Ganguly on Rohit Sharma: టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడమే కరెక్ట్: సౌరవ్ గంగూలీ
Ganguly on Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్సీ రోహిత్ శర్మకు ఇవ్వడమే సరైనదని అన్నాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. జూన్ 1 నుంచి 29 వరకు కరీబియన్ దీవులు, యూఎస్ఏలో ఈ మెగా టోర్నీలో జరగనున్న విషయం తెలిసిందే.
Ganguly on Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలి? ఈ ప్రశ్నకు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ సమాధానం చెప్పేశాడు. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడమే సరైనదని అతడు స్పష్టం చేశాడు. చాలాకాలంపాటు టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉన్న రోహిత్.. ఈ మధ్యే ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ కు కెప్టెన్ గా తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫార్మాట్ లోనూ అతడు కెప్టెన్ అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.
రోహిత్‌కు ఇవ్వడమే కరెక్ట్
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ అంశంపై మిడ్ డేతో మాట్లాడాడు. ఈ మధ్యే ఆఫ్ఘనిస్థాన్ పై టీమ్ ను 3-0తో గెలిపించిన తర్వాత టీ20 వరల్డ్ కప్ లోనూ రోహితే కెప్టెన్ గా ఉంటాడని ఫ్యాన్స్ భావించారు. ఇప్పుడు గంగూలీ కూడా అదే సరైనదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా గతేడాది వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ జట్టును ఎలా ముందుండి నడిపించాడో దాదా గుర్తు చేశాడు.
"టీ20 వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మే సరైనోడు. అతడు గతేడాది 50 ఓవర్ల వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ కు ఎలా 10 వరుస విజయాలు సాధించి పెట్టాడో మనకు ఇప్పటికీ గుర్తుంది. అందుకే రోహిత్ కరెక్ట్ ఛాయిస్" అని గంగూలీ అన్నాడు. నిజానికి ఈ మధ్యే బీసీసీఐ కూడా పరోక్షంగా వరల్డ్ కప్ కు రోహితే కెప్టెన్ అని చెప్పిన విషయం తెలిసిందే.
జై షా మాట కూడా అదే..
బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ మధ్యే రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్ లో ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్టుకు ముందు సౌరాష్ట్ర స్టేడియం పేరును నిరంజన్ షా స్టేడియంగా మార్చిన తర్వాత జై షా మాట్లాడారు. గతేడాది వరల్డ్ కప్ ఓడినా.. ఈసారి మాత్రం రోహిత్ కెప్టెన్సీలో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందని ఆయన అన్నారు.
"మనం 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ వరుసగా 10 మ్యాచ్ లు గెలిచి అభిమానుల మనసులు గెలుచుకున్నాం. బార్బడోస్ లో ఇండియా టీ20 వరల్డ్ కప్ 2024ను రోహిత్ శర్మ కెప్టెన్సీలో గెలుస్తుందన్న నమ్మకం నాకుంది" అని జై షా అన్నారు. దీంతో పరోక్షంగా ఆ వరల్డ్ కప్ కు రోహితే కెప్టెన్ అని బీసీసీఐ కార్యదర్శి తేల్చేశారు.
నిజానికి టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీఫైనల్లో ఓడిన తర్వాత రోహిత్ శర్మ ఏడాదికిపైనే ఈ ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడు. ఈ మధ్యే ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ కోసం అనూహ్యంగా రోహిత్, కోహ్లిలను తీసుకొని వాళ్లు వరల్డ్ కప్ ఆడబోతున్నారని సెలక్టర్లు పరోక్షంగా చెప్పారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఇండియా టీ20 వరల్డ్ కప్ ఆడనుందన్న వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పడినట్లే. అయితే ఐపీఎల్లో మాత్రం ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని రోహిత్ నుంచి హార్దిక్ పొందడం గమనార్హం.