Team India: ‘రోహిత్ శర్మ.. నెక్స్ట్ ఎంఎస్ ధోనీ’: సురేశ్ రైనా ఆసక్తికర కామెంట్లు-rohit sharma is the next ms dhoni says suresh raina team india cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: ‘రోహిత్ శర్మ.. నెక్స్ట్ ఎంఎస్ ధోనీ’: సురేశ్ రైనా ఆసక్తికర కామెంట్లు

Team India: ‘రోహిత్ శర్మ.. నెక్స్ట్ ఎంఎస్ ధోనీ’: సురేశ్ రైనా ఆసక్తికర కామెంట్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 27, 2024 08:30 PM IST

Suresh Raina on Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ స్టార్ సురేశ్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీలతో హిట్‍మ్యాన్‍ను రైనా పోల్చాడు.

Team India: ‘రోహిత్ శర్మ.. నెక్స్ట్ ఎంఎస్ ధోనీ’: సురేశ్ రైనా ఆసక్తికర కామెంట్లు
Team India: ‘రోహిత్ శర్మ.. నెక్స్ట్ ఎంఎస్ ధోనీ’: సురేశ్ రైనా ఆసక్తికర కామెంట్లు (ANI )

Team India: స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో ఇంగ్లండ్‍ను టీమిండియా గడగడలాడిస్తోంది. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ సారథ్యంలోని భారత్ ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‍లో 3-1తో ముందడుగు వేసింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురుస్తున్నాయి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా జట్టును రోహిత్ సమర్థంగా నడిపిస్తున్నాడంటూ కొందరు పొగుడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ సురేశ్ రైనా వచ్చేశాడు. హిట్‍మ్యాన్‍ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేశాడు.

భారత దిగ్గజ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీతో రోహిత్ శర్మను పోల్చాడు సురేశ్ రైనా. యువ ఆటగాళ్లకు అవకాశాలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని రోహిత్ ఇస్తున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ రైనా చెప్పాడు. ధోనీ కూడా అప్పట్లో అలాగే చేశాడని గుర్తు చేశాడు.

రోహిత్ శర్మ సరైన దారిలో ముందుకు సాగుతున్నాడని, అతడో అద్భుతమైన కెప్టెన్ అని సురేశ్ రైనా చెప్పాడు. “అతడు (రోహిత్) నెక్స్ట్ ఎంఎస్ ధోనీ. ఎంఎస్ ధోనీ చేసినట్టే యువ ఆటగాళ్లకు అతడు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు. ధోనీ సారథ్యంలో నేను చాలా క్రికెట్ ఆడాను. అతడి టీమ్‍ను సౌరవ్ గంగూలీ చాలా సపోర్ట్ చేశాడు. ఎంఎస్ ధోనీ ముందుకు వచ్చి జట్టుకు సారథ్యం వహించాడు. రోహిత్ శర్మ సరైన దిశలో ముందుకు సాగుతున్నాడు. అతడు అద్భుత కెప్టెన్” అని రైనా అన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేసిన 15 టెస్టుల్లో భారత్ తొమ్మిది మ్యాచ్‍ల్లో గెలిచింది.

సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్‍కు అవకాశం ఇచ్చిన రోహిత్ శర్మను రైనా ప్రశంసించాడు. రాజ్‍కోట్ టెస్టుతో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తొలి మ్యాచ్‍లోనే రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు చేశాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతంగా ఆడిన ధృవ్ జురెల్ టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు.

“నేను ఆ క్రెడిట్ రోహిత్ శర్మకు ఇవ్వాలని అనుకుంటున్నా. ముందుగా అతడు సర్ఫరాజ్ ఖాన్‍కు జట్టులో అవకాశం ఇచ్చాడు. ధృవ్ జురెల్‍ను కూడా జట్టులోకి తీసుకున్నాడు” అని సురేశ్ రైనా చెప్పారు. ఒత్తిడిని రోహిత్ అధిగమిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. సర్ఫరాజ్, జురెల్ ఇద్దరూ ఈ సిరీస్‍లో మూడో టెస్టుతోనే టీమిండియాలోకి అరంగేట్రం చేశారు.

ఇంగ్లండ్‍తో నాలుగు టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో ఓ దశలో భారత్ వెనుకంజలో ఉండగా.. ధృవ్ జురెల్ 90 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత భారత బౌలర్లు విజృభించి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‍ను 145 పరుగులకే కుప్పకూల్చారు. ఆ తర్వాత లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. 3-1తో ముందడుగు వేసి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను భారత్ దక్కించుకుంది. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా మార్చి 7న ఐదో టెస్టు మొదలుకానుంది.

Whats_app_banner