Ravindra Jadeja: తండ్రి విమర్శలపై స్పందించిన రవీంద్ర జడేజా-ravindra jadeja reacts to his father anirudhsinh allegations on rivaba ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ravindra Jadeja: తండ్రి విమర్శలపై స్పందించిన రవీంద్ర జడేజా

Ravindra Jadeja: తండ్రి విమర్శలపై స్పందించిన రవీంద్ర జడేజా

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 09, 2024 03:16 PM IST

Ravindra Jadeja Family Controversy: తన తండ్రి అనిరుధ్ చేసిన విమర్శలపై భారత క్రికెటర్ రవీంద్ర జడేజా స్పందించారు. తన భార్య రివాబాపై చేసిన ఆరోపణలను ఖండించారు. అర్థం లేని వ్యాఖ్యలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (PTI)

Ravindra Jadeja: భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ జడేజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన కొడుకు రవీంద్ర, కోడలు రివాబాతో బంధాలు తెగిపోయానని, చాలా ఏళ్ల నుంచి వారితో కనీసం మాట్లాడడం లేదని అనిరుధ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ కుటుంబంలో చీలిక వచ్చేందుకు కోడలు రివాబానే కారణమని దివ్య భాస్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుధ్ చెప్పారు. ఒకే ఊర్లోనే ఉంటున్నా తన మనవరాలిని కూడా చూడలేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో రవీంద్ర జడేజా స్పందించారు.

తన తండ్రి అనిరుధ్ చేసిన ఆరోపణలపై రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఆయన చెప్పినవి అన్నీ అవాస్తవాలని, నాన్‍సెన్స్ అంటూ ట్వీట్ చేశారు. తన భార్య రివాబా ప్రతిష్టను దెబ్బ తీసేలా చేసిన ఈ ప్రయత్నాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

“ఆ ఇంటర్వ్యూలో చెప్పినవన్నీ అవాస్తవాలు, అర్థం లేని వ్యాఖ్యలు. అంతా ఒకవైపు నుంచే చెప్పారు. ఆ ఆరోపణలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. నా భార్య ప్రతిష్టను దెబ్బతీసేలా చేసిన ఈ ప్రయత్నాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. ఇది సరికాదు. నేను కూడా చెప్పాల్సింది చాలా ఉంది. కానీ బహిరంగంగా నేను అలా చేయను” అని రవీంద్ర జడేజా ట్వీట్ చేశారు.

తన తండ్రి అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై రవీంద్ర జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అర్థం లేని అబద్ధాలు అంటూ తీవ్రంగానే స్పందించారు. స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూల్లో ఆయన ఏం చెప్పారో మర్చిపోండి అంటూ జడేజా రాసుకొచ్చారు.

జడేజా తండ్రి ఏం చెప్పారంటే..

తన కొడుకు రవీంద్ర జడేజాను తమ నుంచి కోడలు రివాబా విడగొట్టారనేలా అనిరుధ్ చెప్పారు. జడేజాకు పెళ్లి చేయకుండా ఉండే బాగుండేదనిపిస్తోందని అన్నారు. పెళ్లయిన మూడు నెలలకే రవీంద్రను రివాబా పూర్తిగా మార్చేశారని చెప్పారు.

“రవీంద్ర జడేజా, అతడి భార్య రివాబాతో ఇప్పుడు ఎలాంటి సంబంధాలు లేవు. మేం వాళ్లకు కాల్ చేయం.. వాళ్ల మాకు కాల్ చేయరు. పెళ్లి తర్వాత మూడు నెలలకే సమస్యలు తలెత్తాయి. జామ్‍నగర్‌లో నేను ఒంటరిగా ఉంటున్నా. రవీంద్ర తన బంగ్లాలో ఉంటున్నాడు. ఇదే సిటీలో ఉన్నా అతడిని చూసేందుకు నేను వెళ్లను. అతడ నా కొడుకు. ఇది నా మనసును కాల్చేస్తోంది” అని అనిరుధ్ జడేజా చెప్పారు.

అలాగే, తన మనరాలిని కూడా ఇప్పటి వరకు తాము చూడలేదని అనిరుధ్ చెప్పారు. “నేను ఏదీ దాచాలనుకోవడం లేదు. మేం ఈ ఐదేళ్లలో మనవరాలి ముఖం కూడా చూడలేదు. రవీంద్ర బావలు అంతా చూసుకుంటారు. ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకుంటారు. వాళ్లకు ఓ బ్యాంక్ దొరికింది కాబట్టి వారు ఇలా చేస్తున్నారు” అని రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ చెప్పారు.

అయితే, అవన్నీ అవాస్తవాలని, తన భార్య రివాబా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తన తండ్రి అనిరుధ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని రవీంద్ర జడేజా స్పందించారు. అర్థం లేని మాటలు అంటూ ఖండించారు.

రవీంద్ర జడేజాకు రివాబాతో 2016లో వివాహమైంది. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‍నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రివాబా.

భారత్, ఇంగ్లండ్‍ మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‍లో తొలి టెస్టు ఆడాడు రవీంద్ర జడేజా. అయితే గాయం వల్ల రెండో టెస్టుకు దూరమయ్యారు. అయితే, మూడో టెస్టుకు అందుబాటులోకి వస్తాడో లేదో చూడాలి.

Whats_app_banner