Ravindra Jadeja Father: నా కొడుక్కి పెళ్లి చేసి తప్పు చేశా.. అతనితో బంధం తెగిపోయింది: రవీంద్ర జడేజా తండ్రి కామెంట్స్
Ravindra Jadeja Father: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన కొడుకుతో బంధం తెగిపోయిందని, అతనికి పెళ్లి చేసి తప్పు చేశానని అనడం గమనార్హం.
Ravindra Jadeja Father: రవీంద్ర జడేజాపై అతని తండ్రి షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. తన కొడుక్కి పెళ్లి చేసిన తర్వాత తమ మధ్య బంధం తెగిపోయిందని, తన కోడలు ఏం మాయ చేసిందోగానీ రెండు, మూడు నెలలకే వేరు కాపురం పెట్టినట్లు జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ చెప్పారు. రవీంద్ర జడేజా భార్య ఆ మధ్య గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా జడేజా కావడం గమనార్హం.
జడేజా పెళ్లి తర్వాతే ఇలా..
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 2016లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచే తన కొడుకుతో బంధం తెగిపోయిందని అతని తండ్రి అనిరుధ్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. "మీకు ఓ నిజం చెప్పమంటారా? నాకు రవీంద్ర, అతని భార్య రివాబాతో బంధం తెగిపోయింది.
వాళ్లు మాకు ఫోన్ చేయరు.. మేము వాళ్లకు చేయము. పెళ్లి తర్వాత రెండు, మూడు నెలలకే గొడవలు మొదలయ్యాయి. జామ్‌నగర్ లో నేను ఒంటరిగా ఉంటున్నాను. జడేజా మరో ఇంట్లో భార్యతో ఉంటున్నాడు. ఒకే ఊళ్లో ఉంటున్నా నేను అతన్ని కలవను. అతని భార్య ఏం మాయ చేసిందో అర్థం కావడం లేదు" అని ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ సింగ్ అన్నారు.
"అతడు నా కొడుకు. నా కడుపు రగిలిపోతోంది. అతనికి పెళ్లి చేసి తప్పు చేశాను. అసలు అతడు ఓ క్రికెటర్ కాకపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. పెళ్లయిన మూడు నెలలకే మొత్తం తన పేరు మీదికి మార్చాలని ఆమె డిమాండ్ చేసింది. మా కుటుంబంలో ఆమెనే చిచ్చు పెట్టింది. కుటుంబం వద్దునుకొని స్వతంత్రంగా బతకాలని భావించింది. నాది తప్పునుకోవచ్చు. కుటుంబంలోని మొత్తం 50 మందిదీ తప్పేనా? ప్రస్తుతం మా కుటుంబంలో మొత్తం ద్వేషమే మిగిలింది" అని అనిరుధ్ చెప్పారు.
నా మనవరాలిని చూడలేదు
ఐదేళ్లుగా తన మనవరాలిని తాను చూడలేదని రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ అన్నారు. "నేను ఏమీ దాచి పెట్టను. ఐదేళ్లుగా నా మనవరాలి ముఖం చూడలేదు. జడేజా అత్తగారింటి వాళ్లే మొత్తం చూసుకుంటారు. ప్రతి విషయంలో వాళ్లు జోక్యం చేసుకుంటారు. జడేజా రూపంలో వాళ్లకు ఓ బ్యాంక్ దొరికింది.
వాళ్లు సంతోషంగా ఉన్నారు" అని జడేజా తండ్రి అన్నారు. జడేజా భార్య రివాబా డిసెంబర్, 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
మూడో టెస్టులో జడేజా ఆడతాడా?
ఇంగ్లండ్ తో తొలి టెస్టులో రాణించిన రవీంద్ర జడేజా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు మిగిలిన మూడు టెస్టులకు జట్టును అనౌన్స్ చేసే ముందు గురువారం (ఫిబ్రవరి 8) రాత్రి ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫిట్‌నెస్ పై అతడు అప్డేట్ ఇఛ్చాడు. తాను కోలుకుంటున్నానని, ఇప్పుడు బాగానే ఉన్నట్లు అతడు వెల్లడించాడు.
ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంకా టీమ్ ను అనౌన్స్ చేయలేదు. జడేజా, రాహుల్ ఫిట్‌నెస్ పై సమాచారం అందిన తర్వాతే జట్టును అనౌన్స్ చేయనున్నారు.ఐదు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉన్నాయి.