Yashasvi Jaiswal: మరో సూపర్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్.. సెలెబ్రేషన్స్ వీడియో చూసేయండి
IND vs ENG 3rd Test - Yashasvi Jaiswal: భారత యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ మరో సెంచరీతో దుమ్మురేపాడు. అద్భుతమైన ఆటతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపాడు. శతకంతో ఈ మ్యాచ్‍లో టీమిండియాను బలమైన స్థానంలో నిలిపాడు.
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఆట తీరును కొనసాగించాడు. ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో విజృంభిస్తున్నాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో దుమ్మురేపిన యశస్వి.. ప్రస్తుతం జరుగుతున్న మూడో మ్యాచ్‍లో శకతంతో జోరు కొనసాగించాడు. ఇంగ్లండ్‍తో రాజ్‍కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు యశస్వి జైస్వాల్.
యశస్వి జైస్వాల్‍కు ఇది మూడో టెస్టు శతకంగా ఉంది. కేవలం 13 టెస్టు ఇన్నింగ్స్‌ల్లోనే (7వ టెస్టు) మూడో శతకాన్ని అతడు నమోదు చేసి సత్తాచాటాడు. 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్.. కాస్త ఇబ్బందిగా ఉండటంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
చివరి 75 పరుగులు.. 49 బంతుల్లోనే..
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ నిదానంగానే ఆరంభించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (19) ఔటయ్యాక కాసేపు ఆచితూచి ఆడాడు. అయితే, కాసేపటి తర్వాత యశస్వి విజృంభించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. హిట్టింగ్‍తో చెలరేగాడు. కొన్ని రివర్స్ స్వీప్‍లతో ఇంగ్లిష్ స్పిన్నర్లకు చుక్కలు చూపాడు. 80 బంతుల్లో అర్ధ శకతం చేసిన యశస్వి జైస్వాల్.. సెంచరీకి 122 బంతుల్లోనే చేరుకున్నాడు. శతకంలో చివరి 75 పరుగులను కేవలం 49 బంతుల్లోనే చేశాడు జైస్వాల్. 122 బంతుల్లో సెంచరీకి చేరాడు.
సెంచరీ చేశాక సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు యశస్వి. బ్యాట్, హెల్మెట్‍ను పట్టుకొని గాల్లోకి ఎగిరి.. అరుస్తూ సంబరం చేసుకున్నాడు. తన మూడో టెస్టు సెంచరీని సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆకాశం వైపుగా చూస్తూ అభివాదం చేశాడు. సెంచరీ తర్వాత కాసేపటికే అతడు రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‍కు వెళ్లాడు.
యశస్వి జైసాల్ సెంచరీతో పాటు శుభ్‍మన్ గిల్ (65 నాటౌట్)తో మూడో టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 196 పరుగుల వద్ద మూడో రోజును టీమిండియా ముగించింది. ప్రస్తుతం 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో శుభ్‍మన్ గిల్, కుల్‍దీప్ యాదవ్ (3 నాటౌట్) ఉన్నారు. రేపు నాలుగో రోజు ఆటలో వారు బ్యాటింగ్ కొనసాగించన్నారు.
యశస్వి అద్భుతమైన ఫామ్
ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శకతం చేశాడు యశస్వి. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ద్విశకతం చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు యశస్వి జైస్వాల్ (209). తన అంతర్జాతీయ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ చేశాడు. ఇప్పుడు మూడో టెస్టులో సెంచరీతో మరోసారి కదం తొక్కాడు. అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నారు. ఫ్యూచర్ టీమిండియా స్టార్ అంటూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెడుతున్నాడు యశస్వి.