. దీంతో భారత్ భారీ విక్టరీ సాధించింది. 

బజ్‍బాల్ మళ్లీ పెయిల్

టెస్టుల్లోనూ దూకుడుగా ఆడే ఆటతీరుకు ఇంగ్లండ్.. బజ్‍బాల్ అని పేరుపెట్టుకుంది. అయితే, భారత గడ్డపై అది ఫెయిల్ అవుతోంది. తొలి టెస్టులో ఎక్కువ భాగం భారత్ ఆధిపత్యం చెలాయించినా రెండో ఇన్నింగ్స్‌లో విఫలమవడంతో.. అనూహ్యంగా ఇంగ్లండ్ గెలిచింది. అయితే, రెండో టెస్టులో ఇంగ్లిష్ జట్టు పూర్తిగా తేలిపోయింది. 106 పరుగులతో తేడాతో భారత్ చేతిలో ఓడింది. ఇప్పుడు మూడో టెస్టులో ఇంగ్లిష్ జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. బజ్‍బాల్ మంత్రాన్ని నమ్ముకొని ఈ మూడో టెస్టులో కనీస ప్రతిఘటన చేయలేకపోయింది స్టోక్స్ సేన. టీమిండియాకు సరెండర్ అయిపోయింది. 

Whats_app_banner