Rohit Sharma Century: హమ్మయ్యా.. రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. అతి కూడా సరైన సమయంలో. ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ లో బలహీనమైన బ్యాటింగ్ ఆర్డర్ కు వెన్నెముకలా నిలుస్తూ.. హిట్ మ్యాన్ సెంచరీ బాదాడు. రాజ్‌కోట్ టెస్టులో తొలి రోజే 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్ ను ఆదుకోవడంతోపాటు ఇంగ్లండ్ పై మూడో సెంచరీ కొట్టడం విశేషం.
కెప్టెన్ రోహిత్ శర్మ మొదట్లోనే ఔటయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కాడు. స్లిప్స్ లో జో రూట్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్.. తర్వాత మరో అవకాశం ఇవ్వలేదు. టెస్టుల్లో 11వ సెంచరీ, ఇంగ్లండ్ పై మూడో సెంచరీ చేయడం గమనార్హం.157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ లతో రోహిత్ ఈ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ పై గతంలో చెన్నై, ఓవల్ లలో జరిగిన టెస్టుల్లోనూ రోహిత్ సెంచరీలు చేశాడు. ఇప్పుడిది వాళ్లపై మూడో సెంచరీ.
టెస్టు మొదలైన తొలి 45 నిమిషాల్లోనే యశస్వి, గిల్, రజత్ పటీదార్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును జడేజాతో కలిసి రోహిత్ ఆదుకున్నాడు. ఈ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన అతడు.. సరైన సమయానికి అదిరిపోయే ఫామ్ లోకి వచ్చాడు. తన సొంతగడ్డపై జడేజా కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొంది ఐదో స్థానంలో వచ్చాడు.
ఈ బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో టెస్టుల్లో మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో ఎక్కువ సిక్స్ లు కొట్టిన ఇండియన్స్ జాబితాలో ధోనీని వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వచ్చాడు. ఈ ఇన్నింగ్స్ లో తొలి సిక్స్ కొట్టిన తర్వాత 77 సిక్స్ లతో ధోనీని సమం చేశాడు. తర్వాతి సిక్స్ తో ధోనీని అధిగమించాడు. ఇక ఇప్పుడు సెహ్వాగ్ కొట్టిన 91 సిక్స్ ల రికార్డుపై రోహిత్ కన్నేశాడు.
ప్రస్తుతం సెహ్వాగ్ టెస్టుల్లో ఇండియా తరఫున అత్యధిక సిక్స్ లు బాదిన ప్లేయర్ గా ఉన్నాడు. నిజానికి ఈ ఇన్నింగ్స్ లో 27 పరుగుల దగ్గరే రోహిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కాడు. హార్ట్‌లీ బౌలింగ్ లో స్లిప్స్ లో రూట్ కు క్యాచ్ ఇచ్చినా అతడు అందుకోలేకపోయాడు. డైవ్ చేసి క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించినా చేతుల్లో పడినట్లే పడి చేజారిపోయింది.
ఇక ఆ తర్వాత ఆండర్సన్ బౌలింగ్ లో అతన్ని అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు. కానీ రోహిత్ వెంటనే రీవ్యూ తీసుకున్నాడు. అందులో నాటౌట్ అని తేలింది. అది ఇన్‌సైడ్ ఎడ్జ్ కావడంతో మూడో అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఆ సమయంలో రోహిత్ వికెట్ కోల్పోయి ఉంటే టీమిండియా మరిన్ని కష్టాల్లో పడేదే. అయితే ఐదో స్థానంలో వచ్చిన జడేజాతో భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లాడు.