Yashasvi Jaiswal Records: ఈ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా జైస్వాల్.. సిక్స్‌లలోనూ రికార్డులు
Yashasvi Jaiswal Records - IND vs ENG: వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన భారత యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన ఆటతో అదరగొట్టిన ఈ సెన్సేషన్ బ్యాటర్ కొన్ని రికార్డులను సాధించాడు. ఆ వివరాలివే..
Yashasvi Jaiswal Records: టీమిండియా యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫామ్‍లో ఉన్నాడు. అనన్య సామాన్యమైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. టెక్నిక్‍తో పాటు హిట్టింగ్‍తో కెరీర్ ఆరంభంలోనే పరుగుల వరద పారిస్తున్నాడు. తన ఏడో టెస్టులోనే రెండో డబుల్ సెంచరీతో జైస్వాల్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో రెండో టెస్టులో ద్విశతకం చేసిన యశస్వి జైస్వాల్.. రాజ్‍కోట్‍లో జరుగుతున్న మూడో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో నేడు (ఫిబ్రవరి 18) డబుల్ సెంచరీ(236 బంతుల్లో 214 పరుగులు; 14 ఫోర్లు, 12 సిక్సర్లు)తో అదరగొట్టాడు. వరుసగా రెండో ద్విశతకాన్ని చేసి ఈ 22 ఏళ్ల సంచలన బ్యాటర్ దుమ్మురేపాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ కొన్ని రికార్డులను సృష్టించాడు.
ఈ ఫీట్ సాధించిన తొలి భారత ప్లేయర్
ఇంగ్లండ్‍తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‍లో రెండు డబుల్ సెంచరీలతో జైస్వాల్ సత్తాచాటాడు. దీంతో.. టెస్టుల్లో ఇంగ్లండ్‍పై రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ, గుండప్ప విశ్వనాథ్, రాహుల్ ద్రవిడ్, చతేశ్వర్ పూజారా, మన్సూర్ అలీఖాన్.. టెస్టుల్లో ఇంగ్లండ్‍పై చెరో డబుల్ సెంచరీ చేశారు. అయితే, జైస్వాల్ ఇప్పుడు ఇంగ్లిష్ జట్టుపై రెండో ద్విశతకం నమోదు చేశాడు. ఇంగ్లండ్‍పై రెండు ద్విశతకాలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు.
ఓ టెస్టు సిరీస్‍లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన మూడో భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. వినోద్ కాంబ్లీ (1993- న్యూజిలాండ్‍పై), విరాట్ కోహ్లీ (2018 - శ్రీలంకపై) తర్వాత ఈ ఘనత దక్కించుకున్నాడు.
సిక్సర్లలోనూ రికార్డులు
ఇంగ్లండ్‍తో ఈ మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు బాదాడు యశస్వి జైస్వాల్. ఇంగ్లిష్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వేసిన ఓ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. కాగా, ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఇప్పటి వరకు పాకిస్థాన్ మాజీ ఆటగాడు వాసిమ్ అక్రమ్ (12 సిక్సర్లు) పేరిట ఉండగా.. యశస్వి జైస్వాల్ ఇప్పుడు దాన్ని సమం చేశాడు. అలాగే, భారత్ తరఫున ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు జైస్వాల్. నవజోత్ సింగ్ సిద్ధు (1994 - 10 సిక్సర్లు) రికార్డును జైస్వాల్ 12 సిక్సర్లతో అధిగమించాడు.
రోహిత్ రికార్డు బ్రేక్
ఓ టెస్టు సిరీస్‍లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగానూ యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఈ సిరీస్‍లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‍ల్లో అతడు 22 సిక్సర్లు బాదాడు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (19 సిక్సర్లు - 2019 దక్షిణాఫ్రికాతో సిరీస్‍లో)ను జైస్వాల్ దాటాడు.
సెంచరీ తర్వాత ఇబ్బందిగా అనిపించడంతో మూడో రోజు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్.. నాలుగో రోజైన నేడు డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడితో పాటు శుభ్‍మన్ గిల్ (91), సర్ఫరాజ్ ఖాన్ (68 నాటౌట్) సత్తాచాటడంతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 4 వికెట్లకు 430 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ఇంగ్లండ్ ముందు 557 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది భారత్.