WTC points table: ఒక్క విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్ మొత్తం మార్చేసిన న్యూజిలాండ్.. టీమిండియా స్థానం ఇదీ-wtc points table new zealnd win over south africa changed the ranks team india now at third place cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wtc Points Table: ఒక్క విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్ మొత్తం మార్చేసిన న్యూజిలాండ్.. టీమిండియా స్థానం ఇదీ

WTC points table: ఒక్క విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్ మొత్తం మార్చేసిన న్యూజిలాండ్.. టీమిండియా స్థానం ఇదీ

Hari Prasad S HT Telugu
Feb 08, 2024 02:42 PM IST

WTC points table: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ సాధించిన ఒక్క విజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) టేబుల్ మొత్తాన్నీ మార్చేసింది. కివీస్ విజయంతో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది.

సౌతాఫ్రికాపై తొలి టెస్టులో విజయం తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టాప్ లోకి న్యూజిలాండ్
సౌతాఫ్రికాపై తొలి టెస్టులో విజయం తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టాప్ లోకి న్యూజిలాండ్ (AFP)

WTC points table: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) టేబుల్ మళ్లీ మారిపోయింది. సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ తొలి టెస్టులో సాధించిన 281 పరుగుల భారీ విజయం మొత్తం మార్చేసింది. ఇంత వరకూ నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఈ గెలుపుతో ఏకంగా టాప్ లోకి దూసుకొచ్చింది. టాప్ లో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి, టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది.

డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ఇదీ

అనుభవం లేని సౌతాఫ్రికా జట్టును తొలి టెస్టులో న్యూజిలాండ్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఏకంగా 281 పరుగులతో గెలిచింది. ఈ విజయంతో తాజా డబ్ల్యూటీసీ సైకిల్లో 3 మ్యాచ్ లు ఆడిన న్యూజిలాండ్ రెండు గెలిచి, ఒకటి ఓడిపోయి 66.66 పర్సెంటేజ్ తో టాప్ లోకి వెళ్లింది. ఇక ఆస్ట్రేలియా టీమ్ 10 మ్యాచ్ లలో 6 విజయాలు, మూడు ఓటములు, ఒక డ్రాతో 55 పర్సెంటేజ్ తో రెండో స్థానానికి పడిపోయింది.

ఇంగ్లండ్ తో రెండో టెస్ట్ గెలిచి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి వెళ్లిన టీమిండియా.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఇండియన్ టీమ్ ఇప్పటి వరకూ ఈ సైకిల్లో 6 మ్యాచ్ లు ఆడి 3 గెలిచి, 2 ఓడి, ఒకటి డ్రా చేసుకొని 52.77 పర్సెంటేజ్ తో మూడో ర్యాంకులో ఉంది. న్యూజిలాండ్ చేతుల్లో భారీ ఓటమితో ఇంత వరకూ మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా టీమ్ ఏకంగా ఏడో స్థానానికి పడిపోయింది.

బంగ్లాదేశ్ 4, పాకిస్థాన్ ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక టీమ్స్ ఉన్నాయి. చాలా మంది స్టార్ ప్లేయర్స్ సౌతాఫ్రికా లీగ్ లో ఆడుతుండటంతో న్యూజిలాండ్ పర్యటనకు అనుభవం లేని ప్లేయర్స్ ను పంపించారు. దీంతో రెండో టెస్టులోనూ న్యూజిలాండ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించే అవకాశాలు మరింత మెరుగవుతాయి.

న్యూజిలాండ్, సౌతాఫ్రికా తొలి టెస్టు ఇలా..

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ పరుగుల వరద పారించింది. కేన్ విలియమ్సన్ రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు చేయగా.. తొలి ఇన్నింగ్స్ లో రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీ చేశాడు. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 247 పరుగులకే కుప్పకూలింది. 281 రన్స్ తో గెలిచిన న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్ లోకి వెళ్లింది.

2021లో తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన న్యూజిలాండ్.. ఇప్పుడు మరోసారి ఫైనల్ పై కన్నేసింది. ఇప్పటి వరకూ ఆ టీమ్ మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడింది. బంగ్లాదేశ్ తో సిరీస్ ను 1-1తో డ్రా చేసుకోగా.. ఇప్పుడు సౌతాఫ్రికాపై 1-0 ఆధిక్యంలో ఉంది.

మరోవైపు ఇంగ్లండ్ పై రెండో టెస్టులో గెలిచిన టీమిండియా మళ్లీ డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో టాప్ లోకి వెళ్లాలంటే సిరీస్ గెలవాల్సిందే. మరో మూడు టెస్టులు మిగిలి ఉండటంతో కనీసం రెండు గెలిస్తే సిరీస్ తోపాటు పర్సెంటేజ్ కూడా మెరగువుతుంది.

Whats_app_banner