T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా కెప్టెన్ అతడే: స్పష్టత ఇచ్చిన జై షా-rohit sharma will lead team india in t20 world cup says bcci secretary jay shah ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా కెప్టెన్ అతడే: స్పష్టత ఇచ్చిన జై షా

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా కెప్టెన్ అతడే: స్పష్టత ఇచ్చిన జై షా

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 14, 2024 11:05 PM IST

T20 World Cup 2024 - Team India: ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‍లో భారత జట్టుకు కెప్టెన్‍గా ఎవరుంటారన్న విషయంపై కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. చాలా ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారు బీసీసీఐ కార్యదర్శి జై షా.

బీసీసీఐ కార్యదర్శి జై షా
బీసీసీఐ కార్యదర్శి జై షా (PTI)

T20 World Cup 2024: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనుంది. జూన్‍ 1వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ఈ మెగాటోర్నీ ఉండనుంది. ఇప్పటికే ఐసీసీ పూర్తి షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. సుమారు పదకొండేళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న టీమిండియాకు ఈ టీ20 ప్రపంచకప్ చాలా కీలకంగా మారింది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో ఎదురుదెబ్బ తగలగా.. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న కసితో భారత్ ఉంది. అయితే, టీ20 ప్రపంచకప్‍లో టీమిండియాకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల్లో కెప్టెన్‍గా ఎవరు ఉంటారన్న విషయంలో చాలా కాలంగా సందిగ్ధత నెలకొంది.

2022 టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్ నుంచి దూరంగా ఉన్నాడు. వన్డేలు, టెస్టులకే రోహిత్ పరిమితం కాగా.. టీ20 జట్టుకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేస్తూ వచ్చాడు. అయితే, ఈ ఏడాది జనవరిలో అఫ్గానిస్థాన్‍తో సిరీస్‍తో రోహిత్ శర్మ మళ్లీ భారత్ టీ20 జట్టులోకి వచ్చాడు. దీంతో టీ20 ప్రపంచకప్‍లో భారత కెప్టెన్‍ అంశంలో ఉత్కంఠ నెలకొంది. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు జై షా ఈ విషయంలో స్పష్టతనిచ్చేశారు. టీ20 ప్రపంచకప్‍లో టీమిండియాకు కెప్టెన్ ఎవరో వెల్లడించారు.

రోహితే కెప్టెన్

2024 టీ20 ప్రపంచకప్‍లో టీమిండియాకు రోహిత్ శర్మనే కెప్టెన్‍గా ఉంటాడని జై షా స్పష్టం చేశారు. అతడి సారథ్యంలో ప్రపంచకప్ టైటిల్‍ను భారత్ కైవసం చేసుకుంటుందని తనకు పూర్తి నమ్మకం ఉందని రాజ్‍కోట్‍లో నేడు జరిగిన ఓ ఈవెంట్‍లో చెప్పారు.

“ప్రపంచకప్ గురించి నేను ఏదైనా చెబుతానని అందరూ ఎదురుచూస్తున్నారు. 2023 వన్డే ప్రపంచకప్‍లో 10 మ్యాచ్‍లు గెలిచినా మనం టైటిల్ దక్కించుకోలేకపోయాం. అయితే హృదయాలను మాత్రం గెలిచాం. అందరికీ నేను ఓ ప్రామిస్ చేయాలనుకుంటున్నా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024లో మనం భారత్ జెండాను రెపరెపలాడిస్తాం” అని జై షా అన్నారు.

దీంతో 2024 టీ20 ప్రపంచకప్‍లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ అని జై షా చెప్పేశారు. మరోవైపు, గాయం నుంచి హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకున్నాడు. వరల్డ్ కప్‍లో అతడు వైస్ కెప్టెన్‍గా ఉండనున్నాడు.

రాజ్‍కోట్‍లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ నిరంజన్ షా పేరు పెట్టింది బీసీసీఐ. ఈ కార్యక్రమం నేడు జరిగింది. ఈ స్టేడియంలోనే రేపు (ఫిబ్రవరి 15) భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరగనుంది.

ఈ కార్యక్రమానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్‍తో పాటు మరికొందరు ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా హాజరయ్యారు. సౌరాష్ట్రకు చెందిన భారత క్రికెటర్లు చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనాద్కత్‍ను ఈ సందర్భంగా బీసీసీఐ సత్కరించింది.

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్ 1న మొదలుకానుండగా.. జూన్ 29న ఫైనల్ జరగనుంది. 20 జట్లు.. నాలుగు గ్రూప్‍లుగా ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం